ధోనీ అండగా..రాయుడు ఆడగా..


Fri,April 12, 2019 02:29 AM

-చెన్నై విజయాల సిక్సర్
-కెప్టెన్‌గా ధోనీకి వందో విజయం
-4 వికెట్ల తేడాతో ఓడిన రాజస్థాన్

152 పరుగుల లక్ష్య ఛేదనలో.. 10 ఓవర్లలో చెన్నై స్కోరు 50/4. గెలువాలంటే 60 బంతుల్లో 102 పరుగులు కావాలి. క్రీజులో ధోనీ (43 బంతుల్లో 58; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాయుడు (47 బంతుల్లో 57; 2 ఫోర్లు, 3 సిక్సర్లు). ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఔటైనా గెలువడం కష్టమే అయిన తరుణంలో వీరిద్దరు 95 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో విజయానికి బాటలు పరిచారు. ఇక చెన్నై గెలుపు లాంఛనమే అనుకున్న తరుణంలో 18వ ఓవర్‌లో స్టోక్స్.. రాయుడు వికెట్ తీశాడు. అయినా మహీ ఉన్నాడనే భరోసా. 19వ ఓవర్‌లో 12 పరుగులు రావడంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 18గా మారడంతో ఉత్కంఠ మొదలైంది. స్టోక్స్ వేసిన చివరి ఓవర్ తొలి బంతిని జడేజా సిక్సర్‌గా మలిచాడు. తర్వాత నోబాల్ వేసినా.. మూడో బంతి సూపర్ యార్కర్‌కు ధోనీ క్లీన్‌బౌల్డ్. ఇక 3 బంతులు 8 పరుగులు కావాలి. క్రీజులో జడేజా, సాంట్నెర్.. తర్వాతి రెండు బంతులకు 4 పరుగులు వచ్చాయి. చివరి బంతికి ఫోర్ కావాలి. స్టోక్స్ వైడ్ వేశాడు. ఉత్కంఠ రెట్టింపైంది. కానీ ఆఖరి బంతిని సాంట్నెర్ సిక్సర్‌గా మల్చడంతో చెన్నై విజయాల సిక్సర్‌ను నమోదు చేసింది.

జైపూర్: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నది. తెలుగుతేజం అంబటి రాయుడు, కెప్టెన్ ధోనీ వీరోచిత ప్రదర్శనతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై గెలిచింది. ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. బట్లర్ (10 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టోక్స్ (26 బంతుల్లో 28; 1 ఫోర్), గోపాల్ (7 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడారు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్‌గా వందో విజయాన్ని అందుకున్నాడు. ఈ ఘనత ఇప్పటివరకు ఎవరూ సాధించలేదు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 166 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించాడు. 129 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్ 71 విజయాలు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.

వరుస విరామాల్లో..

పిచ్‌ను చక్కగా అంచనా వేసిన ధోనీ.. టాస్ గెలువగానే రెండో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు కూడా క్రమశిక్షణతో కూడిన బంతులు వేస్తూ రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను పూర్తిగా కట్టడి చేశారు. చాహర్ వేసిన తొలి ఓవర్‌లో బట్లర్ ఫోర్, సిక్స్ బాదగా, రెండో ఓవర్‌లో రహానే రెండు ఫోర్లు కొట్టాడు. కానీ మూడో ఓవర్‌లో చాహర్.. రహానేను ఎల్బీ చేసి షాకిచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చెన్నై రివ్యూలో ఈ వికెట్‌ను దక్కించుకుంది. తర్వాతి ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన బట్లర్ అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. ఆరు బంతుల తేడాలో ఈ ఇద్దరు ఔట్‌కావడంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ లయ దెబ్బతిన్నది. ఈ క్రమంలో ఆరో ఓవర్‌లో శామ్సన్ (6) కూడా వెనుదిరిగాడు. ఇక మిడిలార్డర్‌లో ఒక్కరు కూడా రాణించకపోవడంతో రాయల్స్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. స్మిత్ (15), త్రిపాఠి (10) సింగిల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో రన్‌రేట్ మందగించింది. అయినా ఈ ఇద్దరు వికెట్లను కాపాడుకోలేకపోయారు. 9వ ఓవర్‌లో త్రిపాఠి, 11వ ఓవర్‌లో స్మిత్ వెనుదిరిగారు. ఈ రెండు వికెట్లను తీసిన జడేజా స్కోరును బాగా కట్టడి చేశాడు. పరాగ్ (16)తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆదుకునే బాధ్యత తీసుకున్న స్టోక్స్ ఓ మాదిరిగా ఆడాడు. భారీ షాట్లు కొట్టే అవకాశం లేకపోవడంతో వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీసే ప్రయత్నతం చేశారు. 14వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన పరాగ్.. 15వ ఓవర్‌లో ఔటయ్యాడు. ఆర్చర్ (13 నాటౌట్) కూడా హిట్టింగ్ చేయలేకపోయాడు. 19వ ఓవర్‌లో స్టోక్స్ ఔట్‌కాగా, చివర్లో గోపాల్ వేగంగా ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.

కీలక భాగస్వామ్యం..

లక్ష్యం చిన్నదే అయినా.. చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే వాట్సన్ (0) లైన్ మిస్సయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రెండోఓవర్‌లో రైనా (4) అనవసరంగా రనౌటయ్యాడు. బంతిని ఫ్లిక్ చేసి లేని పరుగు కోసం ప్రయత్నించగా, ఆర్చర్ డైరెక్ట్ త్రోకు వెనుదిరిగాడు. ఆదుకుంటాడనుకున్న డుఫ్లెసిస్ (7) నాలుగో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఓవరాల్‌గా 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చెన్నై ఎదురీత మొదలుపెట్టింది. భారీ సిక్స్‌తో రాయుడు టచ్‌లోకి వచ్చినా.. రెండోఎండ్‌లో జాదవ్ (1) నిరాశపర్చాడు. ఆరో ఓవర్‌లో స్టోక్స్ కండ్లు చెదిరే క్యాచ్‌తో చెన్నైని దెబ్బకొట్టాడు. రెండో బంతికి రివ్యూ నుంచి బయటపడ్డ జాదవ్.. ఐదో బంతిని లిఫ్ట్ చేయబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో స్టోక్స్ చేతికి చిక్కాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై 24/4 స్కోరు చేసింది. ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్న రాయుడు, ధోనీ సమర్థంగానే నిర్వర్తించారు. 10 ఓవర్లలో స్కోరు 50/4కే పరిమితమైంది. ఇక 60 బంతుల్లో 102 పరుగులు కావాల్సిన దశలో ధోనీ సిక్సర్లతో ఊపు తెచ్చాడు. పరాగ్, గోపాల్‌ను లక్ష్యంగా చేసుకుని మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది.

ధోనీ ఆగ్రహం

ఆఖరి ఓవర్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్టోక్స్ వేసిన నాలుగో బంతికి సాంట్నెర్ రెండు పరుగులు తీశాడు. కానీ మొదటి పరుగు అందుకునే క్రమంలో అంపైర్ నో బాల్ సిగ్నల్ ఇచ్చాడు. బంతి ఎక్కువ ఎత్తులో వచ్చిందనే ఉద్దేశంతో మొదట సిగ్నల్ ఇచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నాడు. టీవీ రీప్లేలో కూడా ఇది స్పష్టంగా కనబడటంతో ధోనీ మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అయితే లెగ్ అంపైర్ సర్ది చెప్పడంతో ధోనీ వెనక్కి వెళ్లిపోయాడు.

స్కోరు బోర్డు

రాజస్థాన్ రాయల్స్: రహానే ఎల్బీ (బి) చాహర్ 14, బట్లర్ (సి) రాయుడు (బి) ఠాకూర్ 23, శామ్సన్ (సి) (సబ్) షోరే (బి) సాంట్నెర్ 6, స్మిత్ (ఇ) రాయుడు (బి) జడేజా 15, త్రిపాఠి (సి) జాదవ్ (బి) జడేజా 10, స్టోక్స్ (బి) చాహర్ 28, పరాగ్ (సి) ధోనీ (బి) ఠాకూర్ 16, ఆర్చర్ నాటౌట్ 13, గోపాల్ నాటౌట్ 19, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 151/7.వికెట్లపతనం: 1-31, 2-47, 3-53, 4-69, 5-78, 6-103, 7-126.బౌలింగ్: చాహర్ 4-0-33-2, సాంట్నెర్ 4-0-25-1, ఠాకూర్ 4-0-44-2, జడేజా 4-0-20-2, తాహిర్ 4-0-28-0.
చెన్నై సూపర్‌కింగ్స్: వాట్సన్ (బి) కులకర్ణి 0, డుఫ్లెసిస్ (సి) త్రిపాఠి (బి) ఉనాద్కట్ 7, రైనా రనౌట్ 4, రాయుడు (సి) గోపాల్ (బి) స్టోక్స్ 57, జాదవ్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 1, ధోనీ (బి) స్టోక్స్ 58, జడేజా నాటౌట్ 9, సాంట్నెర్ నాటౌట్ 10, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 155/6.వికెట్లపతనం: 1-0, 2-5, 3-15, 4-24, 5-119, 6-144.బౌలింగ్: కులకర్ణి 3-1-14-1, ఉనాద్కట్ 3-0-23-1, ఆర్చర్ 4-1-19-1, పరాగ్ 3-0-24-0, గోపాల్ 4-0-31-0, స్టోక్స్ 3-0-39-2

382

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles