నవశకానికి నాంది


Thu,December 7, 2017 03:21 AM

-వరుసగా 9 సిరీస్‌లు నెగ్గిన భారత్
-ఆసీస్, ఇంగ్లండ్‌ల రికార్డు సమం
-లంకతో మూడో టెస్టు డ్రా
-1-0తో సిరీస్ నెగ్గిన విరాట్‌సేన

భారత టెస్టు చరిత్రలో టీమ్‌ఇండియా సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. ఎంతో మంది దిగ్గజ కెప్టెన్లు, ఆటగాళ్లకు సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును విరాట్‌సేన ఒడిసిపట్టుకుంది. ఒకటి, రెండు సిరీస్‌లు గెలువడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఏకంగా వరుసగా తొమ్మిది సిరీస్‌లను గెలిచి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. తద్వారా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల సరసన భారత్ చోటు సంపాదించింది. 2015లో శ్రీలంకతో మొదలైన జైత్రయాత్రకు... మళ్లీ లంక వరకు కొనసాగించి నవ సిరీస్ రికార్డుల ఘనతను సగర్వంగా అందుకుంది. ఢిల్లీ టెస్టును డ్రా చేసుకోవడం ద్వారా లంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నూ 1-0తో కైవసం చేసుకుని ఐదు రోజుల ఫార్మాట్‌లో రారాజులం మేమే అని చాటి చెప్పింది..!
indian-team
న్యూఢిల్లీ: తొలి నాలుగు రోజులు బౌలర్లకు ఊహించని రీతిలో సహకారం అందించిన ఫిరోజ్ షా కోట్ల పిచ్.. ఆఖరి రోజు మాత్రం భారత్‌కు చేయిచ్చింది. విజయానికి ఏడు వికెట్లు మాత్రమే కావాల్సిన దశలో టీమ్‌ఇండియా బౌలర్లు ఎంత శ్రమించినా.. లంకేయులను పడగొట్టలేకపోయారు. దీంతో బుధవారం భారత్, శ్రీలంక మధ్య ముగిసిన మూడో టెస్టు డ్రా అయ్యింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విరాట్‌సేన 1-0తో కైవసం చేసుకుంది. 410 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చండిమల్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 103 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (219 బంతుల్లో 119; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఒంటరిపోరాటం చేయగా, రోషన్ సిల్వ (74 నాటౌట్), డిక్వెల్లా (44 నాటౌట్).. భారత్ విజయాన్ని అడ్డుకున్నారు. మూడు టెస్టుల్లో కలిపి 610 పరుగులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి... మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్; మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఈనెల 10 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.

31/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన లంకేయులు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడారు. సీనియర్ మాథ్యూస్ (1)ను 22వ ఓవర్‌లో జడేజా బోల్తా కొట్టించాడు. అయితే రీప్లేలో నోబాల్‌గా తేలినా.. అప్పటికే లంక బ్యాట్స్‌మన్ పెవిలియన్ దాటి వెళ్లిపోయాడు. ఇక ఇక్కడి నుంచి ధనంజయ డిసిల్వా, చండిమల్ (36) భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. అందుబాటులో ఉన్న నలుగురు బౌలర్లను అటు ఇటు మార్చి కోహ్లీ ప్రయోగాలు చేసినా లాభం లేకపోయింది. చండిమల్, ధనజంయ ఐదో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి సెషన్‌లో ఒకే ఒక్క వికెట్ చేజార్చుకున్న లంకేయులు కచ్చితంగా డ్రావైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కనిపించారు. లంచ్ తర్వాత జడేజా వేసిన బంతికి చండిమల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కానీ రీప్లేలో అది నోబాల్‌గా తేలడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. అయినప్పటికీ ఎక్కువసేపు ఆట కొనసాగించలేకపోయాడు. 55వ ఓవర్‌లో అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన రోషన్ సిల్వా ధనంజయకు మంచి సహకారం అందించాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న ధనంజయ కెరీర్‌లో మూడో శతకాన్ని పూర్తి చేశాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దర్ని విడదీసేందుకు కోహ్లీ, విజయ్ కూడా బౌలింగ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరకు కండరాలు పట్టేయడంతో ధనంజయ రిటైర్డ్‌హర్ట్‌గా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. తర్వాత వచ్చిన డిక్వెల్లా వికెట్ ఇవ్వకుండా పోరాడాడు. జడేజా బౌలింగ్‌లో డిక్వెల్లాను స్టంప్ ఔట్ చేసే అవకాశాన్ని సాహా వృథా చేశాడు. సిల్వా, డిక్వెల్లా ఏడో వికెట్‌కు 94 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం, పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. మొత్తమ్మీద భారత గడ్డపై ఓ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా లంక రికార్డుల్లోకెక్కింది.
kohli

గతంలో 9 సిరీస్‌లు గెలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రికార్డును విరాట్‌సేన సమం చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 2005-2008 మధ్యకాలంలో పాంటింగ్ నేతృత్వంలోని ఆసీస్ 26 టెస్టులు ఆడితే.. 22 మ్యాచ్‌ల్లో గెలిచి, ఒకదాంట్లో ఓడింది. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 2015-2017 మధ్యకాలంలో భారత్ 30 టెస్టులు ఆడగా, 21 విజయాలు, 2 ఓటములు, 7 డ్రాలను నమోదు చేసింది. అంటే ఆసీస్‌తో పోలిస్తే ఒక్క విజయం మాత్రమే తక్కువగా ఉంది. ఇక 1884-1892 మధ్యకాలంలో ఇంగ్లండ్ కూడా వరుసగా తొమ్మిది సిరీస్‌లో నెగ్గింది.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 536/7 డిక్లేర్డ్, శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 373 ఆలౌట్, భారత్ రెండో ఇన్నింగ్స్: 246/5 డిక్లేర్డ్, శ్రీలంక రెండో ఇన్నింగ్స్: కరుణరత్నే (సి) సాహా (బి) జడేజా 13, సమరవిక్రమ (సి) రహానే (బి) షమీ 5, డిసిల్వా (రిటైర్డ్ హర్ట్) 119, లక్మల్ (బి) జడేజా 0, మాథ్యూస్ (సి) రహానే (బి) జడేజా 1, చండిమల్ (బి) అశ్విన్ 36, రోషన్ సిల్వా 74 నాటౌట్, డిక్వెల్లా 44 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 103 ఓవర్లలో 299/5; వికెట్ల పతనం: 1-14, 2-31, 3-31, 4-35, 5-147, 5-205 (డిసిల్వా); బౌలింగ్: ఇషాంత్ 13-2-32-0, షమీ 15-6, 50-1, అశ్విన్ 35-3-126-1, జడేజా 38-13-81-3, విజయ్ 1-0-3-0, కోహ్లీ 1-0-1-0.

506

More News

VIRAL NEWS