హెచ్‌సీఏ బరిలో అజర్


Wed,January 11, 2017 12:57 AM

-అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: నిన్నటిదాకా దేశ రాజకీయాల్లో పాలుపంచుకున్న భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ ఇప్పుడు క్రికెట్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష స్థానానికి అజర్ పోటీచేస్తున్నాడు. ఈమేరకు అజర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశాడు. రిటర్నింగ్ అధికారి రాజీవ్‌రెడ్డికి అజర్ తన నామినేషన్‌ను సమర్పించాడు. ఈనెల 17న ఎన్నికలు జరుగనున్నాయి. అవినీతి కూపంలో కూరుకుపోయిన హెచ్‌సీఏను సరైన బాటలో నడిపించేందుకే తాను రంగంలోకి దిగినట్లు అజర్ ప్రకటించాడు.
AZHAR
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆటపై దృష్టి సారించడం లేదు. హెచ్‌సీఏ పూర్తిగా నగరానికే పరిమితమైంది. జిల్లాస్థాయిలో క్రికెట్‌ను అభివృద్ధిపరచాల్సిన అవసరముంది. ఎందుకంటే కష్టపడే ఆటగాళ్లు ఎక్కువగా జిల్లాస్థాయి నుంచే వస్తారు. ఒకప్పుడు జాతీయ జట్టుకు అద్భుతమైన ఆటగాళ్లను అందించిన చరిత్ర మనకుంది. కానీ, ఇప్పుడు అది కనబడడం లేదు. హైదరాబాద్ క్రికెట్‌కు గత వైభవాన్ని తీసుకురావాలన్నదే నా లక్ష్యం అని అజర్ మీడియాతో అన్నాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో 2000 సంవత్సరంలో అజర్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని విధించడంతో, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అతను కోర్టుకెళ్లాడు. 2011 లో హైకోర్టు అజర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయినా కూడా అజర్‌ను బీసీసీఐ దా దాపు దూరంగా పెట్టింది. యూపీఏ-2 ప్రభుత్వ హ యాం లో యూపీలోని మొరాదాబాద్ ఎంపీగా ఎన్నికైన అజర్, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు హెచ్‌సీఏ రూపంలో క్రికెట్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

6 పదవులకు 60 నామినేషన్లు..


హెచ్‌సీఏ ఎన్నికల నామినేషన్లకు తుదిగడువు మంగళవారంతో ముగిసింది. కొత్త కార్యవర్గంలోని 6 పదవుల కోసం మొత్తం 60 మంది నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. లోధా నిబంధనల ప్రకారం ఎన్నికలకు అనర్హుడవడంతో ప్రస్తుత అధ్యక్షుడు అర్షద్ అయూబ్ నామినేషన్ దాఖలు చేయలేదు. ఇక అజర్‌కు వ్యతిరేకంగా మరో వర్గం నుంచి మాజీ సభ్యులు, మాజీ ఎంపీ జి. వివేక్ అధ్యక్షస్థానం కోసం బరిలో ఉన్నారు. వివేక్‌తో పాటు అతని వర్గం నుంచి గత కార్యవర్గ సభ్యులైన బాబూరావు సాగర్, భాస్కర్, చిట్టి శ్రీధర్‌లు ఈసారి కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటిదాకా హెచ్‌సీఏ కార్యవర్గంలో మొత్తం 22 పదవులు ఉండగా, లోధా నిబంధనలు అమలుచేయడంతో ఈసారి పదవుల సంఖ్య ఏకంగా 6కు పడిపోయింది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు మాత్రమే కార్యవర్గంలో చోటు కల్పించారు.

పోటీకి అజర్ అర్హుడేనా..?


హెచ్‌సీఏ అధ్యక్ష రేసులో నిలిచిన అజరుద్దీన్ నామినేషన్ చెల్లుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం.. అజర్‌కు ఇప్పటిదాకా హెచ్‌సీఏలో ఓటింగ్ హక్కు లేకపోవడమే. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఏదైనా రాష్ట్ర క్రికెట్ సంఘంలో పోటీచేయాలంటే, అందులో సభ్యత్వం ఉండాలి. లోధా నిబంధనల ప్రకారం 70ఏండ్ల లోపు వయసు, గతంలో ఏ పదవీ చేపట్టకపోవడం, ఐపీఎల్, చాంపియన్స్‌లీగ్‌లాంటి జట్లతో ఎలాంటి సంబంధం లేకపోవడం, మాజీ ఆటగాడై ఉండడంలాంటి అంశాలపరంగా చూసుకుంటే పోటీకి అజర్ పూర్తిగా అర్హుడు. కానీ, అసలు ఓటు హక్కే లేకుండా అజర్ పోటీలో ఎలా ఉంటాడంటూ హెచ్‌సీఏ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

హెచ్‌సీఏకు అనుబంధంగా 216 క్లబ్‌లుండగా, వాటిలోని దాదాపు క్లబ్ కార్యదర్శులంతా ఇప్పటికే ఓటర్లుగా నమోదుచేసుకున్నారు. ఆదివారంతో ఓటర్ల నమోదుకు గడువు ముగిసింది. అప్పటివరకైతే అజర్ ఓటరుగా పేరు నమోదుచేసుకోలేదు. దీంతో ఇప్పుడతని నామినేషన్‌ను ఆమోదిస్తారా లేదా అన్నదే ప్రశ్న. మరోవైపు హెచ్‌సీఏకు అనుబంధంగా ఉన్న నేషనల్ క్రికెట్ క్లబ్ (సీసీసీ) సభ్యుడి హోదాలోఅజర్ ఎన్నికల నామినేషన్ పత్రాన్ని సమర్పించినట్లుగా సమాచారం. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈనెల 12. అదేరోజు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించి బరిలో నిలిచేది ఎవరన్నది రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు. దీంతో అజర్ పోటీకి అర్హుడా లేదా అన్నది తేలాలంటే గురువారం వరకు ఆగాల్సిందే.

556
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS