ధోనీ ఇప్పట్లో రిటైర్ కాడు: శాస్త్రి


Fri,July 20, 2018 12:31 AM

లీడ్స్: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ వస్తున్న ఊహాగానాలపై కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. మహీ ఇప్పట్లో వీడ్కోలు పలికే అవకాశమే లేదని తేల్చి చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో అంపైర్ల నుంచి బంతిని ఎందుకు తీసుకున్నాడో కూడా స్పష్టం చేశాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం లేదు. ఆ వార్తలన్నీ అవాస్తవం. బంతిని అడిగి తీసుకున్నది నిజమే అయినా.. దానికి వీడ్కోలుకు సంబంధమే లేదు. ఆ బంతిని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు చూపించడానికి తీసుకున్నాడు. మ్యాచ్‌లో ఆ బంతి వల్ల ఎదురైన ఇబ్బందులను బౌలింగ్ కోచ్‌తో చర్చించేందుకే అలా చేశాడు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోనే ప్రపంచకప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి పిచ్‌లపై పూర్తి అవగాహన రావడానికే మహీ ఇలా చేశాడు. ఇరుజట్ల మధ్య టెస్టు సిరీస్ కూడా జరుగనుంది. కాబట్టి వీటన్నింటికి పరిష్కారం వెతికేందుకు అతను కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడు అని శాస్త్రి స్పష్టత ఇచ్చాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య వచ్చే నెల 1 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.
Ravi-Shastri

వేలానికి ధోనీ జెర్సీ

ముంబై: క్యాన్సర్ బాధితులకు చేయూతనిచ్చేందుకు ధోనీ ముందుకొచ్చాడు. అతని జెర్సీ, గ్లౌజ్‌లను వేలం వేసేందుకు అంగీకరించాడు. ఈ మేరకు సాల్ట్ స్కాట్ సంస్థ ధోనీ జెర్సీతో పాటు మరికొన్ని వస్తువులను వేలంలో ఉంచింది. ఆగస్టు 9 వరకు ఈ వేలం జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో ధోనీ ఓ యాడ్‌లో యోధుడిగా కనిపించి కనువిందు చేశాడు. ఇందులో మహీ ధరించిన ఏడో నంబర్ జెర్సీ, యోధుడి కవచాన్ని వేలంలో ఉంచారు. దీనిపై మాజీ సారథి ఆటోగ్రాఫ్ కూడా ఉంది. వేలం ద్వారా వచ్చిన డబ్బులను లుకేమియా లింఫోమా ఫౌండేషన్‌కు అందజేయనున్నారు.

484

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles