వింబుల్డన్ మహిళల విజేత


Sun,July 16, 2017 02:44 AM

ముగురుజ ఫైనల్లో వీనస్‌పై విజయం
వింబుల్డన్ మహిళ విజేతగా స్పెయిన్ స్టార్
ఫైనల్లో వీనస్‌పై అలవోక విజయం

muguruza
ఓవైపు ఆశ.. మరోవైపు ఆరాటం..!ఒకరిది తొలి టైటిల్ వేట..!!మరొకరిది ఆరోదానికి ఆట..!!!ప్రత్యర్థి అనుభవం అపారం..తనది ఉరకలెత్తే ఉత్సాహం..ఆనాటి ఆశలకు చెల్లెలు అడ్డుకట్ట వేసింది..ఈనాటి అంచనాలకు అక్క తలకిందులైంది..వీనస్ గెలిస్తే కొత్త చరిత్ర.. ముగురుజా ఓడితే షరా మామూలే..కానీ ఇక్కడే ఫలితం తారుమారైంది. కాలం ఓ అవకాశాన్నిచ్చింది..ఆట ఓ అద్భుతాన్ని సాధించిపెట్టింది..ఫలితంగా.. 23 ఏండ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ..తన దేశ క్రీడా చరిత్రకు సరికొత్త తార్కాణంగా నిలుస్తూ.. స్పెయిన్ స్టార్ గార్బిని ముగురుజ..వింబుల్డన్‌లో సరికొత్త చాంపియన్‌గా అవతరించింది.

లండన్: అనుభవాన్ని, అంచనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆడిన స్పెయిన్ స్టార్ గార్బిని ముగురుజ.. కెరీర్‌లో తొలి వింబుల్డన్ టైటిల్‌ను సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో 7-5, 6-0తో పదోసీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)పై సంచలన విజయం సాధించింది. దీంతో స్పెయిన్ తరఫున వింబుల్డన్ టైటిల్ సాధించిన రెండో క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ముగురుజ కోచ్‌గా పని చేస్తున్న కోంచిత మార్టినెజ్ 1994లో మార్టినా నవ్రత్తిలోవాను ఓడించి తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకుంది. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన ముగురుజ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. మరోవైపు ఎనిమిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారీ ఆశలతో బరిలోకి దిగుతూ.. ఓపెన్ ఎరాలో ఓల్డెస్ట్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలువాలన్న అమెరికా నల్ల కలువ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. విజేతగా నిలిచిన ముగురుజాకు రూ. 18 కోట్ల 26 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
venus

ఆద్యంతం ఆధిపత్యమే..

మ్యాచ్ ఆరంభంలో చిరుజల్లులు పడటంతో రూఫ్‌ను మూసివేసి ఈ మ్యాచ్‌ను నిర్వహించారు. ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టిన ముగురుజ కేవలం 77 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్ పెట్టింది. బలమైన సర్వీస్‌లు అం తకుమించిన ఫోర్, బ్యాక్‌హ్యాండ్ షాట్ల తో పాటు తిరుగులేని క్రాస్‌కోర్టు విన్నర్స్‌తో చెలరేగిపోయింది. 22 ఏండ్ల కిందట ఇదే మైదానంలో తన అరంగేట్రం ఫైనల్లో ఓడిన వీనస్.. తొమ్మిదోసారి టైటిల్ పోరులోనూ అదే తడబాటును చూపెట్టింది. తొలిసెట్‌లో ఇరువురు సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో పది గేమ్‌ల వరకు మ్యాచ్ నిలకడగా సాగింది. ముగురుజ ఎక్కువగా బేస్‌లైన్ ర్యాలీలతో ఆకట్టుకుంటే.. వీనస్ క్రాస్ట్ కోర్టు గేమ్‌తో ముందుకెళ్లింది.

ఓ దశలో సెట్ గెలిచే అవకాశాన్ని వీనస్ చేజేతులా జారవిడుచుకుంది. స్కోరు 5-4 వద్ద రెండుసార్లు సెట్ పాయింట్ కోల్పోయి స్పెయిన్ క్రీడాకారిణికి పుంజుకునే అవకాశం ఇచ్చింది. స్కోరు 5-5తో సమం చేసిన ముగురుజ 11వ గేమ్‌లో వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పట్టుబిగించింది. 40-40 వద్ద అమెరికా ప్లేయర్ ఫోర్‌హ్యాండ్ ఫోర్స్‌డ్ తప్పిదం చేయడంతో ముగురుజ 6-5తో ముందంజ వేసింది. తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండోసెట్‌లో వీనస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఒకటి, మూడు, ఐదు గేమ్‌ల్లో ప్రత్యర్థికి సర్వీస్‌ను కోల్పోయి చేతులెత్తేసింది.

తొలిసెట్ కఠినంగా సాగింది. ఇద్దరికి చాలా అవకాశాలు వచ్చాయి. రెండేండ్ల కిందట సెరెనా చేతిలో ఓడా. ఏదో ఓ రోజు నేనిక్కడ గెలుస్తానని ఆ రోజే ఆమె చెప్పింది. ఫైనల్‌గా దాన్ని సాధించేశా.
- ముగురుజ

339

More News

VIRAL NEWS