పసిడి పోరుకు మంజు


Sun,October 13, 2019 01:03 AM

Mary-kom

-మేరీకోమ్‌తో పాటు మరో ఇద్దరికి కాంస్యాలు
-అత్యంత విజయవంతమైన బాక్సర్‌గా మేరీ చరిత్ర
-మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన తొలిసారే ఫైనల్ చేరి భారత మహిళా బాక్సర్ మంజూ రాణి (48కేజీలు) అదరగొట్టింది. 2011లో మేరీకోమ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా నిలిచింది. పదునైన పంచ్‌లతో సెమీస్‌లో థాయ్‌లాండ్ బాక్సర్‌ను మట్టికరిపించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ (51కేజీలు).. అంపైర్ల వివాదాస్పద నిర్ణయాల వల్ల సెమీస్‌లోనే పరాజయం చెంది కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా, ఎనిమిది చాంపియన్‌షిప్ పతకాలతో ప్రపంచ అత్యంత
విజయవంతమైన బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే జమునా బోరో(54కేజీలు), లవ్లీనా బోర్గోహైన్ (69కేజీలు) కూడా సెమీస్ బౌట్‌లలో ఓడి.. కాంస్య పతకాలను సాధించారు.
ఉలాన్ ఉడే(రష్యా): మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ మంజూ రాణి(48కేజీలు) తుదిపోరుకు అర్హత సాధించింది. తొలిసారి ప్రపంచపోరులో అడుగుపెట్టిన రాణి.. ఆరోసీడ్‌గా బరిలోకి దిగి ఆది నుంచి అదిరే ఆటతో ఫైనల్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మంజూ రాణి 4-1తేడాతో చుతామత్ రక్సత్(థాయ్‌లాండ్)పై సునాయాస విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఎక్తరీనా పల్ట్‌సేవా
(రష్యా)తో మంజూ రాణి తలపడనుంది.
manju-rani

అంపైర్ల పక్షపాతంతో మేరీ ఓటమి

ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో అంపైర్ల పక్షపాత నిర్ణయాలు భారత ప్లేయర్లకు శరాఘాతంగా మారుతున్నాయి. రెజ్లింగ్ పోటీల్లో బజరంగ్ పూనియాకు జరిగిన అన్యాయం మరువకముందే మరోసారి మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ జడ్జిలు వివాదాస్పద తీర్పునిచ్చారు. శనివారం జరిగిన సెమీస్‌లో మేరీకోమ్(51కేజీలు) స్లిట్ పాయింట్లతో ఓడిపోయేందుకు కారణమయ్యారు. మేరీ 1-4తేడాతో రెండో సీడ్ బుసెనాజ్ కకిరోగ్లూ(టర్కీ) చేతిలో ఓడి ఈ విభాగంలో తొలిసారిగా కాంస్య పతకం సాధించింది. తొలి రౌండ్‌లో ఇరువురు బాక్సర్లు అచితూచి ఆడారు. అయితే రెండో రౌండ్‌లో పోటీ హోరాహోరీగా సాగడంతో మేరీవైపే అంపైర్లు మొగ్గుచూపుతారని అందరూ ఊహించిన సమయంలో టర్కీ బాక్సర్ గెలిచినట్టు అనూహ్య నిర్ణయం వెలువడింది. తర్వాతి మూడు నిమిషాలు కూడా కూడా అలాగే సాగినా.. అన్నిసార్లు జడ్జిలు కకిరోగ్లూకే అనుకూలంగా తీర్పునిచ్చారు. దీంతో ఓటమి చెందిన మేరీ అసహనం వ్యక్తం చేసింది. నేను చాలా మెరుగ్గా ఆడా. ఓడిపోవాల్సి వస్తుందనుకోలేదు. ఈ వెనుకడుగు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు తోడ్పడుతుంది అని మేరీ కోమ్ చెప్పింది.

జమున, లవ్ల్లీనాకు కాంస్యాలు

సెమీస్‌లో భారత బాక్సర్ జమునా బోరో(54కేజీలు) 0-5 తేడాతో టాప్ సీడ్ హువాంగ్ (చైనీస్‌తైపీ)చేతిలో ఓడి కాంస్య పతకాన్ని సాధించింది. ఎత్తు సానుకూలతను వినియోగించుకుంటూ బలమైన పంచ్‌లు కురిపించిన ప్రత్యర్థిని జమునా ఆడ్డుకోలేకపోయింది. ఇక మరోసెమీస్ పోరులో లవ్లీనా బోర్గోహైన్ 2-3తేడాతో యాంగ్ లీ(చైనా) చేతిలో పోరాడి ఓడింది.

224

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles