పోటీలోకొచ్చినా..


Mon,September 10, 2018 01:22 AM

-దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..
-భారీ ఆధిక్యం దిశగా అడుగులు
-జడేజా, విహారీ అర్ధసెంచరీలు
-భారత్ తొలి ఇన్నింగ్స్ 292 ఆలౌట్
Vihari
లండన్: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతున్నది. ఇంగ్లిష్ బౌలింగ్ ధాటికి స్వల్పస్కోరుకే చాపచుట్టేస్తుందనుకున్న టీమ్‌ఇండియా..జడేజా, విహారీ అర్ధసెంచరీలతో గట్టెక్కింది. గౌరప్రదమైన స్కోరుతో కోహ్లీసేన పోటీలోకొచ్చినా స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తున్నది. అలిస్టర్ కుక్(46 నాటౌట్), కెప్టెన్ రూట్(29 నాటౌట్) బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసింది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ప్రస్తుతం 154 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. షమీ(1/32), జడేజా(1/36) ఒక్కో వికెట్ దక్కింది.

ravindra-jadeja
జడేజా విహారం: స్వల్పస్కోరుకే మరోమారు పరిమితమనుకున్న భారత పరువును జడేజా(86 నాటౌట్), విహారీ(56) అర్ధసెంచరీలతో కాపాడారు. 174/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్‌ఇండియా జడేజా, విహారీ బ్యాటింగ్‌తో 95 ఓవర్లలో 292 పరుగులు చేసింది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును వీరిద్దరు ఒడ్డుకు పడేశారు. ఓవైపు ఇంగ్లండ్ పేస్ ద్వయం అండర్సన్, బ్రాడ్ తొలి గంటలో స్వింగ్ బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం చేసినా వికెట్ చేజార్చుకోకుండా బ్యాటింగ్ చేశారు. చెత్త బంతుల జోలికి పోకుండా ఓపికతో స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఓవైపు జడేజా దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తే..మరోవైపు అరంగేట్రం మ్యాచ్‌లోనూ విహారీ సమయోచితంగా రాణించాడు. ఈ క్రమంలో 104 బంతుల్లో ఈ తెలుగు కుర్రాడు అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. జడేజాతో కలిసి కీలక ఇన్నింగ్స్‌కు తెరలేపాడు. దీంతో వికెట్ కోల్పోకుండానే భారత్ భోజన విరామానికి వెళ్లింది. ఆ తర్వాత మొయిన్ అలీ(2/50)బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన విహారీ..వికెట్ సమర్పించుకున్నాడు. తన ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లినా.. నిరాశే ఎదురైంది.

దీంతో ఏడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన ఇషాంత్‌శర్మ(4)..జడేజాకు చక్కని సహకారం అందించాడు. వీలు చిక్కినప్పుడల్లా జడేజా బౌండరీలతో అలరిస్తూ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న జడేజా బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ అభిమానులను అలరించాడు. టీ విరామం తర్వాత అలీ బౌలింగ్‌లో ఇషాంత్ ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇషాంత్‌ను అనుసరిస్తూ షమీ(1) వెంటనే ఔట్ కావడంతో బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రా(0)..జడేజాకు అండగా నిలిచాడు. వీరిద్దరు ఇంగ్లిష్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ పరుగులు జతచేశారు. ముఖ్యంగా అశ్విన్ స్థానంలో జట్టులోకొచ్చిన జడేజా తన ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేస్తూ బౌండరీలతో అలరించాడు. అయితే బుమ్రా రనౌట్ కావడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడగా, ఇంగ్లండ్‌కు 40 పరుగుల ఆధిక్యం దక్కింది. అండర్సన్(2/54), స్టోక్స్(2/56), అలీ(2/50) రెండేసి వికెట్లు తీశారు.

స్కోరుబోర్డు

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 332 ఆలౌట్, భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్(బి)కర్రాన్ 37, ధవన్(ఎల్బీ)బ్రాడ్ 3, పుజార(సి)బెయిర్‌స్టో(బి)అండర్సన్ 37, కోహ్లీ(సి)రూట్(బి)స్టోక్స్ 49, రహానే(సి)కుక్(బి)అండర్సన్ 0, విహారీ(సి)బెయిర్‌స్టో(బి)అలీ 56, పంత్(సి)కుక్(బి)స్టోక్స్ 5, జడేజా 86 నాటౌట్, ఇషాంత్(సి)బెయిర్‌స్టో(బి)అలీ 4, షమీ(సి)బ్రాడ్(బి)రషీద్ 1, బుమ్రా(రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 95 ఓవర్లలో 292 ఆలౌట్; వికెట్ల పతనం: 1-6, 2-70, 3-101, 4-103, 5-154, 6-160, 7-237, 8-249, 9-260, 10-292; బౌలింగ్: అండర్సన్ 21-7-54-2, బ్రాడ్ 20-6-50-1, స్టోక్స్ 16-2-56-2, కర్రాన్ 11-1-49-1, అలీ 17-3-50-2, రషీద్ 10-2-19-1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: కుక్ 46 నాటౌట్, జెన్నింగ్స్(బి)షమీ 10, అలీ(బి)జడేజా 20, రూట్ 29 నాటౌట్, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 42 ఓవర్లలో 114/2; వికెట్ల పతనం: 1-27, 2-62; బౌలింగ్: బుమ్రా 12-4-26-0, ఇషాంత్ 7-3-11-0, షమీ 10-3-32-1, జడేజా 14-2-36-1.

519

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles