ముంబై మహాన్..


Sat,May 20, 2017 12:50 AM

mumbai
ఐపీఎల్ ఫైనల్లో రోహిత్‌సేన.. రేపు పుణెతో టైటిల్ పోరు.. విఫలమైన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ఊహించినంత ఉత్కంఠ లేదు.. ధనాధన్ షాట్లూ లేవు..!బౌండరీల మోత లేదు.. సిక్సర్ల జాతరా లేదు..!!పరుగుల వరద లేదు.. ఫీల్డర్ల విన్యాసాలు లేవు..!!!వెరసి.. అభిమానుల ఆశలకు, పొట్టి ఫార్మాట్ తీరుకు భిన్నంగా సాగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పైచేయి సాధించింది. కోల్‌కతాపై తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ ఈ సీజన్‌లో ప్రత్యర్థులపై మూడో విజయాన్ని నమోదు చేస్తూ ఐపీఎల్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

బెంగళూరు: పోరాటం చేయాల్సిన దశలో పెవిలియన్‌కు క్యూ కట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్‌లో తమ ప్రస్థానాన్ని ముగించింది. ఫ్రాంచైజీ యజమాని షారూక్ సాక్షిగా.. చిన్నస్వామిలో పెద్ద ఆట ఆడలేక ముంబై బౌలర్ల పరాక్రమం ముందు బొక్కబోర్లా పడింది. దీంతో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్‌కతాపై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. టాస్ ఓడిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఒక్కరు కూడా రాణించలేకపోయారు. తర్వాత ముంబై 14.3 ఓవర్లలో 4 వికెట్లకు 111 పరుగులు చేసింది. క్రునాల్ పాండ్యా (30 బంతుల్లో 45 నాటౌట్; 8 ఫోర్లు), రోహిత్ (24 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. స్వల్ప లక్ష్యం కావడంతో ఆరంభం నుంచే కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 36 పరుగులకే ఓపెనర్లతో పాటు రాయుడు (6) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్, క్రునాల్ ఓపికగా బ్యాటింగ్ చేశారు. పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ చెత్త బంతులను మాత్రమే భారీ షాట్లుగా మలిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించాకా రోహిత్ వెనుదిరిగాడు. తర్వాత విజయానికి అవసరమైన 20 పరుగులను పొలార్డ్ (9 నాటౌట్), క్రునాల్ సమకూర్చారు. కర్ణ్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Karn-Sharma

పెవిలియన్‌కు క్యూ..


భారీ ఆశలు పెట్టుకున్న క్రిస్‌లిన్ (4) రెండో ఓవర్‌లో ఔట్‌కావడంతో కోల్‌కతా వికెట్ల పతనం మొదలైంది. తర్వాత ఆరు బంతుల తేడాలో నరైన్ (10), ఉతప్ప (1) పెవిలియన్‌కు చేరడంతో పవర్‌ప్లేలో నైట్‌రైడర్స్ 3 వికెట్లకు 25 పరుగులే చేసింది. ఎలిమినేటర్ హీరో గంభీర్ (12)తో పాటు గ్రాండ్‌హోమీ (0)ని ఏడో ఓవర్‌లో స్పిన్నర్ కర్ణ్‌శర్మ (4/16) వరుస బంతుల్లో ఔట్ చేశాడు. దీంతో కోల్‌కతా 31 పరుగులకు సగం వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్యకుమార్, ఇషాంక్ జగ్గీ (31 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను పునర్‌నిర్మించే ప్రయత్నం చేశారు. భారీ షాట్లకు పోకుండా ఆరో వికెట్‌కు 56 పరుగులు జోడించి పరువు కాపాడారు. ఓవరాల్‌గా 14 ఓవర్లలో గంభీర్‌సేన స్కోరు 83/5కు చేరింది. తన ఆఖరి (ఇన్నింగ్స్ 15వ) ఓవర్‌కు బౌలింగ్‌కు వచ్చిన కర్ణ్‌శర్మ జగ్గీ వికెట్ తీయగా, 17వ ఓవర్‌లో జాన్సన్... ఐదు బంతుల్లో చావ్లా (2), కోల్టర్‌నీల్ (6)లను వెనక్కిపంపాడు. తర్వాత వరుస ఓవర్లలో మిగతా రెండు వికెట్లు పడటంతో నైట్‌రైడర్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. బుమ్రా 3, జాన్సన్ 2 వికెట్లు తీశారు.

స్కోరుబోర్డు


కోల్‌కతా: క్రిస్‌లిన్ (సి) పొలార్డ్ (బి) బుమ్రా 4, నరైన్ (స్టంప్) పార్థివ్ (బి) కర్ణ్‌శర్మ 10, గంభీర్ (సి) హార్దిక్ (బి) కర్ణ్‌శర్మ 12, ఉతప్ప ఎల్బీ (బి) బుమ్రా 1, జగ్గీ (సి) జాన్సన్ (బి) కర్ణ్‌శర్మ 28, గ్రాండ్‌హోమీ ఎల్బీ (బి) కర్ణ్‌శర్మ 0, సూర్యకుమార్ (సి) మలింగ (బి) బుమ్రా 31, చావ్లా (సి) రాయుడు (బి) జాన్సన్ 2, కోల్టర్‌నీల్ (సి) హార్దిక్ (బి) జాన్సన్ 6, ఉమేశ్ నాటౌట్ 2, రాజ్‌పుత్ (బి) మలింగ 4, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 18.5 ఓవర్లలో 107 ఆలౌట్.వికెట్లపతనం: 1-5, 2-24, 3-25, 4-31, 5-31, 6-87, 7-94, 8-100, 9-101, 10-107.బౌలింగ్: జాన్సన్ 4-0-28-2, బుమ్రా 3-1-7-3, మలింగ 3.5-0-24-1, కర్ణ్‌శర్మ 4-0-16-4, క్రునాల్ 3-0-25-0, హార్దిక్ 1-0-4-0.
ముంబై: సిమ్మన్స్ ఎల్బీ (బి) చావ్లా 3, పార్థివ్ (సి) ఉతప్ప (బి) ఉమేశ్ 14, రాయుడు (బి) చావ్లా 6, రోహిత్ (సి) రాజ్‌పుత్ (బి) కోల్టర్‌నీల్ 26, క్రునాల్ నాటౌట్ 45, పొలార్డ్ నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 14.3 ఓవర్లలో 4 వికెట్లకు 111. వికెట్లపతనం: 1-11, 2-42, 3-34, 4-88.బౌలింగ్: ఉమేశ్ 2.3-0-23-1, చావ్లా 4-0-34-2, కోల్టర్‌నీల్ 3-0-15-1, నరైన్ 4-0-21-0, రాజ్‌పుత్ 1-0-14-0.

474

More News

VIRAL NEWS