కోల్‌కతా కమాల్


Wed,May 16, 2018 01:18 AM

-కుల్దీప్ విజృంభణ
-రాజస్థాన్‌పై అద్భుత విజయం
-ప్లేఆఫ్ చేరువలో నైట్ రైడర్స్
కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుతం చేసింది. లీగ్‌లో ముందంజ వేయాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో కార్తీక్‌సేన జూలు విదిల్చింది. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో చెలరేగిన కోల్‌కతా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్‌ను చిత్తుచేసింది. చైనామన్ కుల్దీప్ నాలుగు వికెట్లతో రాయల్స్‌ను కుప్పకూల్చగా..లక్ష్యఛేదనలో క్రిస్‌లిన్, కార్తీక్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో అద్భుత విజయాన్నందుకుంది. ప్లేఆఫ్ రేసులో మరింత ముందంజ వేస్తూ ప్రత్యర్థులకు దీటైన హెచ్చరికలు చేసింది.
Kuldeep-Yadav
కోల్‌కతా: కోల్‌కతా సత్తాచాటింది. లీగ్‌లో నిలువాలంటే గెలిచి తీరాల్సిన చోట సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. సొంత ఇలాఖాలో తమకు తిరుగులేదంటూ మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 6 వికెట్ల తేడాతోవిజయఢంకా మోగించింది. రాజస్థాన్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా(14) ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఓపెనర్ క్రిస్ లిన్(42 బంతుల్లో 45, 5ఫోర్లు, సిక్స్), కెప్టెన్ దినేశ్ కార్తీక్(31 బంతుల్లో 41 నాటౌట్) రాణించారు. స్టోక్స్(3/15)కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు కుల్దీప్‌యాదవ్(4/20) ధాటికి రాజస్థాన్ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. బట్లర్(39) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ప్రసిద్ధ్ కృష్ణ(2/35), రస్సెల్(2/13) రెండేసి వికెట్లు తీశారు. నాలుగు వికెట్లతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

లక్ష్యాన్ని అలవోకగా

లక్ష్యఛేదనలో కోల్‌కతాకు ఓపెనర్ సునీల్ నరైన్(21) మెరుపులాంటి ఆరంభమిచ్చాడు. గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వరుసగా 6, 4, 6, 4తో 21 పరుగులు కొల్లగొట్టాడు. అయితే కోల్‌కతా ఆశలు ఎక్కువసేపు నిలువలేదు. మరుసటి ఓవర్‌కు దిగిన స్టోక్స్(3/15) నరైన్‌ను ఔట్ చేసి మెయిడిన్ చేశాడు. మరోవైపు క్రిస్ లిన్(45) ఆర్చర్ బౌలింగ్‌లో ఓ సిక్స్, ఫోర్‌తో దూకుడు కనబరిచాడు. నరైన్ తర్వాత వచ్చిన ఉతప్ప(4) నిలదొక్కుకోలేకపోయాడు. స్టోక్స్ వేసిన షార్ట్‌పిచ్ బంతిని ఆడే క్రమంలో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లిన్, నితీశ్ రానా(21) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేసే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి రాజస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించడంతో పవర్‌ప్లే పూర్తయ్యే సరికి 51/2 స్కోరు చేసింది . ఇక గాడిలో పడిందనుకున్న తరుణంలో రానాను సోధి(1/21) ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. లిన్‌కు జతకలిసిన కెప్టెన్ కార్తీక్(41 నాటౌట్) సమయోచిత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అడపాదడపా బౌండరీలకు తోడు దాదాపు బంతికో పరుగు చొప్పున ైస్ట్రెక్ రొటేట్ చేశాడు. కార్తీక్‌ను అండగా చేసుకుంటూ లిన్ కూడా బ్యాటు ఝులిపించడంతో చేధన వైపు కోల్‌కతా సాఫీగా సాగింది. వీరిద్దరిని విడదీసేందుకు రహానే ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే ఆఖరి ఓవర్‌కు దిగిన స్టోక్స్..లిన్‌ను ఔట్ చేసి రాయల్స్ శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. అయినా వెనుకకు తగ్గని కోల్‌కతా.. కార్తీక్ సమయోచిత బ్యాటింగ్‌కు తోడు ఆఖర్లో రస్సెల్(11 నాటౌట్) అండతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది.

కుల్దీప్ స్పిన్ తఢాకా:

చైనామన్ కుల్దీప్‌యాదవ్(4/20) విజృంభణతో రాజస్థాన్ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి(27), బట్లర్(39), ఆఖర్లో ఉనద్కత్(26) మినహా ఎవరూ రాణించలేకపోయారు. రాహుల్, బట్లర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. మావి వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ త్రిపాఠి మరుసటి ఓవర్లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ప్రసిద్ధ్ క్రిష్ణ(2/35)ను దునుమాడుతూ ఓ భారీ సిక్స్, హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. తానేం తక్కువ కాదన్నట్లు ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మన్ బట్లర్.. మావి వేసిన మూడో ఓవర్లో ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఇలా వరుసగా 10 బంతుల్లో రాజస్థాన్ స్కోరుబోర్డుకు 46 పరుగులు జతకలిశాయి. ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో త్రిపాఠిని ఔట్ చేసి రస్సెల్(2/13) దెబ్బకొట్టాడు. దీంతో తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. .పరుగుల ఖాతా తెరువడానికి ఇబ్బందిపడ్డ కెప్టెన్ రహానేను కుల్దీప్ క్లీన్‌బౌల్ట్ చేశాడు. .అద్భుత ఫామ్‌మీదున్న బట్లర్ కూడా రివర్స్‌స్వీప్ ఆడటానికి ప్రయత్నించి కుల్దీప్‌కు బలయ్యాడు. ఇక్కణ్నుంచి రాయల్స్ వరుస ఓవర్లలో వికెట్లు చేజార్చుకుంది. శాంసన్(12)ను సునీల్ నరైన్(1/29) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్టూవర్ట్ బిన్నీ(1)ని కుల్దీప్ గూగ్లీతో బోల్తా కొట్టించాడు. ఇక ఆదుకుంటారనుకున్న గౌతమ్(3), స్టోక్స్(11) వరుస ఓవర్లలో ఔటయ్యారు.తొలి నాలుగోవర్లలో 59 పరుగులు చేసిన రాయల్స్..మిగిలిన 15 ఓవర్లలో 83 పరుగులకు 10 వికెట్లు కోల్పోయింది.

స్కోరుబోర్డు:

రాజస్థాన్: త్రిపాఠి(సి)కార్తీక్(బి)రస్సెల్ 27, బట్లర్(సి)సియర్‌లెస్(బి)కుల్దీప్ 39, రహానే(బి)కుల్దీప్ 11, శాంసన్(ఎల్బీ)నరైన్ 12, స్టోక్స్ (సి &బి) కుల్దీప్ 11, బిన్నీ(స్టంప్/కార్తీక్)(బి) కుల్దీప్ 1, గౌతమ్ (సి)కార్తీక్(బి)మావి 3, ఉనద్కత్(బి)ప్రసిద్ధ్ 26, సోధి(సి)కార్తీక్(బి)ప్రసిద్ధ్ 1, ఆర్చర్(సి)గిల్(బి)రస్సెల్ 6, అనురీత్‌సింగ్ 3 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 19 ఓవర్లలో 142 ఆలౌట్; వికెట్ల పతనం: 1-63, 2-76, 3-85, 4-95, 5-96, 6-103, 7-107, 8-128, 9-135, 10-142; బౌలింగ్: శివమ్ మావి 4-0-44-1, ప్రసిద్ధ్ క్రిష్ణ 4-0-35-2, నరైన్ 4-0-29-1, రస్సెల్ 3-0-13-2, కుల్దీప్ 4-0-20-4.

కోల్‌కతా: నరైన్(సి)గౌతమ్(బి)స్టోక్స్ 21, లిన్ (సి)అనురీత్(బి)స్టోక్స్ 45 , ఉతప్ప(సి)త్రిపాఠి(బి)స్టోక్స్ 4, రానా 21, కార్తీక్ 41 నాటౌట్, రస్సెల్ 11 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 18 ఓవర్లలో 145/4; వికెట్ల పతనం: 1-21, 2-36, 3-69, 4-117; బౌలింగ్: గౌతమ్ 2-0-32-0, స్టోక్స్ 4-1-15-3, ఆర్చర్ 4-0-43-0, సోధి 4-0-21-1, ఉనద్కత్ 3-0-23-0, అనురీత్‌సింగ్ 1-0-10-0.
ipl-table

686

More News

VIRAL NEWS

Featured Articles