ధోనీపై నిషేధం వేయాల్సింది


Sun,April 14, 2019 03:01 AM

dhoni
న్యూఢిల్లీ: అంపైర్‌తో వాగ్వాదం విషయంలో చెన్నై కెప్టెన్ ధోనీపై విమర్శల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ధోనీ తీరును తప్పుబడుతూ కొందరు మాజీలు విమర్శలు గుప్పిస్తుంటే.. మరికొందరు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించడంలో ముందుండే సెహ్వాగ్ మాత్రం..ధోనీ తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. చేసిన తప్పును సులువుగా తప్పించుకున్న మహీపై రెండు, మూడు మ్యాచ్‌లైనా నిషేధం వేయాల్సిందని సెహ్వాగ్ అన్నాడు. క్రిక్‌బజ్ వెబ్‌సైట్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ అంపైర్‌తో వాగ్వాదం వివాదంలో ధోనీ 50 శాతం జరిమానాతో సులువుగా తప్పించుకున్నాడు. చేసిన తప్పుకు రెండు, మూడు మ్యాచ్‌లు సస్పెన్షన్ విధించాల్సింది.

sehwag
ధోనీలాగే మరో జట్టు కెప్టెన్ కూడా ఇలాగే చేసే అవకాశముంటుంది. అలాంటప్పుడు అంపైర్‌కు విలువేముంటుంది. అతనిపై నిషేధం వేస్తే మిగతావారికి భయముండేది, కానీ జరిమానాతో సరిపెట్టారు. అంపైర్ తప్పు చేసినట్లు భావిస్తే..పెవిలియన్ నుంచే వాకీటాకీతో మాట్లాడే అవకాశముంది. భారత్ తరఫున ఇలాంటిది చేసుంటే నేను సంతోషించే వాణ్ని. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ధోనీని ఎప్పుడూ ఇలా చూడలేదు. చెన్నైకి ఆడుతున్నప్పుడే మహీ భావోద్వేగానికి లోనవుతున్నాడు అని సెహ్వాగ్ అన్నాడు.

ధోనీకి దాదా మద్దతు: మైదానంలో అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన చెన్నై కెప్టెన్ ధోనీకి ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. తన సహజశైలికి భిన్నంగా సహనం కోల్పోయిన ధోనీ..నోబాల్‌పై అంపైర్‌ను వేలెత్తి చూపడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. క్రికెట్‌లో అపార అనుభవమున్న ధోనీ ఇలా చేయడమేటంటూ పలువురు మాజీలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో మహీకి దాదా మద్దతుగా నిలిచాడు. ప్రతి ఒక్కరూ మనిషే. అం దరికీ భావావేశాలు ఉంటాయి. సందర్భా న్ని బట్టి ప్రవర్తించడమనేది మనిషి లక్షణం. దానికి ధోనీ అతీతుడేమి కాదు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో జట్టును గెలిపించాలనుకున్న ధోనీ తప్పును ఎత్తిచూపాడు అని గంగూలీ అన్నాడు.

ధోనీ స్ఫూర్తిప్రదాత: తాహిర్

అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన ధోనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుంటే.. చెన్నై జట్టు సభ్యుడు ఇమ్రాన్ తాహిర్ మాత్రం మహీని పొగడ్తలతో ముంచెత్తాడు. అతడు గొప్ప స్ఫూర్తిప్రదాత, అంతకుమించి మహోన్నత వ్యక్తి అని కొనియాడాడు. ధోనీ గ్లోబల్ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో తాహిర్ మాట్లాడుతూ.. ధోనీ గొప్ప నాయకుడే కాదు అంతకుమించి మంచి వ్యక్తి. ఎదుటివారికి సాయం చేసేందుకు ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటాడు అని పేర్కొన్నాడు.

1039

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles