ఆర్‌సీఏకు లలిత్ మోది గుడ్‌బై


Sun,August 13, 2017 12:38 AM

క్రికెట్ పరిపాలనకు పూర్తిగా దూరం
Lalithumodi
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ)లో ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి శకానికి తెరపడింది. నాగౌర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి అతను శనివారం రాజీనామా చేశాడు. దీంతో పాటు క్రికెట్ పరిపాలనకు పూర్తిగా గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి లేఖ పంపాడు. రాబోయే తరాలకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే తను రాజీనామా చేసినట్లు మోది వెల్లడించాడు. అసోసియేషన్‌లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావించా. క్రికెట్ పరిపాలనకు పూర్తి దూరంగా ఉండాలకున్నా. అందుకే అధ్యక్ష పదవికి రాజీనామా చేశా. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది. భారత క్రికెట్టే దీనికి నిజమైన ఉదాహరణ. మన క్రికెట్ అంటే నాకు ప్రాణం. నేను ఎల్లప్పుడూ దీనికి అభిమానిగా ఉంటాను అని మోది రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన మోదిపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇకనుంచైనా ఆర్‌సీఏకు కేటాయించిన నిధులను బీసీసీఐ విడుదల చేయాలని మోది విజ్ఞప్తి చేశాడు.

శ్రీనివాసన్‌ను అడ్డుకోరా?: మోడి పోతుపోతూ బీసీసీఐపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. బోర్డు నుంచి తనను వెలి వేసిన అధికారులు.. శ్రీనివాసన్‌ను మాత్రం ఎందుకు అడ్డుకోవడం లేదని ఆరోపించాడు. ఈ విషయంలో బీసీసీఐ ద్వంద్వనీతిని చూపెడుతుందని విమర్శించాడు. భారత క్రికెట్‌లో శ్రీని ప్రమేయం ఉండొద్దని సుప్రీంకోర్టు చెప్పినా.. బీసీసీఐ చెవికి ఎక్కడం లేదని ధ్వజమెత్తారు.

207

More News

VIRAL NEWS