అన్నింటికి తల ఊపే వ్యక్తి కాదు!


Fri,November 16, 2018 12:59 AM

చీఫ్ కోచ్ రవిశాస్త్రిపై విమర్శకు కోహ్లీ కౌంటర్
చాలా విషయాలకు నో చెప్పాడు
-బ్యాటింగ్ మెరుగవ్వాలి

ముంబై: తాను ఏది చెబితే చీఫ్ కోచ్ రవిశాస్త్రి అదే వింటాడని వస్తున్న విమర్శలను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖండించాడు. శాస్త్రి అన్నింటికి తల ఊపే వ్యక్తి కాదని స్పష్టం చేశాడు. నా కెరీర్‌లో నేను విన్న అతిపెద్ద విమర్శ ఇది. నిజాయితీగా చెప్పాలంటే భారత క్రికెట్‌లో నేను చెప్పిన చాలా విషయాలకు నో చెప్పిన ఏకైక వ్యక్తి రవి. నిజాయితీతో కూడిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే నేను మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి అతను. గతంలో చెప్పిన వాళ్లకంటే శాస్త్రి చెప్పిన మాటలను బట్టే నా గేమ్‌లో చాలా మార్పులు చేసుకున్నా. జట్టులో అంతర్గత విషయాలను కూడా చాలా మార్చేశాడు. అవసరమైనప్పుడు ఇలాంటి విషయాలను చెబుతుంటాం. లేదంటే వదిలేస్తాం. అంతేగానీ టీమ్‌ఇండియాలో ఏదో జరుగుతుందని బహిరంగంగా మాట్లాడుకోం. మా మనసులు స్వచ్ఛంగా ఉన్నంతవరకు, మేం సరైన దిశలో వెళ్తున్నంతవరకు మేం కలిసే ముందుకు సాగుతాం అని ఆసీస్ పర్యటనకు బయలుదేరే ముందు విరాట్ పేర్కొన్నాడు. తాను ఒక్కడినే కాకుండా జట్టులో కూడా చాలా మంది శాస్త్రిని చూసి నేర్చుకున్నారని పునరుద్ఘాటించాడు. ఆటగాళ్లను ఏఏ స్థానాల్లో ఎలా ఆడించాలో కోచ్‌కు బాగా తెలుసన్నాడు. టీమ్‌ఇండియాకు శాస్త్రి సేవలు ఎనలేనివి. 2014 నుంచి మంచి జట్టును రూపొందించేందుకు కృషి చేస్తున్నాం. అటగాళ్లలో సత్తాను ఎలా బయటకు తీయాలో శాస్త్రికి బాగా తెలుసు. స్థానాలను బట్టి ఆటగాళ్లను ఆడించడంలో కోచ్ దిట్ట. ఏదేమైనా ప్రతి ఒక్కరికి అభిప్రాయాలు ఉంటాయి. మా జీవితాలను మేం గడుపుతాం. అనుకోకుండా వచ్చే విమర్శలను మేం ఆపలేం అని విరాట్ వ్యాఖ్యానించాడు.

Virat-Kohli

బ్యాటింగ్ మెరుగుపడాలి..


ఆసీస్ జట్టులో స్మిత్, వార్నర్ లేకపోవడంతో భారత్‌కు సిరీస్ గెలిచేందుకు మంచి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై కోహ్లీ మరోలా స్పందించాడు. మేం బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాలి. జట్టుగా ఈ వాస్తవాన్ని మేం గ్రహించాం. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు దీని కోసం కృషి చేయాలి. ఇంగ్లండ్‌లో ఓటమిపై మేం చాలా విషయాలు చర్చించుకున్నాం. చివరకు తేలింది ఏంటంటే మేం పెద్దగా తప్పులు చేయలేదని. మేం చేసింది సరైనది కాకపోయినా మూల్యం మాత్రం భారీగా చెల్లించాం. మేం మంచి క్రికెట్ ఆడినా తప్పులు కూడా అదే స్థాయిలో చేశాం. మ్యాచ్‌ను ఆధీనంలో ఉంచుకోవడంపై కసరత్తు చేయాలి. కఠిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న దాని కోసం పరిష్కారం వెతుకాలి అని విరాట్ వెల్లడించాడు.

బౌలర్లు ఓకే..


బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే విదేశీ పర్యటనల్లో బౌలర్లు బాగా రాణించారని కితాబిచ్చాడు. అయితే సిరీస్ గెలువాలంటే అన్ని విభాగాలు సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. మేం చివరిసారి ఆసీస్ వెళ్లిన్నప్పటితో పోలిస్తే బౌలర్ల ఫిట్‌నెస్ స్థాయి మరింత పెరుగాలి. ఆసీస్‌లో ఇది చాలా కీలకం. అక్కడి పిచ్‌లు కొన్నిసార్లు చాలా బోరింగ్‌గా తయారవుతాయి. కుకాబుర్రా బంతులు కూడా అనుకున్న స్థాయిలో స్వింగ్ కావు. కాబట్టి వేగాన్ని కొనసాగించాలంటే ప్రతి బౌలర్ ఫిట్‌నెస్‌తో ఉండాలి. అప్పుడే మెరుగైన ఆరంభాలు దక్కుతాయి. మోర్నీ మోర్కెల్, కలిస్, స్టెయిన్, రబడ అలా ఉన్నారు కాబట్టే ఆసీస్‌లో.. దక్షిణాఫ్రికా సిరీస్ గెలువగలింది. వాళ్లు అలసట లేకుండా సరైన ప్రాంతాల్లో బంతులు వేయడం వల్లే వికెట్లు దక్కాయి. మన బౌలర్లకు కూడా ఆ స్థాయిలో బౌలింగ్ చేసే సత్తా ఉందని నమ్ముతున్నా. ఒక్క దీనిపైనే దృష్టిపెట్టకుండా బ్యాట్స్‌మెన్ కూడా మంచి స్కోరును సాధించిపెట్టాలి. అని ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ వివరించాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు చేయాల్సిన అవసరం చాలా ఉందని కెప్టెన్ పునరుద్ఘాటించాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్‌లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ఉండాలని సూచించాడు.

ఆసీస్ కవ్విస్తే మేం కూడా రెడీ..


సుదీర్ఘంగా సాగే ఈ పర్యటనలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కవ్విస్తే దానికి దీటుగా బదులిస్తామన్నాడు. ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా సిరీస్ ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నాడు. ఆస్ట్రేలియన్ల ప్రవర్తనను బట్టి మా ప్రవర్తన ఉంటుంది. నో స్లెడ్జింగ్ పాలసీ అనేది వాళ్ల వ్యక్తిగత వ్యవహారం. మేమైతే ముందుగా కవ్వింపు చర్యలకు దిగం. ఒకవేళ వాళ్లు కవ్వించి గొడవలకు దిగితే బదులివ్వడానికి మేం సిద్ధం. ప్రస్తుతం క్రికెట్ పోకడ అలాగే ఉంది. వాళ్లు వెళ్లే దారిలోనే మేం వెళ్తాం. అనవసర విషయాలు తప్ప ఆటపైనే దృష్టిపెడుతాం. మా శక్తిని వృథాగా పోనిచ్చుకోదల్చుకోలేదు. ఏదేమైనా ఎలాంటి ఘర్షణ లేకుండా ఆట ఆడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అని కోహ్లీ పేర్కొన్నాడు. తన గత కెరీర్‌ను పక్కనబెడితే ప్రస్తుతం వ్యక్తిగా తాను చాలా పరిణతితో వ్యవహరిస్తున్నానని చెప్పాడు. ఇప్పటికైతే తన దృక్పధాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదన్నాడు. వ్యక్తిగత అంశాలపై చాలా సంతృప్తిగా ఉన్నానని వెల్లడించాడు. తన నైపుణ్యం, సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉందని భరోసా ఇచ్చాడు. కెప్టెన్‌గా అనసవర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

337

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles