భారత్ బుల్లెట్లు


Wed,May 16, 2018 01:11 AM

కండరాల్లో సత్తువ..మాంచి రన్నప్..చేతుల్లోంచి బంతిని విసిరితే బుల్లెట్ కన్నా వేగంతో దూసుకుపోవాల్సిందే. బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోవాల్సిందే. వికెట్లు దక్కినా, దక్కకపోయినా వారి బౌలింగ్ దెబ్బకు ప్రత్యర్థి దడుచుకోవాలనేది ప్రతీ పేస్ బౌలర్ కల. అది జరుగాలంటే బంతి వేగం కనీసం 150 మార్క్ దాటాల్సిందే..ఆ దరిదాపుల్లోనైనా ఉండాల్సిందే. షోయబ్, బ్రెట్‌లీ వంటి మహామహులకే సాధ్యమైన ఆ వేగాన్ని భారత కుర్ర పేసర్లూ అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే 149 మార్క్ దాటి ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నంలా మారారు. వీళ్లు విసిరే బంతులు బుల్లెట్ వేగానికి బ్లూ ప్రింట్‌లా మారాయి.

(నమస్తే తెలంగాణ క్రీడా విభాగం): క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాలే గుర్తొచ్చేవారు. కానీ అంతకు ముందు క్రికెట్ పేరు చెబితే మాల్కం మార్షల్, రిచర్డ్ హెడ్లీ, కర్ట్‌లీ ఆంబ్రోస్, ఆండీ రాబర్ట్స్, డెన్నిస్ లిల్లీ జెఫ్రీ థాంప్సన్ పేర్లు మార్మోగేవి. వీళ్లంతా గతంలో తమ పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించారు. ఆ తర్వాత బ్రెట్‌లీ, షోయబ్ అక్తర్ వేగంతో పోటీపడ్డారు. వాళ్లు విసిరిన బంతులు బుల్లెట్లలా దూసుకెళ్లేవి. ఆ వేగానికి బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకుపుట్టేది. పేస్ బౌలర్లంటే వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల నుంచే ఎక్కువగా వచ్చేవారు. ఆసియా దేశాలు, ఉపఖండం నుంచి షోయబ్ అక్తర్ ఒక్కడే పస ఉన్న పేసర్‌గా పేరుతెచ్చుకున్నాడు. భారత్ విషయానికొస్తే కపిల్‌దేవ్ ఒక్కడే తన ప్రాభవాన్ని చాటుకోగలిగాడు. భారత్ స్పిన్ బౌలింగ్, మీడియం పేసర్లతో నెట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టీమ్‌ఇండియా అమ్ములపొదిలో బుల్లెట్ లాంటి వేగంతో బంతులేసే పేస్ బౌలర్లున్నారు. తాజాగా ఐపీఎల్‌లో మన పేసర్లు విసిరిన బంతుల వేగానికి స్పీడో మీటరే షేక్ అయిందంటే అతిశయోక్తికాదు. అత్యంత వేగవంతమైన బంతులు విసిరిన టాప్-5 బౌలర్లో హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (149.94) తొలి స్థానంలో ఉండగా, శివం మావి(149.85), బరీందర్ శ్రన్ (149.34) అవేశ్ ఖాన్ (149.12), వరుసగా నిలిచారు. వీళ్లంతా భారత్ భవిష్యత్ ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారు.

siraj
mohd-siraj2

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

నిరుపేద కుటుంబం నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్. మొదట ఐపీఎల్(సన్‌రైజర్స్), ఆ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన సిరాజ్, ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకాన్ని సంపాదించడంటే సిరాజ్‌లో దాగున్న ప్రతిభేమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ కొన్ని మ్యాచ్‌ల్లో సిరాజ్ దారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ అతని బౌలింగ్‌లోని వైవిధ్యమే జట్టులో సుస్థిర స్థానాన్ని ఏర్పరిచింది. అంతేకాదు డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా మారాడు. ఆఖర్లో పరుగులను కాపాడుకోవాలంటే కోహ్లీ, సిరాజ్‌కే బంతిని అప్పగిస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్ శైలిని చూస్తే అంత వేగంగా బంతిని విసిరినట్టు కనిపించడు. కానీ బ్యాట్స్‌మెన్‌కు అంతుచిక్కకుండా వేగాన్ని నియంత్రిస్తూ, కావాల్సినప్పుడు పెంచుతూ ఉంటాడు. యార్కర్లే కాదు, నకుల్ బాల్స్ (స్లో బాల్స్) వేయడంలోనూ దిట్ట. ఇప్పటి వరకు 9 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 9 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్‌పై హైదరాబాద్ వేదికగా అత్యుత్తమ గణాంకాలు (3/25) నమోదు చేశాడు.


shivam-mavi
shivam-mavi2

లక్నో సూపర్ ఫాస్ట్

అండర్-19 ప్రపంచకప్ సాధించిన భారత్ జట్టులో కీలక ఆటగాడు శివం మావి. న్యూజిలాండ్‌లో జరిగిన ఆ మెగాటోర్నీలో ఆసీస్ అండర్-19 జట్టుపై 146 వేగంతో బంతులు విసిరి మాజీ క్రికెటర్లు గంగూలీ, ఇయాన్‌బిషప్(వెస్టిండీస్), కామెంట్రీ బాక్స్‌లో ఉన్న కివీస్ మాజీలను ఆశ్చర్యపరిచాడు. అదే వేగాన్ని కొనసాగించాలని కోచ్ ద్రవిడ్ సూచించడంతో, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే పర్యవేక్షణలో రాటుదేలాడు. ముఖ్యంగా బంతి పాతబడిన తర్వాత దాంతో యార్కర్లు సంధించడంలో మావికి మాస్టర్ డిగ్రీ ఉంది. నెట్స్‌లో ఎక్కువగా యార్కర్స్‌ను ప్రాక్టీస్ చేస్తాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న మావి మూడు వికెట్లు తీసినా, తన పేస్‌తో ఆకట్టుకున్నాడు. పేస్ బౌలర్‌కు ఉండాల్సిన దూకుడు ఇతడిలో పుష్కలంగా ఉన్నది.

avesh-khan
avesh-khan2

భోపాల్ బుల్లెట్

అవేశ్‌ఖాన్ బంగ్లాదేశ్‌లో జరిగిన 2016 అండర్-19లో తొలిసారిగా తళుక్కుమన్నాడు. ఒక మ్యాచ్‌లో 148.74 కి/గ వేగంతో బంతిని విసిరి అందరి దృష్టినీ ఆకర్షించాడు. వికెట్లు పడగొట్టడంలోనూ తనదైన ముద్ర వేశాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అవేశ్ అద్భుతమైన వేగంతో ఆకట్టుకుంటున్నాడు. సగటున 147కి పై చిలుకు వేగాన్ని కొనసాగిస్తున్న ఈ యువ బౌలర్ 149.12 వేగంతో అదుర్స్ అనిపించాడు. మహ్మద్ షమీ స్థానంలో జట్టులో చేరిన అవేశ్..వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. మావి తరహాలోనే ఇతడు సైతం మైదానంలో దూకుడు ప్రదర్శిస్తుంటాడు.
fast-bowlers2

3100

More News

VIRAL NEWS

Featured Articles