గాయంతో నాదల్ ఔట్


Sun,September 9, 2018 12:49 AM

-సెమీస్ నుంచి వైదొలిగిన ప్రపంచ నంబర్‌వన్
-ఫైనల్లో డెల్ పోట్రో, జొకోవిచ్
-యూఎస్ ఓపెన్
Rafael
న్యూయార్క్: కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కోసం బరిలోకి దిగిన స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్.. ఊహించని రీతిలో యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. మోకాలి గాయం తిరుగబెట్టడంతో సెమీస్ మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో మూడోసీడ్ డెల్ పోట్రో (అర్జెంటీనా) 7-6, (7/3), 6-2 ఆధిక్యంలో ఉన్న దశలో డిఫెండింగ్ చాంపియన్ నాదల్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా నాలుగోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను అందుకోవాలన్న ఆశకు రెండు అడుగుల దూరంలో నిలిచిపోయాడు. ఈ సీజన్‌లో గాయంతో వైదొలగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో మారిన్ సిలిచ్‌తో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్లో ఐదోసెట్ మధ్యలో నుంచి నాదల్ తప్పుకున్నాడు. దాదాపు 16 గంటలపాటు మ్యాచ్‌లు ఆడి సెమీస్‌కు చేరుకున్న నాదల్‌ను కుడి మోకాలి గాయం తీవ్రంగా ఇబ్బందిపెట్టింది. తొలిసెట్ నాలుగో గేమ్‌లో నొప్పి ప్రారంభమైనా మొండిగా మ్యాచ్‌ను కొనసాగించాడు. ఏడో గేమ్‌లో తీవ్రం కావడంతో చికిత్స తీసుకుని బ్యాండేజ్ కట్టుకుని ఆడాడు.

Kei-Nishikori
ఈ క్రమంలో 10వ గేమ్‌లో డెల్ పోట్రో సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ రెండు సెట్ పాయింట్లను కాచుకున్నాడు. దీంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లింది. అయితే టైబ్రేక్‌లో డెల్ పోట్రో బలమైన సర్వీస్‌లతో పాటు నాణ్యమైన స్ట్రోక్స్ కొట్టాడు. వీటిని తీయలేకపోయిన నాదల్.. 69 నిమిషాల్లో సెట్‌ను చేజార్చుకున్నాడు. రెండోసెట్‌లో మూడు గేమ్‌ల తర్వాత నొప్పి మరింత తీవ్రం కావడంతో నాదల్ మెడికల్ టైమ్ అవుట్ తీసుకున్నాడు. కుడి మోకాలికి ఉన్న బ్యాండేజ్‌లను తొలిగించి వాటి స్థానంలో కొత్త వాటిని వేసుకున్నాడు. దీంతో స్పెయిన్ ప్లేయర్ మైదానంలో చురుకుగా కదల్లేకపోయాడు. రెండుసార్లు నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన డెల్ పోట్రో 3-1, 5-1 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఏడో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను కాపాడుకున్నా.. తర్వాతి గేమ్‌లో డెల్ పోట్రో సర్వీస్‌తో సెట్‌ను ముగించాడు. రెండు గంటలా 1 నిమిషం పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ 4, డెల్ పోట్రో 2 ఏస్‌లను సంధించారు. ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేసిన ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు 19సార్లు అనవసర తప్పిదాలు చేశాడు. 26 విన్నర్లు, రెండు బ్రేక్ పాయింట్ అవకాశాలను కాచుకున్నాడు.

Novak

10 ఏండ్ల శత్రుత్వం..

2009లో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన డెల్ పోట్రో.. ఆదివారం అర్ధరాత్రి జరిగే ఫైనల్లో జొకోవిచ్‌తో అమీతుమీ తేల్చుకుంటాడు. ఈ ఇద్దరి మధ్య గత 10 ఏండ్లుగా పోటీ నడుస్తున్నది. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 14-4తో డెల్ పోట్రోకు అందనంత ఎత్తులో ఉన్నాడు. 2007, 2012 యూఎస్ ఓపెన్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా డెల్ పోట్రోపై గెలిచిన రికార్డు సెర్బియన్ సొంతం. డెల్ పోట్రోకు ఇది రెండో స్లామ్ ఫైనల్ కావడంతో ఎలాగైనా టైటిల్ గెలువాలని పట్టుదలగా ఉన్నాడు.

Juan-Martin

ఎనిమిదోసారి..

ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్.. ఎనిమిదోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో ఆరోసీడ్ జొకోవిచ్ 6-3, 6-4, 6-2తో 21వ సీడ్ నిషికోరి (జపాన్)పై గెలిచాడు. కెరీర్‌లో 23వసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న జొకో.. 2011, 2015లో ఇక్కడ టైటిల్స్‌ను నెగ్గాడు. 2017లో గాయంతో టోర్నీలో పాల్గొనలేదు. కెరీర్‌లో 14వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న జొకోవిచ్.. ఇది గెలిస్తే పీట్ సంప్రాస్ రికార్డును సమం చేస్తాడు. ఓవరాల్‌గా నిషికోరితో ఆడిన 17 మ్యాచ్‌ల్లో సెర్బియన్ 15సార్లు గెలిచాడు. 2 గంటలా 22 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. జొకోవిచ్ సర్వీస్, బేస్‌లైన్ గేమ్‌తో నిషికోరిని పూర్తిగా కట్టడి చేశాడు. రిటర్న్ షాట్లలోనూ పదును చూపెట్టిన జొకోవిచ్.. బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకోవడంలో కాస్త తడబడ్డాడు. తొలిసెట్‌లో ఐదు, రెండో సెట్ తొలి గేమ్‌లో నాలుగింటిని వృథా చేశాడు. కానీ ఐదో గేమ్‌లో వచ్చిన బ్రేక్ పాయింట్‌ను కాపాడుకున్న జోకోవిచ్.. మూడోసెట్‌లో మరో రెండింటిని కాచుకుని ముందంజ వేశాడు. మ్యాచ్ మొత్తంలో 13 బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న నిషికోరి 55 అనవసర తప్పిదాలు చేశాడు. నాలుగుసార్లు మాత్రమే జొకో సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. జొకోవిచ్ 3 ఏస్‌లు, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.

265

More News

VIRAL NEWS

Featured Articles