సారథిపైనే భారం


Sun,August 25, 2019 02:05 AM

-రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 98/3
-విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 222 ఆలౌట్
-ఇషాంత్ శర్మకు 5 వికెట్లు

అంటిగ్వా: బ్యాట్స్‌మెన్ పోరాటానికి బౌలర్ల విజృంభణ తోడవడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టుపై భారత్ పట్టుబిగిస్తున్నది. పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకున్నా.. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ క్రాస్ సీమ్‌తో కరీబియన్లను కట్టిపడేయడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసిన టీమ్‌ఇండియాకు 75 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీ సమయానికి విరాట్ సేన 37 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (38) ఫర్వాలేదనిపించగా.. విరాట్ కోహ్లీ (14) అజింక్యా రహానే (5) క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌లో చేతిలో 7 వికెట్లు ఉన్న భారత్ 173 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Ishanth

టాపార్డర్ మరోసారి

తొలి ఇన్నింగ్స్‌ను తలపిస్తూ.. మరోసారి టాపార్డర్ విఫలం కావడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌కు మంచి ఆరంభం లభించలేదు. కుదురుకున్నట్లే కనిపించిన మయాంక్ అగర్వాల్ (16) అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. 14వ ఓవర్లో చేజ్ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయిన మయాంక్.. సహచరుడు లోకేశ్ రాహుల్ సూచన మేరకు రివ్యూ కోరకుండానే పెవిలియన్ బాటపట్టాడు. ఆనక రిప్లేలో బంతి వికెట్లను తాకడం లేదని తేలడంతో ఉసూరుమనడం అతడి వంతైంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (25)తో కలిసి రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించాక రాహుల్ ఔటయ్యాడు. కాసేపటికే పుజా రా కూడా ఔటవడంతో భారత్ 81/3తో నిలిచింది. ఈ దశలో కోహ్లీ, రహానే మరో వికెట్ పడకుండా..ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.

ఇషాంత్ హవా..

వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ (5/43)విజృంభించడంతో విండీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుసకట్టారు. మెరుగైన ఆరంభాలు లభించినా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. చేజ్ (48), హెట్‌మైర్ (35) ఓ మోస్తరుగా రాణించడంతో విండీస్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓవర్ నైట్ స్కోరు 189/8తో శనివారం మూడోరోజు ఆట కొనసాగించిన విండీ స్ క్రితం రోజు స్కోరుకు మరో 33 పరుగులు జోడించింది. మిగావ్ కమిన్స్ (45 బంతుల్లో 0)విండీస్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొని కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. గతంలో అథర్టన్ (40 బంతుల్లో 0) పేరిట ఈ చెత్త రికార్డు ఉండగా.. కమిన్స్ దాన్ని సవరించాడు.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 297, వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: క్రైగ్ బ్రాత్‌వైట్ (సి అండ్ బి) ఇషాంత్ 14, క్యాంప్‌బెల్ (బి) షమీ 23, బ్రూక్స్ (సి) రహానే (బి) జడేజా 11, బ్రావో (ఎల్బీ) బుమ్రా 18, చేజ్ (సి) రాహుల్ (బి) ఇషాంత్ 48, హోప్ (సి) పంత్ (బి) ఇషాంత్ 24, హెట్‌మైర్ (సి అండ్ బి) ఇషాంత్ 35, హోల్డర్ (సి) పంత్ (బి) షమీ 39, రోచ్ (సి) కోహ్లీ (బి) ఇషాంత్ 0, మిగావ్ కమిన్స్ (బి) జడేజా 0, గాబ్రియల్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 74.2 ఓవర్లలో 222 ఆలౌట్. వికెట్ల పతనం: 1-36, 2-48, 3-50, 4-88, 5-130, 6-174, 7-179, 8-179, 9-220, 10-222, బౌలింగ్: ఇషాంత్ 17-5-43-5, బుమ్రా 18-4-55-1, షమీ 17-3-48-2, జడేజా 20.2-4-64-2, విహారి 2-0-7-0.

831

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles