ప్రజలు నిర్ణయిస్తారు!


Fri,November 9, 2018 12:44 AM

శాస్త్రి అత్యుత్తమ జట్టు వ్యాఖ్యలపై సీవోఏ చురక
rohit-ravi
న్యూఢిల్లీ: గత 15 ఏండ్లలో విదేశాల్లో పర్యటించిన అత్యుత్తమ భారత జట్టు ఇదేనని ఇంగ్లండ్ టూర్‌లో చీఫ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలకు పరిపాలన కమిటీ (సీవోఏ) కౌంటర్ ఇచ్చింది. అత్యుత్తమ జట్టు ఏదో ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఇది చోటు చేసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపాడు. సొంత ఆటగాళ్లనే భారత్ మీడియా పదేపదే విమర్శలు చేస్తున్నదని సమావేశంలో శాస్త్రి చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇంగ్లండ్ టూర్‌లో టెస్ట్ సిరీస్ ఓడిన తర్వాత మీడియాకు, కెప్టెన్ కోహ్లీకి మధ్య జరిగిన మాటల వాగ్వాదాన్ని కూడా సీవోఏ ముందు ఉంచారు. అయినప్పటికీ ఈ అంశాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రదర్శన గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని చెప్పింది. రవి వ్యాఖ్యలను మధ్యలోనే అడ్డుకున్న సీవోఏ సభ్యుడు సమావేశం ఎజెండా, ఆస్ట్రేలియా టూర్ పాలసీలను చర్చించారు. ఓవరాల్‌గా ప్రపంచంలో అత్యుత్తమ జట్టుని ప్రజలు నిర్ణయిస్తారు.. మీరు కాదని కొద్దిగా ఘాటుగానే హెచ్చరించింది అని సదరు అధికారి పేర్కొన్నారు. టీమ్‌ఇండియాకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అందజేస్తున్నాం కాబట్టి మైదానంలో ప్రదర్శన అత్యుత్తమంగా ఉండాలని కోహ్లీ, శాస్త్రికి సీవోఏ సూచించిందని మరో అధికారి తెలిపారు. సమావేశంలో రహానే ఎక్కువగా మాట్లాడలేదని, రోహిత్ ముంబై నుంచి కాసేపు ఆలస్యంగా వచ్చాడన్నాడు.

191

More News

VIRAL NEWS