బై.. బై.. గోల్డ్‌కోస్ట్


Mon,April 16, 2018 01:03 AM

commonwelath
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడలకు తెరపడింది. గోల్డ్‌కోస్ట్ లో పన్నెండు రోజుల పాటు అభిమానులను అలరించిన కామన్వెల్త్ క్రీడల పోటీలు ఆదివారం అధికారికంగా ముగిసాయి. అభిమానులతో కిక్కిరిసిన కరార స్టేడియంలో ముగింపు ఉత్సవం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది అథ్లెట్లు, నిర్వహణ అధికారులు మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొనగా ఆస్ట్రేలియా దేశ చరిత్రను చాటిచెబుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారత్ తరఫున బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్ పతాకధారిగా ముందుండి నడువగా ఆమెను అనుసరిస్తూ మన క్రీడాబృందం మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొంది. కండ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులకు తోడు పటాకుల కాల్పులతో స్టేడియం వెలిగిపోయింది. స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ డీజే(డిస్క్ జాకీ)గా అవతారమెత్తి ప్రేక్షకుల్లో కొత్త జోష్ నింపాడు. బోల్ట్ పాటలకు అభిమానులు కదం కదం కలిపారు. ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు లూయిస్ మార్టిన్ ప్రసంగించింది. భవిష్యత్‌లో కామన్వెల్త్ క్రీడలు మరింత వెలుగులు అద్దుకోనున్నాయి. గోల్డ్‌కోస్ట్‌లో ఎన్నడూ లేని రీతిలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. అథ్లెట్ల అద్భుత ప్రదర్శనకు తోడు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన క్రీడాకారులు, క్రీడా దిగ్గజాలు, యువ అథ్లెట్ల మేళవింపుతో పోటీలు ఆసక్తికరంగా సాగాయి అని అంది. కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లండ్ చైర్మన్ ఇయాన్ మెట్‌కాల్ఫె..బర్మింగ్‌హామ్ మేయర్ అన్నె అండర్‌వుడ్‌కు కామన్వెల్త్ పతాకాన్ని అందించాడు. నాలుగేండ్ల తర్వాత బర్మింగ్‌హామ్(2022)లో కలుద్దామంటూ ఆటగాళ్లు గోల్డ్‌కోస్ట్‌కు బై బై చెబుతూ స్టేడియాన్ని వీడారు.

mary

అద్భుత ప్రదర్శన: క్రీడా మంత్రి రాథోడ్

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శన అద్భుతమని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రశంసించారు. గోల్డ్‌కోస్ట్ ఇచ్చిన సక్సెస్‌తో 2024, 2028 ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతామన్నారు. అథ్లెట్లు చూపిన అంకితాభావం, మక్కువను చూసి దేశం మొత్తం గర్విస్తున్నది. చాలా క్రీడాంశాల్లో మనం అనేక పతకాలు గెలిచాం. తద్వారా మన సంప్రదాయక క్రీడల్లో పట్టు ఏంటో నిరూపించుకున్నాం. అంచనాలు లేని క్రీడల్లోనూ పతకాలు సాధించే స్థాయికి చేరుకున్నాం. 2004 ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు గెలువలేకపోయాం. కానీ రాబోయే ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తాం అని రాథోడ్ పేర్కొన్నారు. ఖేలో ఇండియాలో సత్తా చాటి.. కామన్వెల్త్‌లో మెరుపులు మెరిపించిన అనీష్ భన్వాలా, మను బాకర్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో ప్రొఫెషనలిజాన్ని తీసుకొచ్చాం. దీని కోసం ఓ పద్ధతిని ప్రవేశపెట్టాం. మన యువతరంలో చాలా ప్రతిభ దాగి ఉంది. రాబోయే రెండు ఒలింపిక్స్‌లో లెక్కకు మించిన పతకాలు కొల్లగొడుతారు అని మంత్రి పునరుద్ఘాటించారు.

హర్యానా ప్రభుత్వం భారీ నజరానా

చండీగఢ్: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెలిచిన తమ అథ్లెట్లకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. కోటిన్నర, రజత వీరులకు రూ. 75 లక్షలు, కాంస్య విజేతలకు రూ. 50 లక్షలు ఇవ్వనున్నారు. ఈ మేరకు హర్యానా క్రీడల మంత్రి అనిల్ విజ్ ఆదివారం ప్రకటించారు. హర్యానా క్రీడాకారులు మొత్తం 22 పతకాలు గెలిచారు. ఇందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలున్నాయి. షూటింగ్ యువ సంచలనం 15 ఏండ్ల అనీష్ భన్వాలా, మను బాకర్ హర్యానాకు చెందిన వారు కావడం విశేషం.

1165

More News

VIRAL NEWS