ఫ్లాప్ షో


Mon,June 19, 2017 02:27 AM

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓటమి
తొలిసారి విజేతగా నిలిచిన పాకిస్థాన్
జమాన్ వీరోచిత సెంచరీ పరువు నిలబెట్టిన పాండ్యా

0, 21, 5, 22, 4, 9...చిన్న పిల్లలు నేర్చుకునే సంఖ్యలు కావు ఇవి. తమది ప్రపంచ స్థాయి అని చెప్పుకుంటున్న టాప్-6 భారత బ్యాట్స్‌మన్ చేసిన పరుగులివి..! 1/0, 2/6, 3/33, 4/54, 5/54, 6/72.. బౌలింగే మా ఆయుధమని జబ్బలు చరిచిన పాక్ బౌలర్లు మనోళ్లను ఔట్ చేసిన తీరు ఇది..!!ఈ రెండింటి మధ్య తేడా ఎంత అంటే.. ఆట కోసం వాళ్లు ప్రాణం పెట్టారు.. మనోళ్లు అలసత్వం చూపెట్టారు..వాళ్ల బ్యాట్స్‌మెన్ పోరాటం చేశారు.. మన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు..మన బౌలర్లది ఫ్లాప్ షో.. వాళ్ల పేసర్లది సూపర్‌హిట్ ధమాకా.. ఫలితం 2007 వరల్డ్‌కప్ ఫైనల్ సీన్‌ను పునరావృతం చేయలేకపోయిన విరాట్‌సేన.. ఇంగ్లండ్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌కు అప్పనంగా అప్పగించేసింది.
indiancricketers
ఓవల్: పాకిస్థాన్ జట్టుకు రంజాన్ వారం రోజుల ముందే వచ్చింది. దాదాపు అసాధ్యమనుకున్న చాంపియన్స్ ట్రోఫీని.. చాలా అలవోకగా, నీళ్లు తాగినంత సులువుగా చేజిక్కించుకుని పండుగ చేసుకుంటున్నారు. పాపం.. భారత అభిమానులు దీనిని కలలో కూడా ఊహించి ఉండరు..! ఇద్దరు బక్కపలుచని కుర్రాళ్లు ఆమిర్ (3/16), హసన్ అలీ (3/19) బంతితో కురిపించిన నిప్పుల తాండవానికి కొదమసింహాల్లాంటి మన విరాట్ వీరులు పెవిలియన్ నృత్యం చేశారు. ఫలితంగా క్రికెట్ ప్రపంచం పెట్టుకున్న అంచనాలను, ఆశలను తలక్రిందులు చేస్తూ ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 180 పరుగుల తేడాతో పాక్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

దీంతో దాయాది జట్టు తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ముందుగా పాక్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఫక్హార్ జమాన్ (106 బంతుల్లో 114; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేయగా, అజర్ అలీ (71 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్), హఫీజ్ (37 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా (43 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్. జమాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ధవన్‌కు గోల్డెన్ బ్యాట్, హసన్‌కు గోల్డెన్ బాల్ పురస్కారాలు దక్కాయి.
pak-team

నో బాల్‌తో లైఫ్

ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ మినహా భారత బౌలర్లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. నాలుగో ఓవర్‌లో బుమ్రా వేసిన నోబాల్ ఏకంగా పాక్ ఇన్నింగ్స్‌కే ప్రాణం పోసింది. వికెట్ పొడిగా ఉండటం, వాతావరణం మేఘావృతంగా ఉండటంతో ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ వ్యూహానికి బౌలర్లు సరైన సహకారం అందించలేకపోయారు. లైన్ అండ్ లెంగ్త్ కుదురక ఎక్స్‌ట్రాలు, నోబాల్స్ వేయడంతో ప్రత్యర్థులు ఒత్తిడిని సులువుగా అధిగమించారు. ఓపెనర్లు అజర్ అలీ, జమాన్ ఆరంభం నుంచే ఎదురుదాడి మొదలుపెట్టడంతో పరుగుల వరద పారింది. నాలుగోఓవర్‌లో నో బాల్‌తో బతికిపోయిన జమాన్ సూపర్ మ్యాన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి పవర్‌ప్లేలో 56 పరుగులు చేసిన ఈ ఇద్దరు ఆ తర్వాత స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోయారు.

ఫ్లాట్ వికెట్‌పై అశ్విన్ బంతిని సరైన దిశలో టర్న్ చేయకపోవడం, జడేజా పేస్‌లో భిన్నత్వాన్ని రాబట్టకపోవడంతో జమాన్ భారీ స్ట్రోక్స్ ఆడాడు. ఓవరాల్‌గా ఇద్దరు స్పిన్నర్లు 12 ఫోర్లు, 5 సిక్సర్లు సమర్పించుకున్నారు. అలీ, జమాన్ తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించి అద్భుతమైన వేదికను ఏర్పాటు చేశారు. ఈ దశలో అలీ రనౌటైనా.. టీమ్‌ఇండియా బౌలర్లు బాబర్ ఆజమ్ (46)పై ఒత్తిడి పెంచలేకపోయారు. ఈ క్రమంలో జమాన్ సెంచరీ పూర్తి చేసుకోగా రెండో వికెట్‌కు 72 పరుగులు సమకూరాయి. మిడిల్ ఓవర్లలో బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా రెండో పవర్‌ప్లే (11 నుంచి 40 వరకు)ను పాక్ బ్యాట్స్‌మన్ బాగా వినియోగించుకున్నారు. 191 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశారు. షోయబ్ మాలిక్ (12) నిరాశపర్చినా.. చివర్లో హఫీజ్, ఇమద్ వసీమ్ (25 నాటౌట్) విజృంభించి ఐదో వికెట్‌కు అజేయంగా 71 పరుగులు చేయడంతో అలవోకగా 300 పరుగులు చేసింది.
hasan-ali

ఆరంభం నుంచే..

లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు మూడో బంతికే ఎదురుదెబ్బ తగిలింది. ఆమిర్ వేసిన బలమైన లెఫ్ట్‌కట్టర్ నేరుగా వికెట్ల మీదకు దూసుకురావడంతో రోహిత్ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో సున్నా పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన టీమ్‌ఇండియాను ఆదుకునే బాధ్యత కోహ్లీ (5), ధవన్ (21)లపై పడింది. కానీ ఈ ఇద్దరు అనుభవజ్ఞులను కూడా పాక్ కుర్ర పేసర్లు కట్టిపడేశారు. ఆమిర్ తన రెండోఓవర్ రెండో బంతిని ఔట్ స్వింగర్‌గా మలిచాడు. కోహ్లీ బ్యాట్‌ను తాకి నేరుగా స్లిప్‌లోకి వెళ్లినా అజర్ అలీ అందుకోలేకపోయాడు.

జరిగిన పరిణామం నుంచి విరాట్ తేరుకోకముందే తర్వాతి బంతిని గుండ్‌లెంగ్త్‌తో ైఫ్లెట్ డెలివరి వేశాడు. అంతే కోహ్లీ బలంగా లెగ్‌సైడ్ ఆడే ప్రయత్నం చేయగా ఎడ్జ్ తీసుకొని పాయింట్‌లో పాదాబ్ చేతిలోకి వెళ్లింది. ఇక యువరాజ్ (22)తో కలిసి ధవన్ చకచకా ఫోర్లు కొట్టి కాస్త కుదురుకునే ప్రయత్నం చేసినా ఆమిర్ దెబ్బకు వెనక్కి వచ్చేశాడు. మధ్యలో షాదాబ్, హసన్ అలీ మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యువరాజ్, ధోనీ (4), కేదార్ (9) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించారు. ఫలితంగా టీమ్‌ఇండియా 72 పరుగులకు 6 వికెట్లు చేజార్చుకుని కోలుకోలేని స్థితిలో పడింది.

ఈ దశలో హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదుతూ ఆశలు రేకెత్తించే ప్రయత్నం చేశాడు. కానీ రెండో ఎండ్‌లో జడేజా (15) పరుగులు చేయకపోవడంతో పాండ్యాపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో సింగిల్ తీసే ప్రయత్నంలో హార్దిక్ రనౌట్‌కావడంతో మ్యాచ్ పూర్తిగా పాక్ చేతుల్లోకి వెళ్లిపోయింది. హార్దిక్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 152/7. కానీ 6 పరుగుల తేడాలో జడేజా, అశ్విన్ (1), బుమ్రా (1) ఔట్‌కావడంతో చిరస్మరణీయ విజయానికి అందనంత దూరంలో నిలిచిపోయింది.
goledn-bat

స్కోరు బోర్డు


పాకిస్థాన్:

అజర్ అలీ రనౌట్ 59, జమాన్ (సి) జడేజా (బి) పాండ్యా 114, ఆజమ్ (సి) యువరాజ్ (బి) జాదవ్ 46, మాలిక్ (సి) జాదవ్ (బి) భువనేశ్వర్ 12, హఫీజ్ నాటౌట్ 57, వసీమ్ నాటౌట్ 25, ఎక్స్‌ట్రాలు: 25, మొత్తం: 50 ఓవర్లలో 338/4.వికెట్లపతనం: 1-128, 2-200, 3-247, 4-267. బౌలింగ్: భువనేశ్వర్ 10-2-44-1, బుమ్రా 9-0-68-0, అశ్విన్ 10-0-70-0, హార్దిక్ 10-0-53-1, జడేజా 8-0-67-0, జాదవ్ 3-0-27-1.

భారత్:

రోహిత్ ఎల్బీ (బి) ఆమిర్ 0, ధవన్ (సి) సర్ఫరాజ్ (బి) ఆమిర్ 21, కోహ్లీ (సి) షాదాబ్ (బి) ఆమిర్ 5, యువరాజ్ ఎల్బీ (బి) షాదాబ్ 22, ధోనీ (సి) వసీమ్ (బి) హసన్ అలీ 4, జాదవ్ (సి) సర్ఫరాజ్ (బి) షాదాబ్ 9, హార్దిక్ రనౌట్ 76, జడేజా (సి) ఆజమ్ (బి) జునైద్ 15, అశ్విన్ (సి) సర్ఫరాజ్ (బి) హసన్ 1, భువనేశ్వర్ నాటౌట్ 1, బుమ్రా (సి) సర్ఫరాజ్ (బి) హసన్ 1, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 30.3 ఓవర్లలో 158 ఆలౌట్.వికెట్లపతనం: 1-0, 2-6, 3-33, 4-54, 5-54, 6-72, 7-152, 8-156, 9-156, 10-158.బౌలింగ్: ఆమిర్ 6-2-16-3, జునైద్ 6-1-20-1, హఫీజ్ 1-0-13-0, హసన్ అలీ 6.3-1-19-3, షాదాబ్ 7-0-60-0, వసీమ్ 0.3-0-3-0, జమాన్ 3.3-0-25-0.

788

More News

VIRAL NEWS