బ్రెజిల్ గుండె పగిలె!


Sun,July 8, 2018 01:34 AM

- క్వార్టర్స్‌లో బెల్జియం షాక్
- 2-1 గోల్స్‌తో గెలిచి సెమీస్ చేరిన రెడ్‌డెవిల్స్..
- ఫిఫా ప్రపంచకప్ నుంచి సాంబాటీమ్ ఔట్

Kevin-De-Bruynee
ఫుట్‌బాల్ ఆటకు వారు బ్రాండ్ అంబాసిడర్స్.. ఆ జట్టు ఆడటం చూస్తుంటే ఓ అందమైన ప్రకృతిదృశ్యం తిలకించినట్టుగా అద్భుతంగా అనిపిస్తుంది.. ఆటగాళ్ల మధ్య సాగే పాస్‌లు చూస్తుంటే సాంబా డ్యాన్స్ చూస్తున్నట్లు అనిపిస్తుంది.. డ్రిబ్లింగ్ నైపుణ్యం చూస్తే వారు వేరే గ్రహం నుంచి వచ్చారా అనిపిస్తుంది.. గోల్‌పోస్టు ముందు వారు చూపే విన్యాసాలు.. వైవిధ్యమైన షాట్లు.. బైసికిల్ కిక్స్ చూస్తే ఔరా అని నోరెళ్లబెట్టాల్సిందే.. ఇక ఫిఫా ప్రపంచకప్‌లో ఆ జట్టు ఆట ఫుట్‌బాల్ అభిమానులను మరో లోకానికి తీసుకెళుతుంది.. ప్రపంచకప్‌లో ప్రతిసారి ఆ జట్టు ఫేవరెట్‌గా నిలుస్తుంది.. రికార్డు స్థాయిలో 5సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు బ్రెజిల్.. అభిమానులంతా సాంబా టీమ్‌గా ముద్దుగా పిలుచుకుంటారు.. రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీలోనూ హాట్‌ఫేవరెట్ బ్రెజిల్.. కానీ క్వార్టర్ ఫైనల్లో అనుకోని షాక్ తగిలింది.. బెల్జియం జట్టు చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.. 2014లో సొంతగడ్డపై సెమీస్‌లో జర్మనీ చేతిలో 7-1 తేడాతో ఓడిన బ్రెజిల్ టోర్నీ నుంచి వైదొలగగా.. 2018లో క్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో బ్రెజిల్ గుండె పగిలింది..
Kevin-De-Bruyne

కజాన్ అరీనా(రష్యా):

కొడితే కొట్టాలిరా..సిక్స్ కొట్టాలి అన్న ఫేమస్ తెలుగుపాటను గుర్తుకు తెచ్చేలా బెల్జియం జట్టు అదరగొట్టింది. గ్రూప్‌దశ నుంచి ఫిఫా ప్రపంచకప్‌లో అదరగొడుతున్న ఆ జట్టు చరిత్రలోనే మధురమైన విజయాన్నందుకుంది. శుక్రవారం అర్థరాత్రి టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్‌పై 2-1 స్కోరుతో గెలిచి అద్భుతం చేసింది. ఈ విజయంతో ప్రపంచకప్ సెమీస్‌లో చోటు దక్కించుకోగా.. ఓటమితో సాంబా జట్టు భారంగా నిష్క్రమించింది. గత 15 మ్యాచ్‌ల నుంచి ఓటమన్నదే ఎరుగని బ్రెజిల్ జట్టు ఈ మ్యాచ్‌లో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. ప్రారంభంలో టియాగో సిల్వా, జట్టు స్టార్ ఫార్వర్డ్ నెయ్‌మార్ జోరుగా ఆడడంతో బెల్జియం జట్టు పూర్తిగా రక్షణాత్మక ఆటకే పరిమితంగా కాగా..మిడ్‌ఫీల్డర్ ఫెర్నాండినో చేసిన సెల్ఫ్‌గోల్ బెల్జియం జట్టుకు ఊపు తెచ్చింది. ఆట 13వ నిమిషంలో బంతిని ఆపే క్రమంలో సొంత గోల్‌పోస్టులోకి పంపడంతో అనూహ్యంగా బెల్జియం జట్టు 1-0 ఆధిక్యం అందుకుంది. ఆట 31వ నిమిషంలో బెల్జియం స్టార్ మిడ్‌ఫీల్డర్ డిబ్రుయెన్ అద్భుతమైన గోల్‌తో జట్టుకు 2-0 ఆధిక్యం అందించాడు. మరోవైపు సెకండాఫ్‌లో బ్రెజిల్ ఆటగాడు అగాస్టియన్ గోల్‌తో ఆధిక్యం 2-1కి పరిమితమైనా బ్రెజిల్ దాడులను నిలువరించిన బెల్జియం జట్టు విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లగా.. ఓటమితో అర్జెంటీనా, ఉరుగ్వే, కొలంబియా దారిలో మరో దక్షిణఅమెరికా దేశం బ్రెజిల్ కూడా ఇంటిముఖం పట్టింది. మంగళవారం జరిగే తొలిసెమీస్‌లో ఫ్రాన్స్‌తో బెల్జియం తలపడనుంది.

ఆరంభంలో జోరుగా ఆడినా...

ఆట ప్రారంభంలో బ్రెజిల్ అద్భుతంగా ఆడుతూ బెల్జియం గోల్‌పోస్టుపై నిరంతరం దాడులతో అకట్టుకుంది. కాస్త ఒత్తిడి..మరింత తడబాటుతో బెల్జియం జట్టు.సాంబా జట్టును ఢీకొట్టింది. తొలి పదినిమిషాల్లో బ్రెజిల్ మిడ్ ఫీల్డర్ సిల్వాతో కలిసి నెయ్‌మార్ హడలెత్తించాడు. వరుస దాడులతో గోల్ చేసేలా కనిపించినా బెల్జియం గోల్‌కీపర్ టిబాట్ కౌర్టిస్ అడ్డుగోడలా నిలబడి అడ్డుకున్నాడు. కాగా మ్యాచ్‌లో ఫెర్నాండినో సెల్ఫ్‌గోల్‌తో బ్రెజిల్ ఆట గాడితప్పింది. ఒకవైపు బెల్జియం జట్టు దాడులను డిబ్రుయెన్, లుకాకు సంయుక్తంగా నిర్వహిస్తుండగా బ్రెజిల్‌పై ఒత్తిడి పెరిగింది. ఆట 31వ నిమిషంలో డిబాక్స్ బయట నుంచి లుకాకు అందించిన పాస్‌ను బిబ్రుయెన్ అద్భుతంగా గోల్‌పోస్టులోకి పంపి జట్టుకు 2-0 ఆధిక్యాన్నిచ్చాడు. ఈ ప్రపంచకప్‌లో డిబ్రుయెన్‌కు ఇదే తొలిగోల్ కావడం విశేషం. దీంతో బ్రెజిల్ స్కోరు సమం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా.. పటిష్ఠమైన బెల్జియం రక్షణశ్రేణిని తప్పించలేకపోయారు. దీంతో ప్రథమార్ధం ముగిసేసరికి బ్రెజిల్ 0-2తో వెనుకంజ వేసింది..
AFP

గోల్ కొట్టినా..

రెండో అర్ధభాగంలోనూ బ్రెజిల్ దాడులను కౌర్టిస్ అడ్డుకోవడంతో నెయ్‌మార్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా, ఆట 76వ నిమిషంలో అగాస్టియన్ గోల్ కొట్టి 2-1కి ఆధిక్యాన్ని తగ్గించడంతో బ్రెజిల్ దాడుల్లో మరింత పదును పెరిగింది.. ఒకవైపు సమయం మించి పోతుండడంతో బ్రెజిల్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. మరోవైపు విజయం సాధించాలన్న కసితో బెల్జియం వారికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో నిర్ణీత సమయం ముగిసేసరికి బెల్జియం జట్టు 2-1తో విజయం సాధించి సగర్వంగా సెమీస్‌కు దూసుకెళ్లింది.

679

More News

VIRAL NEWS