ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా గంగూలీ


Fri,March 15, 2019 12:36 AM

sourav
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని.. సలహాదారుగా నియమించుకున్నది. కొత్త బాధ్యతల్లో దాదా.. హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పని చేయనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గత కొన్నేండ్లుగా జిందాల్స్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ల గురించి విన్నాను. ఇప్పుడు వాళ్ల క్రీడా వెంచర్‌తో కలిసి పని చేయబోతున్నా. ఢిల్లీ ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అని గంగూలీ పేర్కొన్నాడు. తాను సలహాదారుగా పని చేస్తున్నందుకు కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (పరస్పర విరుద్ధ ప్రయోజనం) సమస్య తలెత్తే అవకాశమే లేదని దాదా చెప్పాడు. ఈ విషయంపై ఇప్పటికే సీవోఏతో మాట్లాడానన్నాడు.

ఐపీఎల్‌లో బరిలోకి దిగిన ప్రతిసారి నిరాశతో వెనక్కి వచ్చిన ఢిల్లీ.. ఈసారి కచ్చితంగా టైటిల్‌ను గెలువాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. టీమ్‌ఇండియాకు దూకుడు నేర్పిన సారథిగా, సానుకూల దృక్పధంతో అత్యద్భుత ఫలితాలు రాబట్టిన ప్లేయర్‌గా, చావో రేవో పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని నైజంతో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని ఏర్పర్చుకున్న దాదాతో ఈసారి అదృష్టాన్ని మార్చుకోవాలని ఢిల్లీ భావిస్తున్నది. గంగూలీ అనుభవం, మార్గదర్శకత్వం, సలహాలు మా జట్టుకు బాగా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను మా కుటుంబ సభ్యుల్లో ఒకడు. సలహాదారుగా నియమించినందుకు మాకు గర్వంగా ఉంది అని ఢిల్లీ క్యాపిటల్స్ చైర్మన్ పార్త్ జిందాల్ అన్నారు. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు.. ఈనెల 24న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్‌ను మొదలుపెడుతుంది.

273

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles