శ్రీకాంత్‌, సింధు ముందడుగు


Thu,July 18, 2019 03:46 AM

-ప్రణయ్‌, ప్రణీత్‌ ఓటమి.. ఇండోనేషియా ఓపెన్‌
P.-V.-Sindhu
జకర్తా: భారత స్టార్‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌, పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్‌లో శుభారంభం చేశారు. ఈ టోర్నీలో ఎలాగైనా టైటిల్‌ కొట్టాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన ఈ యువ షట్లర్లు ప్రత్యర్థులపై విజయాలతో ముందంజ వేశారు. బుధవారమిక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21-14, 21-13 తేడాతో జపాన్‌ ఆటగాడు కెంటా నిషిమోటోపై విజయం సాధించగా.... మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ సింధు 11-21, 21-15, 21-15తో అయా వోహోరీ(జపాన్‌)పై గెలిచి ముందడుగేసింది. 58 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్‌ తొలి గేమ్‌ను 21-14తో గెలిచి చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. రెండో రౌండ్‌లో హాంకాంగ్‌కు చెందిన లాంగ్‌ అంగూస్‌తో గురువారం తలపడనున్నాడు.

మరోవైపు తెలుగమ్మాయి పీవీ సింధు మాత్రం తొలి గేమ్‌ను 11-21 భారీ తేడాతో కోల్పోయి టెన్షన్‌ పెంచింది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని రెండు గేమ్‌లను 21-15 తేడాతో చేజిక్కించుకుంది. రెండో రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్‌తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రణయ్‌, సాయిప్రణీత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హాంకాంగ్‌ క్రీడాకారుడు వాంగ్‌ వింగ్‌ కీ విన్సెంట్‌ చేతిలో 15-21, 21-13, 10-21 తేడాతో ప్రణీత్‌ పరాజయం పాలవగా... 71 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ప్రణయ్‌ 21-19, 18-21, 20-22 తేడాతో చైనాకు చెందిన రెండో సీడ్‌ షీ యూ కీతో చివరి వరకు పోరాడి ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో సాత్విక్‌ రాంకీరెడ్డి, అశ్వినీ పొన్నప్ప జోడీ 13-21, 11-21 తేడాతో ఇండోనేషియా ద్వయం విన్నీ ఒక్టావినా కండో, టోన్‌టోవీ అహ్మద్‌ చేతిలో ఖంగుతిన్నది.

284

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles