మాకు ఎలాంటి అభ్యంతరం లేదు


Fri,April 12, 2019 01:58 AM

Ganguly

-గంగూలీపై నైట్‌రైడర్స్ వ్యాఖ్య

కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. అటు క్యాబ్ అధ్యక్షుడిగా, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుడిగా పని చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ స్పష్టం చేశాడు. రెండు లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నాడని విమర్శలు వస్తున్నా.. ఈ విషయాన్ని తాము పట్టించుకోమన్నాడు. శుక్రవారం ఈడెన్‌లో కోల్‌కతా, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగనుంది. దీంతో ఈడెన్ పిచ్ గురించి అణువణువు తెలిసిన దాదా.. పేసర్లకు స్వర్గధామమైన వికెట్‌పై ఢిల్లీ పేస్ బలగాన్ని దించబోతున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నైట్‌రైడర్స్ శిబిరంలోని కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగూలీ ఓ ప్రొఫెషనల్ ఆటగాడు. అతని బాధ్యతలు ఏంటో పూర్తిగా తెలుసు. అతను చేస్తున్న దానికి మా మద్దతు తప్పక ఉంటుంది. దాదా ద్విపాత్రాభినయంపై మాకు ఎలాంటి సమస్య లేదు అని వెంకీ పేర్కొన్నాడు. తమ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌కు.. కచ్చితంగా టీమ్‌ఇండియా ప్రపంచకప్ జట్టులో చోటు ఉండాలన్నాడు.

ఢిల్లీ ప్రాక్టీస్‌లో గంగూలీ

మరోవైపు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చినా.. గంగూలీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. గురువారం ఢిల్లీ జట్టును తానే ముందుండి ప్రాక్టీస్ చేయించాడు. దీంతో ఈడెన్‌లో ప్రత్యర్థి డగౌట్‌లో కూర్చుంటానని స్పష్టమైన సంకేతాలిచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీ ధరించి ఆటగాళ్లతో పాటు కలిసి వచ్చిన దాదా.. ఈడెన్ పిచ్‌ను పరిశీలించాడు. తర్వాత కోచ్ రికీ పాంటింగ్‌తో సుదీర్ఘమైన చర్చలు జరిపాడు. ఎక్కువగా బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడిన ఈ జోడీ.. పంత్‌ను చివరి నాలుగు ఓవర్లలో బ్యాటింగ్‌కు దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి ఢిల్లీకి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న గంగూలీ.. మ్యాచ్‌లో ఏం చేయిస్తాడో చూద్దాం.

976

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles