ఈ స్టార్లు.. అదరహో!


Tue,June 12, 2018 05:11 AM

-నెయ్‌మార్‌పైనే బ్రెజిల్ భారం..
-మెస్సీపై అర్జెంటీనా ఆశలు..
-హజార్డ్, హ్యారీకేన్‌లపై భారీ అంచనాలు
సాకర్ ప్రపంచకప్ .. కోట్లాది అభిమానులను ఉర్రూతలూగించే క్రీడ.. మరో రెండురోజులలో ఫిపా ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచమంతా ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతున్నది.. ప్రతి ప్రపంచకప్‌నకు ముందుగా జట్ల అవకాశాలు హాట్ టాపిక్.. ఆయా జట్లలోని సూపర్‌స్టార్ల ఆట ఎలా ఉండబోతుంది.. ఎవరిని ఎలా నియంత్రించుకోవాలో కోచ్‌లు వ్యూహాలు రచిస్తుంటే.. ప్రపంచవ్యాప్తంగా స్టార్ ప్లేయర్ల ఆటను వీక్షించేందుకు అభిమానులు స్టేడియాలకు పరుగులు పెడుతుంటారు.. ఈ ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ మెగాస్టార్ క్రిస్టియానో రొనాల్డో దాదాపు చివరి ప్రపంచకప్ ఆడుతుండగా.. ఇంగ్లండ్ కొత్త ఆటగాడు హ్యారీకేన్, బెల్జియం ైస్ట్రెకర్ ఈడెన్ హజార్డ్, బ్రెజిల్ సూపర్ ఫార్వర్డ్ నెయ్‌మార్ స్టార్ ఆటగాళ్ల హోదాతో రష్యాలో అడుగిడారు.. ప్రపంచాన్నే మైమరించేలా మైదానంలో మాయ చేసే ప్రపంచ అత్యుత్తమ ైస్ట్రెకర్ల ఆటతీరుపై ప్రత్యేక కథనం..
fifa-trophy

ఈడెన్ హజార్డ్

అవాక్కయ్యారా..! ఇది టెలివిజన్ వాణిజ్యప్రకటనల్లో పాపులర్ డైలాగ్.. బెల్జియం స్టార్ ఫుట్‌బాలర్ ఈడెన్ హజార్డ్ చేసే గోల్స్ కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ైస్ట్రెకర్ ఈడెన్ హజార్డ్ ..ప్రపంచకప్‌లోని మిగిలిన జట్లకు బెల్జియం జట్టుకు తేడా ఒక్కటే.. ఆ జట్లలో హజార్డ్ లేకపోవడమే.. అంతగా ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. డిఫెండర్ల మధ్య ఖాళీలను పసిగట్టి చాకచక్యంగా అతను గోల్ కొట్టగలడు.. గోల్ అసాధ్యమే అనుకున్న క్షణంలోనే తన కాళ్లతో మాయాజాలం చేస్తాడు. కండ్లతోనే ఖాళీలు వెదికి క్లిష్టమైన కోణమైన గురితప్పకుండా బంతిని గోల్‌పోస్టులోకి పంపగల సామర్థ్యం హజార్డ్ సొంతం. ఇదే అతనికి ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డమ్ తెచ్చి పెట్టింది. ఒకవైపు బెల్జియం జట్టుకూడా ఒక్క పరాజయం లేకుండా ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన జట్టు..అందరిలోనూ అసమాన నైపుణ్యం ..ఈసారి బెల్జియం జట్టుదే ప్రపంచకప్ అన్నట్లుగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. స్టార్ హోదాతో బరిలోకి దిగుతున్న హజార్డ్ చెలరేగితే ఫిఫా ప్రపంచకప్ విజేతగా బెల్జియం జట్టు నిలువడం ఖాయమే.. అగ్నికి వాయువు తోడైనట్లుగా డిబ్రుయెన్ లాంటి స్టార్ మిడ్‌ఫీల్డర్ అండగా.. హజార్డ్ చెలరేగితే ప్రత్యర్థి జట్లకు పీడకలే.
Eden-Hazard-Belgique

లియోనెల్ మెస్సీ(అర్జెంటీనా)

అర్జెంటీనా స్టార్ ైస్ట్రెకర్ లియోనెల్ మెస్సీ..ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరో మారడోనా..అర్జెంటీనా జట్టుకు స్టార్ అట్రాక్షన్.. అతని ఆటతీరు చూస్తే ఎవరైనా వారెవ్వా అనకమానరు..బంతిపై నియంత్రణ.. అతను గోల్ చేసిన విధానం చూస్తే ఇంత సునాయాసమా ఫుట్‌బాల్ ఆడడం అనేంతగా మంత్రముగ్ధులను చేస్తాడు. ప్రపంచంలోనే అత్యంత సొగసైన ్రైస్టెకర్..అతని ఆటలో అందం.. సంధించిన షాట్లలో కచ్చితత్వం.. సుతారంగా వీణ మీటినట్లు.. బంతిని అలా గోల్‌పోస్టులోకి పంపిస్తాడు..అక్కడ పశుబలం లేదు.. అంతకుమించిన నైపుణ్యం.. ప్రత్యర్థి గోల్‌కీపర్ కదలికలు వేగంగా పసిగట్టడం ..చివరిక్షణంలో సైతం బంతి దిశను మార్చగలిగేలా నియంత్రణ..ఇలా మెస్సీ తన ఆటతో అందరివాడయ్యా డు. తాజాగా రష్యాలో జరుగనున్న ఈ ప్రపంచకప్‌లో మెస్సీని నిలువరించడం ప్రత్యర్థి జట్లకు శక్తికి మించిన పనే. అసాధారణమైన కదలికలు..అతని వేగం.. అద్భుతమైన డ్రిబ్లింగ్ నైపుణ్యంతో సూపర్‌ఫాంలో ఉన్న మెస్సీని ఆపడం కష్టమే.కాగా, ఇంతటి స్టార్ ఆటగాడు..అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ సాధించిన వీరుడు.. క్లబ్ ఫుట్‌బాల్‌లో మేజర్ టైటిల్స్ అన్నీ ఒడిసిపట్టిన ధీరుడు.. గత రెండు క్లబ్ సీజన్లలో అత్యధిక గోల్స్ కొట్టిన మొనగాడికి ఒక్కటే వెలితి..అదే ప్రపంచకప్..2014లో ఒంటిచెత్తో జట్టును ఫైనల్ చేర్చినా.. జర్మనీ చేతిలో పరాజయంతో ప్రపంచకప్ విజేత కాలేకపోయాడు.. అంతేకాదు.. 2016 కోపా అమెరికాకప్‌లో ఒక్క గోల్ కొట్టలేకపోవడంతో అతనిపై విమర్శలు రావడంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లలో వరుస పరాజయాలతో అర్జెంటీనా అర్హత సాధించడం కష్టంగా మారిన తరుణంలో అందరి వినతిని ఆమోదించి మళ్లీ అర్జెంటీనా జట్టుకు ఆడి జట్టుకు ప్రపంచకప్ బెర్త్ సాధించిపెట్టాడు. మరోసారి ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ తన కలను నిజం చేసుకునేందుకు ఇదే ఆఖరు అవకాశం కావొచ్చు.. తన అసాధారణ విన్యాసాలతో అభిమానులను అలరించడమే కాదు.. ప్రత్యర్థి జట్లకు కంటిమీద కునుకు లేకుండా చేయడంలో ఈ ప్రపంచకప్‌లో నంబర్‌వన్ స్టార్ ్రైస్టెకర్‌దే తొలిస్థానం..
messi

రొనాల్డో (పోర్చుగల్)

ఒకేఒక్కడు సినిమాలో అర్జున్ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా అదురగొట్టిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో అర్జున్ మాదిరిగానే పోర్చుగల్ స్టార్ ైస్ట్రెకర్ క్రిస్టియానో రొనాల్డోను అభివర్ణించొచ్చు. 34 ఏండ్ల సాకర్ స్టార్ 2016 యూరోకప్‌లో ఒంటిచేత్తో చాంపియన్‌గా నిలిపాడు. మైదానంలో బరిలోకి దిగాడంటే ప్రత్యర్థి డిఫెండర్లకు దడే.. అతని వేగం ముందు చిరుతలు చిన్నబోతాయి.. అంతవేగంలోనూ అతని కాళ్లను వదిలి బంతి వెళ్లదు..గోల్‌పోస్టుపై గురిపెడితే బంతి వెళ్లి పడాల్సిందే.. ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ తరఫున నాలుగోసారి ఆడుతున్న రొనాల్డో కేవలం మూడుగోల్స్ మాత్రమే నమోదు చేసాడు.. కెరీర్‌లో ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్న ఈ స్టార్ ..చివరిసారి అద్భుతంగా ఆడితే ప్రపంచకప్ విజేతగా చరిత్రలో పేరు సంపాదించుకోగలడు. 5 సార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్ అవార్డు, ప్రపంచమంతా తెలిసేంత పాపులారిటీ, అంతకుమించిన అవార్డులు, రివార్డులు..అతని ఆటతీరుకు ఇవన్నీ దాసోహం అన్నాయి.. కాగా, అతనికి వెలితి ప్రపంచకప్ ఒక్కటే..తాజాగా ముగిసిన చాంపియన్స్ లీగ్‌లో రియల్‌మాడ్రిడ్ జట్టు వరుసగా మూడో ట్రోఫీ ఒడిసిపట్టడంలో ఈ పోర్చుగల్ వీరుడిదే కీలకపాత్ర. ఫైనల్లో మూడుగోల్స్‌లో హ్యాట్రిక్ నమోదుచేసి సూపర్‌ఫాంతో రష్యాలో అడుగుపెట్టాడు.. రొనాల్డో గురించి చెప్పాలంటే అతని వేగం ప్రత్యర్థులకే కాదు..సొంతజట్టు సభ్యులకూ సమస్యే. అతని వేగాన్ని అందుకోలేక అతనికి సరైన విధంగా పాస్ ఇవ్వడంలో మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతోనే అతను గోల్ చేయలేక పోతున్నాడు. యూరోకప్‌లో లాగా అతనికి పోర్చుగల్ జట్టు సాయం అందిస్తే అతను సరికొత్త చరిత్రను సృష్టిస్తాడు. ఈ ప్రపంచకప్‌లో అతను నిస్సందేహంగా నంబర్‌వన్ స్టార్ ్రైస్టెకర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అతన్ని తేలికగా భావిస్తే మాత్రం ప్రత్యర్థి జట్లు పొరపాటు చేసినట్లే.. ఆఖరిక్షణంలోనైనా గోల్ కొట్టగల సామర్థ్యం రొనాల్డో సొంతం.. అందుకే అతని ఆటకోసం అభిమానులు పడి చస్తుంటారు. ఈ ప్రపంచకప్‌లోనూ అతని మెరుపులను వీక్షించేందుకు ప్రపంచవాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు.
ronaldo

హ్యారీకేన్( ఇంగ్లండ్)

ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు ఎప్పుడో 1966లో ప్రపంచకప్ విజేతగా నిలిచింది. మరో 52 ఏండ్లు ముగిసినా ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడలేకపోయింది.. కానీ, ప్రపంచానికి స్టార్ ఆటగాళ్లను మాత్రం అందించింది. ప్రతిసారి ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం..రిక్త హస్తాలతో వెనుదిరగడం ఇంగ్లండ్ జట్టుకు అలవాటుగా మారినా.. డేవిడ్ బెక్‌హాం.. వేన్‌రూనీ లాంటి స్టార్ ఫుట్‌బాలర్లను అందించింది.. తాజాగా రష్యాలో జరుగనున్న ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టులోకి 24 ఏండ్ల స్టార్ హ్యారీ కేన్ ఆశాకిరణంగా నిలుస్తున్నాడు. 2017-18 సీజన్‌లో 41 గోల్స్‌తో ఫుట్‌బాల్ ప్రపంచంలో సరికొత్త స్టార్‌హోదా తెచ్చుకున్నాడు. ఇంగ్లండ్ జట్టులోని మార్కస్ రాస్‌ఫోర్డ్, డేల్ అలీతోపాటు కేన్ కలిస్తే సునామీ వచ్చినట్లే.. పైగా ఇంగ్లండ్ జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఒత్తిడికూడా లేదు.. దీంతో కేన్ మరింత స్వేచ్ఛగా ప్రత్యర్థి జట్ల పని పట్టేందుకు అవకాశం ఉంది. ఇంగ్లండ్ జట్టులోని ఫైనల్ ఎలెవన్‌లో అత్యంత కీలకమైన నయా స్టార్ మెరుపులు ఫుట్‌బాల్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. జట్టు సమన్వయం సరిగ్గా కుదిరి కేన్ తన పూర్తి సామర్థ్యం ప్రదర్శించగలిగితే ఇంగ్లండ్ జట్టు 52 ఏండ్ల కరువు తీరినట్లే..
harry-kane

నెయ్‌మార్ (బ్రెజిల్)

బ్రెజిల్ జట్టు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుంటే జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్లుగా.. ఒక శివమణి జాజ్ వాయించినట్లుగా ఉంటుంది. ఒకవిధమైన కళాత్మకత..ఉత్సాహం.. జట్టులోని ఆటగాళ్ల మధ్య పాస్‌లు చూస్తే మంచం అల్లికలా అందంగా అనిపిస్తుంటుంది. ఒకవిధంగా చెప్పాలంటే క్రికెట్లో వెస్టిండీస్ ఆటగాళ్ల గెలుపు సంబురాల్లా వీరి ఆటతీరు ఉంటుంది.. బ్రెజిల్ అంటే ఫుట్‌బాల్..వారికి శ్వాస అది.. ఆటలో అంతగా మమేకం అవుతారు. వారి జట్టు ఓటమిపాలైతే దేశం మొత్తం శోకిస్తుందని నానుడి.. 5సార్లు ప్రపంచకప్ ముద్దాడిన బ్రెజిల్ జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదువేలేదు.. పీలే లాంటి దిగ్గజమే కాదు.. ఓ రొమారియో..బెబెటో..రాబర్టో బాజియో..దుంగా.. రొనాల్డో..కపు..ఇప్పుడు తాజాగా నెయ్‌మార్..ఔను.. బ్రెజిల్ జట్టులో ఎప్పుడూ స్టార్లు ఉంటారు.. నెయ్‌మార్‌లాంటి సూపర్‌స్టారూ ఉంటాడు.. స్వదేశంలో జరిగిన 2014 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో నెయ్‌మార్ గాయంతో జట్టుకు దూరం కాగా.. సెమీస్‌లో ఆ జట్టును జర్మనీ 7-1 గోల్స్ తేడాతో ఓడించింది.. అప్పటికి ఇప్పటికీ జట్టులో అతనే స్టార్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టార్ ైస్ట్రెకర్‌గా నిలిచిన నెయ్‌మార్ తన అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తే బ్రెజిల్ ఆరోసారి ప్రపంచకప్ ముద్దాడడం ఖాయమే..బ్రెజిల్ జట్టుకు స్వదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీరందరి ఒత్తిడి నెయ్‌మార్‌పై ఉంది. అతను రాణించాలని జట్టు సభ్యులూ కోరుకుంటున్నారు.. ఇక ఇప్పటివరకు బ్రెజిల్ తరఫున 54 అంతర్జాతీయ గోల్స్ నమోదు చేసి రొమారియో తర్వాత నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు. గాయం నుంచి కోలుకుని బ్రెజిల్ జట్టులో నెయ్‌మార్ తిరిగిరావడం ఆ జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. తాజాగా క్రొయేషితో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో 2-0 తేడాతో బ్రెజిల్ విజయం సాధించడం ప్రత్యర్థులకు హెచ్చరికే. పూర్తిఫాంలో చెలరేగితే మైదానంలో నెయ్‌మార్‌ను నిలువరించడం ప్రత్యర్థి డిఫెండర్లకు అసాధ్యం. 2018 ప్రపంచకప్‌లో నెయ్‌మార్ జట్టుకు కచ్చితంగా ప్రపంచకప్ సాధించిపెట్టగల సమర్థుడు అని విశ్లేషకులు చెబుతున్నారు.
neymar

1142

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles