విండీస్‌పై వన్డే సిరీస్ నెగ్గిన మిథాలీసేన


Fri,November 8, 2019 02:39 AM

india
నార్త్‌సాండ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల జట్టు వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన చివరి వన్డేలో మిథాలీ సేన 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లు స్మృతి మంధన (63 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (69; 6 ఫోర్లు) అర్ధశతకాలతో కదంతొక్కడంతో భారత జట్టు అలవోకగా విజయాన్నందుకుంది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించడంతో భారత్ 42.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 195 పరుగులు చేసి సిరీస్ చేజిక్కించుకుంది. గాయం కారణంగా సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్మృతి.. వచ్చీరాగానే విండీస్‌పై విరుచుకుపడింది. పూనమ్ రౌత్ (24), కెప్టెన్ మిథాలీ రాజ్ (20) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు విండీస్ 50 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (79) టాప్‌స్కోరర్. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
mandhana
ఫాస్టెస్ట్ 2000
వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగుల మైలురాయి అందుకున్న భారత తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి రికార్డుల్లోకెక్కింది. మంధన 51 ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగులు పూర్తిచేసింది. ఓవరాల్‌గా బెలిండా క్లార్క్ (45, ఆస్ట్రేలియా), మెగ్ లానింగ్ (45, ఆస్ట్రేలియా) తర్వాత మూడో స్థానంలో నిలిచింది. పురుషుల క్రికెట్‌లో ఈ మైలురాయిని దాటేందుకు కోహ్లీకి 53 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. అంతకన్నా రెండు ఇన్నింగ్స్‌ల ముందే స్మృతి ఈ ఫీట్ సాధించడం కొసమెరుపు.

సంక్షిప్త స్కోర్లు: వెస్టిండీస్: 194 (టేలర్ 79; జులన్ 2/30), భారత్: 195/4 (స్మృతి మంధన 77, జెమీమా 69; హేలీ 3/27).

419

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles