మారిన్ మెరిసెన్


Sat,January 13, 2018 03:12 AM

-పీబీఎల్ ఫైనల్లో హైదరాబాద్ హంటర్స్
marin
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో హైదరాబాద్ హంటర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో హైదరాబాద్ 3-0 తేడాతో ఢిల్లీ డాషర్స్‌పై ఘనవిజయం సాధించింది. స్థానిక గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సొంత అభిమానుల మద్దతుతో హైదరాబాద్ జట్టు అదురగొట్టింది. తొలుత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ జోడీ బెర్నాడెత్-రానిక్‌రెడ్డి 15-13, 10-15, 10-15తో ఢిల్లీ ద్వయం అశ్విని పొనప్ప, వ్లాదిమిర్ ఇవనోవ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్ ట్రంప్ మ్యాచ్‌లో హైదరాబాద్ షట్లర్ సాయి ప్రణీత్ 15-9, 15-8తో తియాన్ హ్యుయిని వరుస సెట్లలో చిత్తుచేశాడు. చివరగా జరిగిన మహిళల సింగిల్స్ ట్రంప్ మ్యాచ్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ 12-15, 15-10, 15-9తో సున్ జీ హున్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. తొలి సెట్‌ను చేజార్చుకున్న మారిన్..ఒక్కసారిగా పుంజుకుని వరుస సెట్లలో ప్రత్యర్థిని తనదైన స్మాష్‌లు, షాట్లతో మ్యాచ్‌ను వశం చేసుకుంది. గెలిచిన అనంతరం మారిన్ స్టేడియమంతా కలియదిరుగుతూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. శనివారం బెంగళూరు బ్లాస్టర్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ మధ్య రెండో సెమీస్ మ్యాచ్ జరుగుతుంది.

211
Tags

More News

VIRAL NEWS

Featured Articles