ధోనీకి జరిమానా..


Sat,April 13, 2019 02:17 AM

మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత

Dhoni
జైపూర్: రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నో బాల్ వివాదంలో చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి జరిమానా పడింది. అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. చాలా అరుదుగా కోపాన్ని ప్రదర్శించే మహీ.. గురువారం రాత్రి ఉన్నట్టుండి సహనాన్ని కోల్పోయాడు. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 3 బంతుల్లో 8 పరుగులు కావాలి. ఈ దశలో స్టోక్స్ వేసిన నాలుగో బంతికి అంపైర్ ఉల్లాస్ గాంధీ నో బాల్ సిగ్నల్ ఇచ్చి ఉపసంహరించుకున్నాడు. అప్పటికే ఔటై డగౌట్‌లో కూర్చొన్న మహీ.. ఒక్కసారిగా మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. లెగ్ అంపైర్ బ్రూకెన్ ఆక్స్‌ఫర్డ్ సర్ది చెప్పడంతో మహీ వెనక్కి వచ్చాడు. ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళిలోని లెవల్-2 నిబంధనను ధోనీ ఉల్లంఘించాడని మ్యాచ్ రిఫరీ తేల్చాడు.

తప్పు చేశావ్.. ధోనీ

నో బాల్ వివాదంలో మాజీలు ధోనీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంపైర్లతో మహీ ప్రవర్తించిన తీరు సరిగా లేదని ధ్వజమెత్తారు. డగౌట్ నుంచి మైదానంలోకి వెళ్లి మరి వాగ్వాదానికి దిగడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, మార్క్ వా, మైకేల్ స్లేటర్, షాన్ టైట్ అన్నారు. ఒక్కసారి మైదానం విడిచి వెళ్లిన క్రికెటర్ మళ్లీ వచ్చి అంపైర్లను వివరణ కోరడం కచ్చితంగా తప్పేనని రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ తెలిపాడు. ధోనీ చేసింది ముమ్మాటికి తప్పే అయినా.. చిన్న అపరాధ రుసుముతో బయటపడ్డాడని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ ఐపీఎల్‌లో అంపైరింగ్ ప్రమాణాలు సరిగా లేవన్న ఆకాశ్ చోప్రా.. క్రికెటర్ ఔటయ్యాకా మైదానంలోకి వెళ్లే హక్కు లేదన్నాడు. హేమంగ్ బదానీ, దీప్ దాస్‌గుప్తా కూడా ఈ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ధోనీకి విధించిన జరిమానా చాలా చిన్నదని మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ అన్నాడు. ఈ విషయంలో నిర్వాహకులు అవలంభిస్తున తీరు బాగా లేదని ధ్వజమెత్తారు. క్రికెట్ కంటే ఎవరూ గొప్ప కాదని, నిబంధనలు అందరికి ఒకేలాగా ఉండాలని సూచించాడు.

289

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles