కౌన్ జీతేగా 4


Sun,May 12, 2019 02:10 AM

CSKVSMI

- ఎవరు గెలిచినా నాలుగోసారి టైటిల్ సొంతం
- ధోనీ దున్నేస్తాడా.. రోహిత్ రఫ్ఫాడిస్తాడా
- చెన్నై, ముంబై మధ్య హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ నేడే
- రాత్రి గం.7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో


ఆండ్రీ రస్సెల్ బౌలర్లకు పీడకలలు మిగిలిస్తే.. హార్దిక్ పాండ్యా అసలు నిద్రే పట్టకుండా చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా బుల్లెట్లు సంధిస్తే.. రబాడ బౌలింగ్‌కొస్తున్నాడంటేనే వణికేలా భయపెట్టాడు.వార్నర్, బెయిర్‌స్టో బెస్ట్ ఓపెనర్స్‌గా నిలిస్తే.. పంత్, అయ్యర్ తమకు తిరుగులేదనిపించుకున్నారు. అల్జారీ జోసెఫ్ ఆరు వికెట్లతో అల్లాడిస్తే.. స్యామ్ కరన్ హ్యాట్రిక్‌తో మురిపించాడు.కోహ్లీ, ఏబీ ఎంత ప్రయత్నించినా.. బెంగళూరు బెంగ తీర్చలేకపోయారు.మన్కడింగ్‌తో అశ్విన్ వార్తల్లోకెక్కితే.. అంపైర్లతో వాదించిన ధోనీ కొత్త గుర్తింపు తెచ్చుకున్నాడు.గోపాల్, రాహుల్ మేమున్నామంటూ ముందుకొస్తే.. మాలో చేవతగ్గలేదని తాహిర్, భజ్జీ నిరూపించుకున్నారు.ఎంత మంది పంత్, పాండ్యాలు వచ్చినా.. వరల్డ్ బెస్ట్ ఫినిషర్ తనేనని ధోనీ మరోసారి చాటిచెప్పాడు.
CSKVSMI1
లీగ్ చరిత్రలో తొలిసారి 12 పాయింట్లు సాధించిన జట్టు నాకౌట్ చేరితే.. ఏడేండ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కొచ్చిన ఢిల్లీ అక్కడితోనే సరిపెట్టుకుంది. టీవీ షో వివాదం తమ ఆటపై ప్రభావం చూపలేదని రాహుల్, హార్దిక్ నిరూపించుకుంటే..బాల్ ట్యాంపరింగ్ తమను ఇంకా రాటుదేల్చిందని స్మిత్, వార్నర్ చాటిచెప్పారు.అంపైర్లు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే.. ఇది గల్లీ క్రికెట్ కాదు ఐపీఎల్ అని కోహ్లీ బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు. దేశవాళీ అంపైర్ల సామర్థ్యంపై సవాలక్ష ప్రశ్నలు తలెత్తితే..అంతర్జాతీయ అంపైర్ డ్రెస్సింగ్‌రూం డోర్ తన్ని ఫైన్ కట్టాడు.

ఇలా ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులతో.. 50 రోజులుగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఐపీఎల్-12వ సీజన్ పతాక సన్నివేశానికి చేరుకుంది. లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య నేడు హైదరాబాద్ వేదికగా తుదిపోరు జరుగనుంది. ఆడిన ప్రతీ సీజన్‌లోనూ టైటిల్ వేటలో ముందుంటున్న చెన్నై సింహాలు ఓవైపు.. పట్టుబడితే వదిలేది లేదంటూ దూసుకెళ్లే ముంబై పులులు మరోవైపు. ఒకటి నుంచి 9 వరకు అంతా హిట్టర్లతో దట్టంగా కనిపిస్తున్న రోహిత్ సేన, స్పిన్నర్లే ప్రధానాయుధంగా బరిలో దిగనున్న ధోనీ గ్యాంగ్. ఇప్పటికే చెరో మూడుసార్లు ట్రోఫీని ముద్దాడిన ఈ రెండు జట్లలో ఫెంటాస్టిక్ 4కొట్టేదెవరో.. భాగ్యనగరం సాక్షిగా నేడే తేలనుంది.

చెన్నై బలాలు

- పరుగుల వీరుడు ధోనీ (414)
- వికెట్ల ధీరుడు తాహిర్ (24)

చెన్నై బలం బలగం అంతా ధోనీనే. సాధారణ ఆటగాడి నుంచి అసాధారణ ప్రదర్శనను రాబట్టడంలో మహీకి సాటిలేరనేది నిర్వివాదాంశం. సరైన సమయంలో బౌలింగ్ మార్పు లు చేస్తూ.. బౌలర్ మనసెరిగి పీల్డింగ్ కూర్పులు చేస్తూ.. బ్యాట్‌పట్టి బరిలో దిగితే మెరుపులతో మైమరిపిస్తూ.. ఇలా ప్రతీ అంశంలోనూ ధోనీ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. బుల్లెట్ ట్రైన్‌ను మించి వేగంగా అతడు చేసే మెరుపు స్టంపింగ్‌ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గత మ్యాచ్‌లో ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ అర్ధసెంచరీలతో కదం తొక్కడం కలిసొచ్చే అంశమైతే మిడిలార్డర్‌లో ధోనీ, జడేజా టచ్‌లో ఉండటం సానుకూలాంశం. బౌలింగ్‌లో తాహిర్, హర్భజన్, జడేజాతో కూడిన స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడం ఎంతటి జట్టుకైనా కష్టసాధ్యమే. పవర్‌ప్లేలో దీపక్, డెత్ ఓవర్స్‌లో బ్రేవో ఎంత ప్రమాదకారులో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆడిన 10 సీజన్లలో 8 సార్లు ఫైనల్ చేరిందంటే ఈ డాడీస్ ఆర్మీ ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు.

బలహీనతలు

ఈ సీజన్‌లో తలపడ్డ మూడుసార్లు ముంబై చేతి లో ఓడటం చెన్నైని కలవరపెడుతోంది. అంతేకాదు పెద్ద మ్యాచ్‌ల్లో ముంబైతో పోల్చుకుంటే.. చెన్నై కాస్త వెనుకంజలో ఉందనే చెప్పుకోవాలి. లీగ్‌లో 8 సార్లు ఫైనల్ చేరిన చెన్నై 3 సార్లు టైటిల్ ముద్దాడితే.. 4 సార్లు ఫైనల్ చేరిన ముంబై మూడు సార్లు ట్రోఫీ ఎగరేసుకుపోయింది. బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు లేకున్నా.. బ్యాటింగ్‌లో నిలకడలేమే ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటివరకు ధోనీ మినహా మరే ప్లేయర్ సీజన్‌లో తనదైన ముద్ర వేయలేకపోయాడు. రైనా, రాయుడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలేదు. కీలక మ్యాచ్‌లో బ్రేవో బ్యాట్‌తోనూ మెరవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తున్నది. సొంతగడ్డపై క్వాలిఫయర్-1తో సహా రోహిత్ సేన చేతిలో మొత్తం మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ధోనీ బృందం ఈ ఒక్క మ్యాచ్‌లో నెగ్గి వాటన్నింటికీ బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది.

పిచ్, వాతావరణం

ఉప్పల్ పిచ్ మంచి స్పోర్టింగ్ వికెట్ అని క్యూరేటర్ అంటున్నాడు. బంతికి బ్యాట్‌కు మధ్య ఆసక్తికర సమరాన్ని ఆశించొచ్చు. విపరీతమైన ఉక్కపోత ఉండే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కు మొగ్గుచూపొచ్చు.

జట్లు (అంచనా)

చెన్నై : వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, విజయ్, ధోనీ, జడేజా, బ్రేవో, హర్భజన్, తాహిర్, చహర్. ముంబై రోహిత్, డికాక్, సూర్యకుమార్, కిషన్, హార్దిక్, పొలార్డ్, కృనాల్, రాహుల్ చహర్, బుమ్రా, మలింగ, జయంత్/కటింగ్.

ముంబై బలాలు

- పరుగుల వీరుడు డికాక్ (500)
- వికెట్ల ధీరుడు బుమ్రా (17)

పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడికి ఎదురొడ్డి నిలువగలగడం ముంబై ప్రధాన బలం. ఐపీఎల్ ఫైన ల్లో చెన్నైతో మూడు సార్లు తలపడితే.. అందులో రెండు సార్లు (2013, 2015) పైచే యి సాధించడం రోహిత్‌సేనకు అనుకూలాంశం. ఈ సీజన్‌లో నూ సూపర్‌కింగ్స్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై దే పైచేయి అయింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో స్టార్లతో నిండిన ముంబై లైనప్ మొత్తం లీగ్‌లోనే అత్యుత్తమమనడంలో సందే హం లేదు. ఓపెనర్లు రోహిత్, డికాక్ మంచి ఆరంభాన్నిస్తే.. ఆ తర్వాత సూర్యకుమార్, ఇషాన్ కిషన్ మిడిల్ డల్‌కాకుండా చేసుకుంటున్నారు. ఇక కింది వరుసలో పాండ్యా బ్రదర్స్‌తో పాటు హార్డ్ హిట్టర్ పొలార్డ్ ఉండనే ఉన్నాడు. వీరంతా తలో చేయి వేస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పకపోవచ్చు. బౌలింగ్‌లో బుమ్రా తో పాటు మలింగ్ పేస్ భారాన్ని మోస్తుంటే.. గింగిరాలు తిరిగే బంతులతో రాహుల్ చహర్ ఆకట్టుకుంటున్నాడు. చెన్నైని చెన్నైలో ఓడించి నాలుగు రోజులుగా రెస్ట్ తీసుకుంటుండటంతో పాటు ఉప్పల్ వేదికగా జరిగిన 2017 ఐపీఎల్ ఫైనల్లో నెగ్గడం ముంబైకి కలిసొచ్చే అంశాలు.

బలహీనతలు

వృద్ధసింహాలు ఇమ్రాన్ తాహి ర్, హర్భజన్ సింగ్‌లను కాచుకోవడమే ముంబైకి ప్రధాన సమస్య. వారిద్దరిని సమర్థం గా ఎదుర్కోగలిగితే సగం మ్యా చ్ గెలిచినట్లే. నాకౌట్ మ్యాచ్ ల్లో ధోనీలాగే ఆలోచించే రోహి త్ ముందుండి జట్టును నడిపించాల్సిన అవసరముంది. సీజన్‌లో ముంబై చేతిలో మూడుసార్లు ఓడిన చెన్నై బదులు తీర్చుకునేందుకు మరింత బలంగా దూసుకొస్తుంది కాబట్టి అందుకు తగ్గట్లే ప్రణాళికలు రూపొందించుకోవాలి.

4 ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి నలుగురు ఆటగాళ్లు చెన్నైకి చెందిన వారే కావడం విశేషం. రైనా (241 పరుగులు), మురళీ విజయ్ (181 పరుగులు), ధోనీ (178 పరుగులు), వాట్సన్ (156 పరుగులు) అత్యధిక పరుగులు చేసిన వారిలో ముందున్నారు

5 ఇప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ గెలిచిన జట్లలో భాగమైన రోహిత్, హర్భజన్, రాయుడుకు ఇది ఐదో టైటిల్ వేట

63.60 ఐపీఎల్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయాల శాతం

627

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles