మిథాలీ ప్రపంచ రికార్డు


Wed,September 12, 2018 12:46 AM

-అత్యధిక వన్డేల్లో సారథ్యం..
-హైదరాబాదీ అరుదైన ఘనత..
-తొలి వన్డేలో లంకపై భారత్ ఘన విజయం

mithali
గాలె: అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో భారత వన్డే జట్టు కెప్టెన్, హైదరాబాదీ మిథాలీరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మహిళా కెప్టెన్‌గా అరుదైన రికార్డు నమోదు చేసింది. సుదీర్ఘ కెరీర్‌లో 195 వన్డేలు ఆడిన మిథాలీ 118 వన్డేలకు భారతజట్టుకు నాయకత్వ బాధ్యతలు నిర్వహించింది. 117 వన్డేలకు నాయకత్వం వహించిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా తాజాగా ఈ రికార్డును మిథాలీరాజ్ అధిగమించి తొలిస్థానంలో నిలిచింది. 101 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా క్రికెటర్ బెలిండా క్లార్క్ మూడోస్థానంలో కొనసాగుతుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 100కు పైగా వన్డే మ్యాచ్‌లలో కెప్టెన్లుగా వ్యవహరించింది వీరు ముగ్గురే కావడం విశేషం.

118 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లకు సారథిగా..

2003-04లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలిసారి భారత మహిళల జట్టుకు సారథిగా మిథాలీరాజ్ వ్యవహరించింది. అనంతరం కాలంలో రెండుసార్లు (2005,2017) ఏడాదిలో భారతవన్డే జట్టును ప్రపంచకప్ ఫైనల్‌కు తీసుకెళ్లింది. అంతేకాదు ఇప్పటివరకు 32 టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన మిథాలీ ప్రస్తుతం పొట్టి ఫార్మాట్ నుంచి కెప్టెన్‌గా తప్పుకోగా..ఆ స్థానంలోయువ హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా కొనసాగుతున్నది.

భారత్ అలవోక విజయం

మూడువన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన (73 నాటౌట్, 76 బంతుల్లో ) చెలరేగడంతో 99 పరుగుల విజయలక్ష్యాన్ని 19.1 ఓవర్లలో అలవోకగా ఛేదించిన మిథాలీసేన సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో ముందంజ వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు 35.1 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి(2), పూనమ్ యాదవ్(2), మన్సిజోషి (3) వికెట్లతో రాణించారు.

బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ..

సిరీస్‌లో భాగంగా గాలె మైదానంలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత అమ్మాయిల బౌలిగ్ ధాటికి శ్రీలంక జట్టు వద్ద సమాధానం లేకుండా పోయింది. 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన లంక జట్టు ఏదశలోనూ పుంజుకోలేక పోయింది. వారిజట్టులోని 8 మంది బ్యాట్స్‌విమెన్లు ఒక అంకె స్కోరుకే పరిమితం కాగా... ఓపెనర్ జయంగిణి (33) మాత్రం ఒంటరిపోరాటంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో లంక జట్టు వందలోపే కుప్పకూలింది.

మంధాన మెరుపులు

99 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్ మంధాన దూకుడుగా ఆడుతూ లంక బౌలర్లను చీల్చి చెండాడింది. అద్భుతమైన ఫాంలో ఉన్న స్మృతి ఎడాపెడా షాట్లు కొట్టడంతో పరుగులు సునాయాసంగా లభించాయి. స్మృతితో పాటు మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (24) రాణించింది. మరో 3 పరుగులు చేస్తే విజయం ఖాయమైన దశలో పూనమ్ ఔట్ కాగా..లాంఛనాన్ని ముగించిన భారత జట్టు విజయంతో సిరీస్‌లో శుభారంభం చేసింది. కాగా, రెండుజట్లు రేపు జరిగే రెండో వన్డేలో తలపడనున్నాయి.

910

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles