ఇప్పుడు కాక.. ఇంకెప్పుడు


Wed,May 22, 2019 03:02 AM

వరల్డ్‌కప్.. ఈ ట్రోఫీకి రూపకల్పన చేసిందే ఇంగ్లండ్. ఆతిథ్యానికి మిగిలిన దేశాలు వెనుకడుగు వేస్తున్న కాలంలోనే వరుసగా మూడు సార్లు ప్రపంచకప్ టోర్నీకి వేదికైన దేశం. అసలు ఆ మాటకొస్తే.. క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఇంగ్లండే. విశ్వసమరం ఆరంభం నుంచి ట్రోఫీని మనసారా హుత్తుకోవాలనుకుంటున్న ఇంగ్లండ్ కల ఇప్పటికీ కలగానే మిగిలింది. 11 సార్లు టోర్నీ బరిలో దిగినా.. ప్రతిసారి రిక్తహస్తాలే వెక్కిరించాయి. క్రికెట్ పుట్టినిల్లు ముద్రనుంచి జగజ్జేత అనిపించుకునేందుకు ఇంగ్లండ్ పడ్డ తాపత్రయం అంతాఇంతా కాదు. 2015 వరల్డ్‌కప్‌లో లీగ్ దశలోనే వెనుదిరగడం ఇంగ్లండ్‌కు మంచి చేసిందనే చెప్పాలి. అక్కడి నుంచి ఆ జట్టు దృక్పథమే మారిపోయింది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఓ లెక్క అన్నచందంగా సంప్రదాయ పద్ధతిని పక్కనపెట్టి బాదుడు మీద పడింది. ఎంత బలంగా కొడితే టీమ్‌లో
అంత బలమైన స్థానం అన్నట్లు మేనేజ్‌మెంట్ కూడా బాదుడుగాళ్లకే పెద్దపీట వేయడంతో నాలుగేండ్లు తిరిగే సరికి పరిస్థితి తారుమారైంది. జట్టులో అరడజను మందికి పైగా హిట్టర్లు తయారయ్యారు. హిట్టర్లంటే ఏ రెండు, మూడు షాట్లో ఆడి ఔటయ్యేవాళ్లుకాదు. నిల్చున్నారంటే ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలు చుక్కలు చూపనిదే వదలని మహా ఘటికులు. మరి ఇలాంటి లైనప్‌తో దిగుతున్న ఇంగ్లండ్ 44 ఏండ్లుగా ఊరిస్తున్న కప్పును ఈ సారైనా పుట్టింట్లో పట్టుకుంటుందా చూడాలి.

england
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: ఆతిథ్య దేశాలు వరల్డ్‌కప్ చేజిక్కించుకోలేవు అనే అపవాదును 2011లో భారత్ చెరిపేయగా.. క్రితంసారి ఆస్ట్రేలియా దాన్ని కొనసాగించింది. ఇంగ్లండ్ వరుసగా మూడోసారి ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తుందా అంటే.. ఎక్కవ మంది ఔననే అంటున్నారు. ఇటీవల పాకిస్థాన్‌తో సిరీస్‌లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ ఆటతీరు ఈ అంచనాలకు ఊతమిస్త్తున్నది. ముందు బ్యాటింగ్ చేసిన రెండు సార్లు 350కి పైగా స్కోర్లు చేసిన ఇంగ్లండ్.. రెండు సార్లు 340కి పైగా లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. మూడో వన్డేలోనైతే.. 358 పరుగుల టార్గెట్‌ను మరో 5 ఓవర్లు మిగిలుండగానే పూర్తిచేసింది. తొలి మూడు టోర్నీలతో పాటు 1999 టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లండ్ ఎప్పుడూ లేనంత బలంగా ఉందన్నది జగమెరిగిన సత్యం. టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. పరిమిత ఓవర్లపై పెద్దగా దృష్టిపెట్టని ఇంగ్లండ్.. ఈ మధ్య కాలంలో వన్డేల్లో చెలరేగిపోతున్నది. ఎంతగా అంటే అనతి కాలంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచేటంతగా. భీకరమైన టాపార్డర్, అండగా ఆల్‌రౌండర్లు, అసలే చిన్న మైదానాలు, ఆపై ఫ్లాట్ పిచ్‌లు, అన్నింటికి మించి సొంతగడ్డపై అశేష ప్రేక్షకుల అండదండలు వరల్డ్‌కప్ నెగ్గేందుకు ఇంతకన్నా ఏం కావాలి. ఈనెల 30న మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాప్రికాతో ఇంగ్లండ్ ఆడుతుంది.

బలాలేంటి..

దేవరకోట అందులోనూ మామిడితోట.. ఏం చేసినా అడిగేవాడు ఉండడు టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా డైలాగ్.. సొంతగడ్డ, అందులోనూ ఫ్లాట్ పిచ్‌లు.. ఎంత బాదినా అడ్డుకునే వారే ఉండరు వీరబాదుడుకు విరామమే ఉండదు ఇది వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ పరిస్థితి. బ్యాటింగే బలంగా విశ్వసమరంలో అడుగుపెడుతున్న ఇంగ్లండ్ నాలుగు దశాబ్దాల కలను ఈ సారైనా నెరవేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. ప్రపంచకప్ చరిత్రలో ఎన్నడూ లేనంత పటిష్ఠ జట్టుతో ఇంగ్లండ్ మెగాటోర్నీకి సిద్ధమైంది. బెయిర్‌స్టో, రూట్, రాయ్, మోర్గాన్, బట్లర్, స్టోక్స్, మొయిన్ అలీ, ఆర్చర్, టామ్ కరన్ ఇలాంటి దుర్భేద్యమైన లైనప్‌ను చూస్తే ఎంతటి బౌలింగ్ దళానికైనా వణుకుపుడుతుందంటే అతిశయోక్తి కాదు. మెగాటోర్నీకి ముందు ప్రపంచకప్ జరుగనున్న పిచ్‌లపై పాకిస్థాన్‌ను పచ్చడికింద కొట్టడం ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచిందనడంలో సందేహం లేదు. కూతురు దవాఖానలో ఉంటే రాత్రంతా తనకు సపర్యలు చేసుకుంటూ పక్కనే కూర్చున్న ఓ ఆటగాడు కేవలం రెండే గంటలు రెస్ట్ తీసుకొని తిరిగొచ్చి శతకంతో దుమ్మురేపాడంటేనే ఇంగ్లండ్ ఆటగాళ్ల దృక్పథం ఎంటో అర్థమవుతున్నది.

బలహీనతలేంటి..

పేస్ బౌలింగ్ విషయంలో మోర్గాన్ సేన కాస్త బలహీనంగా కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికాకు రబాడ, భారత్‌కు బుమ్రా, ఆస్ట్రేలియాకు స్టార్క్, న్యూజిలాండ్‌కు బౌల్ట్‌లా ఇంగ్లండ్‌కు చెప్పుకోదగ్గ పేసర్ లేకపోవడం లోటే. ఫ్లాట్ పిచ్‌లపై మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ తమ కోటా పూర్తి చేయగలరా అనేది కూడా అనుమానమే. ఔట్ ఫీల్డ్ వేగంగా ఉండే మైదానాల్లో ఆల్‌రౌండర్ల బౌలింగ్‌ను నమ్ముకోవడం సాహసమే. ఈ బౌలింగ్‌ను పాక్ బ్యాట్స్‌మెన్ తుక్కు కింద కొడితే.. ఇక బలమైన బ్యాటింగ్ లైనప్స్ ఉన్న భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఏ లెక్కన చెలరేగుతాయో చెప్పలేం. బౌలర్ల వైఫల్యంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బోర్డు విల్లే, డెన్లీపై వేటు వేసి ఆర్చర్, డాసన్‌కు జట్టులో చోటు కల్పించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని ఆర్చర్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. గ్రూప్ దశలో సత్తాచాటినా నాకౌట్‌లో ఒత్తిడిని ఎదుర్కొలేక చేతులెత్తేయడం కూడా ఇంగ్లండ్‌ను కలవరపెడుతున్నది.

archer

ఆర్చర్ ఆగయా

-విన్స్, డాసన్‌కు చోటు
-మూడు మార్పులతో ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టు

సుదీర్ఘ కలను సాకారం చేసుకోవాలని చూస్తున్న ఇంగ్లండ్ అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నది. రెండు శతాబ్దాల తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న మెగాటోర్నీని ఎలాగైనా ముద్దాడాలని చూస్తున్న ఇంగ్లిష్ జట్టు ప్రత్యర్థులకు దీటైన సవాలు విసిరేందుకు సై అంటున్నది. ఐర్లాండ్, పాకిస్థాన్ సిరీస్‌లలో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మంగళవారం మూడు మార్పులతో 15 మంది జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొడుతున్న జోఫ్రా ఆర్చర్ అంత అనుకున్నట్లే..ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గంటకు 140 కి.మీ వేగానికి తగ్గకుండా బంతులు సంధించే ఆర్చర్..లోయార్డర్‌లో కీలక బ్యాట్స్‌మన్‌గాను సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. తన కెరీర్‌లో ఇంగ్లండ్ తరఫున కేవలం మూడు వన్డేలు ఆడిన ఆర్చర్...సెలెక్టర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు. అందివచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ మెగాటోర్నీ బెర్తు దక్కించుకున్నాడు.

మరోవైపు.. లెఫ్టార్మ్ పేసర్ డేవిడ్ విల్లేకు అనూహ్యంగా చుక్కెదురైంది. కెరీర్‌లో 46 వన్డేలాడిన 29 ఏండ్ల విల్లేకు ఆర్చర్ చెక్ పెట్టాడని చెప్పొచ్చు. జో డెన్లీని తప్పిస్తూ స్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్‌కు అవకాశం కల్పించారు. రెగ్యులర్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు డాసన్‌ను రిజర్వ్‌గా ఎంపిక చేశారు. నిషేధిత డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓపెనర్ అలెక్స్ హేల్స్ స్థానంలో జేమ్స్ విన్స్ జట్టులోకి వచ్చాడు. వాస్తవానికి ఈసీబీ ప్రకటించిన ప్రీలిమినరీ జట్టులో డెన్లీ, విల్లే చోటు దక్కించుకున్నా..ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ మార్పులు, చేర్పులు చేసింది. ఇదిలా ఉంటే తనను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించడంపై విల్లే విమర్శలు ఎక్కుపెట్టాడు. గత మూడు, నాలుగేండ్ల నుంచి ఎంతో కష్టపడి జట్టును నంబర్‌వన్ స్థానానికి చేర్చాం. కానీ కొంతమంది అలా వచ్చి ఇలా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇది ఎంత వరకు సరైందో నాకు అర్థం కావడం లేదు అని విల్లే అన్నాడు.

సూపర్ సే ఊపర్

చూస్తుండగానే సెంచరీలు బాదే బట్లర్.. పరిస్థితులను ఉల్టాపల్టా చేయడంలో ముందుండే బెయిర్‌స్టో. నిలకడకు నిలువెత్తు రూపమైన జాసెన్ రాయ్.. పట్టుదలకు పర్యాయ పదంలాంటి జో రూట్‌ట్. బ్యాటైనా, బాలైనా నా రూటే సెపరేటు అనే బెన్ స్టోక్స్.. వరల్డ్‌కప్‌లోనే రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన కెప్టెన్ మోర్గాన్. బ్యాట్‌తోనూ విధ్వంసం సృష్టించగలిగే
ఆఫ్‌స్పిన్నర్ మొయిన్ అలీ.. పంతం పడితే ప్రత్యర్థి అంతు చూసే లెగ్‌స్పిన్నర్ ఆదిల్ రషీద్.

అంచనా

-టైటిల్ గెలిచే సత్తా పుష్కలంగా ఉంది. అనూహ్యా ఫలితాలు రాకపోతే ఇంగ్లిష్ జట్టును ఫైనల్లో చూడొచ్చు
-కోచ్: ట్రెవర్ బైలిస్
-ప్రస్తుత ఐసీసీ ర్యాంక్ 1

జట్టు వివరాలు: మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, బట్లర్, టామ్ కర్రాన్, లియామ్ డాసన్, లియామ్ ప్లంకెట్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, స్టోక్స్, జేమ్స్ విన్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

1270

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles