ఓడి గెలిచారు..!


Thu,July 11, 2019 03:35 AM

-సెమీఫైనల్లో కివీస్ చేతిలో పోరాడి ఓడినటీమ్‌ఇండియా
-మెరిసిన హెన్రీ, బౌల్ట్, శాంట్నర్.. జడేజా అద్భుత పోరాటం వృథా
-స్వదేశంలో ప్రపంచకప్ వరకు నిరీక్షణే
-ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమణ

టీమ్‌ఇండియా నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్ చేరాలంటే ఒక దశలో 117 బంతుల్లో 148 పరుగులు చేయాలి. అప్పటికే రోహిత్, రాహుల్, కోహ్లీ, కార్తీక్, పంత్, పాండ్యా అంతా పెవిలియన్ చేరారు. ఇక మిగిలిన స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే.. మరోఎండ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ఇంకేముంది కివీస్ గెలుపు లాంఛనమే అని అంతా భావించారు. కానీ.. జడేజా పోరాటంతో అసాధ్యంలా కనిపించిన లక్ష్యం.. 6 ఓవర్లలో 62కు చేరింది. టీ20ల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో4 ఓవర్లలోనే ముగించే లక్ష్యంలా కనిపించడంతో ఇదేమంత పెద్ద కష్టం కాదనిపించింది. అందునా క్రీజులో జోరుమీదున్న జడ్డూతో పాటు ప్రపంచ మేటి ఫినిషర్ ధోనీ ఉన్నాడు. అందుకు తగ్గట్లే తర్వాతి రెండు ఓవర్లలో టీమ్‌ఇండియా పదేసి పరుగులు పిండుకుంది. ఇక టార్గెట్ 4 ఓవర్లలో 42. హెన్రీ 47వ ఓవర్లో 5 పరుగులే ఇస్తే.. తదుపరి ఓవర్‌లో 6 పరుగులే ఇచ్చిన బౌల్ట్.. జడేజా వికెట్ పడగొట్టాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 31కి చేరింది. ఎన్నో మ్యాచ్‌ల్లో ఇలాంటి స్థితి నుంచి జట్టును గెలిపించిన మాస్టర్‌మైండ్ మహీ క్రీజులో ఉండటంతో అభిమానుల్లో ఒక రకమైన భరోసా. దాన్ని నిజం చేస్తూ అదిరిపోయే సిక్సర్‌తో ఆశలు రేపిన ధోనీ.. గప్టిల్ వేసిన అద్భుత త్రోకు రనౌటయ్యాడు. దీంతో మైదానంలో ప్రత్యక్షంగా చూస్తున్న వేలాదిమందితో పాటు టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది అభిమానుల గుండెలు ఆవేదనతో బరువెక్కాయి.
Virat-Kohli
మాంచెస్టర్: వరుసగా రెండోసారి సెమీఫైనల్ గండాన్ని దాటలేకపోయిన టీమ్‌ఇండియా ప్రపంచకప్‌లో తన ప్రస్థానం ముగించింది. మూడోసారి కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన విరాట్ సేన రెండడుగుల ముందే బోల్తా కొట్టింది. వరుణుడి ప్రభావంతో 28 గంటల 24 నిమిషాలు జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో భారత్‌పై నెగ్గి వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. మొదట న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. టేలర్ (90 బంతుల్లో 74; 3 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (95 బంతుల్లో 67; 5 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా.. రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అసమాన పోరాటానికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (72 బంతుల్లో 50; 1 ఫోర్, 1 సిక్స్) అండ తోడవడంతో ఒక దశలో ఆశలు చిగురించినా.. కీలక దశలో వీరిద్దరు వెనుదిరగడంతో పరాజయం తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హెన్రీ (3/37), బౌల్ట్ (2/42), శాంట్నర్ (2/34) రాణించారు. ఓడినా చివరి వరకు పోరాడిన కోహ్లీ కప్పు కలనాలుగేండ్ల(2023) తర్వాత స్వదేశంలో జరిగే ప్రపంచకప్ వరకు కొనసాగాల్సిందే.

MS-Dhoni
సెమీఫైనల్లో కివీస్ చేతిలో భారత్ ఓటమి ప్రపంచకప్ నుంచి నిష్క్రమణప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో భారత్ ప్రస్థానం ముగిసింది. కోట్ల మంది అభిమానుల ఆశలను మోసుకుంటూ బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టిన టీమ్‌ఇండియా అంచనాలు అందుకోలేకపోయింది. కప్ గెలువాలంటే న్యూజిలాండ్‌పై కచ్చితంగా గెలిచి తీరాల్సిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీసేన పోరాడి ఓడింది. ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొంటూ పరాక్రమం చూపించిన భారత్‌జట్టు.. గెలుపు వాకిట బోల్తా కొట్టింది. లక్ష్యఛేదనలో జడేజా, ధోనీ అర్ధసెంచరీలతో చెలరేగినా.. ఆఖర్లో కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నాకౌటైంది. బుధవారం కివీస్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడి మెగాటోర్నీ నుంచి నిష్క్రమించింది. మొత్తంగా టోర్నీ ఆసాంతం చాంపియన్ ఆటతీరు కనబరిచిన టీమ్‌ఇండియా అద్భుత పోరాటపటిమతో అభిమానుల మనసు గెలుచుకుంది.

henry

కుప్పకూలిన టాపార్డర్

పేస్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై.. పిచ్ పరీక్ష పెడుతున్న తరుణంలో టీమ్‌ఇండియా టాపార్డర్ తడబడింది. స్కోరుబోర్డుపై 5 పరుగులు చేరాయో లేదో రోహిత్ (1), కోహ్లీ (1), రాహుల్ (1) పెవిలియన్‌కు వరుస కట్టారు. కొత్త బంతితో కివీస్ పేసర్లు నిప్పులు చెరగడంతో.. మెగాటోర్నీ మొత్తం అలరించిన ఈ త్రయం కీలక మ్యాచ్‌లో తడబడటంతో లక్ష్యఛేదనలో భారత్ ఆపసోపాలు పడింది. కాసేపటికే కార్తీక్ (25 బంతుల్లో 6) కూడా వెనుదిరిగాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 24/4తో నిలిచింది. ఐదు శతకాలతో జోరుమీదున్న రోహిత్ శర్మ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇప్పటికి ఉన్న కష్టాలు చాలవన్నట్లు రాహుల్ వాళ్ల వెంట నడిచాడు. ఖాతా తెరిచేందుకు 20 బంతులు తీసుకున్న కార్తీక్.. నీషమ్ పట్టిన కండ్లు చెదిరే క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. 12 ఓవర్లకు పైగా పోరాడిన పంత్ (56 బంతుల్లో 32; 4 ఫోర్లు), పాండ్యా (62 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఐదో వికెట్‌కు 47 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. మరీ ఎక్కువ బంతులు వృథాచేశారు. 21 నుంచి 33వ ఓవర్ వరకు 13 ఓవర్ల పాటు భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండ్రీ కూడా నమోదు కాలేదు. పాండ్యా పెవిలియన్ చేరే సమయానికి భారత్ లక్ష్యం 117 బంతుల్లో 148 పరుగులు.

మరో 28 పరుగులు జోడించి..

అంతకుముందు వర్షం కారణంగా మంగళవారం ఆట ఎక్కడైతే (46.1 ఓవర్లలో)నిలిచిందో.. అక్కడి నుంచి బుధవారం తిరిగి ప్రారంభమైంది. ఓవర్‌నైట్ స్కోర్ 211/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. టేలర్ (90 బంతుల్లో 74; 3 ఫోర్లు, 1సిక్స్), లాథమ్ (10) ఔటైనా.. ఆఖర్లో శాంట్నర్ (9) కొన్ని విలువైన పరుగులు జోడించాడు.

-24/4 ప్రపంచకప్‌లో తొలి పవర్‌ప్లే ముగిసే సరికి ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోరు. ఈ చెత్త రికార్డు భారత్ పేరిట లిఖించుకుంది.

టాప్ త్రీ.. ఓన్లీ 3

1, 1, 1 ఇదేదో స్టేట్ ర్యాంకుల అడ్వైర్టెజ్‌మెంట్ కాదు.. టీమిండియా టాప్ త్రీ బ్యాట్స్‌మెన్ చేసిన స్కోర్లు. ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తూ.. అలవోకగా జట్టును సెమీఫైనల్‌కు చేర్చిన టాపార్డర్ కీలకమైన సెమీఫైనల్లో చేతులెత్తేసింది. రోహిత్ శర్మ (647), విరాట్ కోహ్లీ (441), లోకేశ్ రాహుల్ (359) ఈ మ్యాచ్‌కు ముందు మన ముగ్గురు మొనగాళ్లు చేసిన మొత్తం పరుగులు 1447 కానీ ఈ మ్యాచ్‌లో ఈ త్రయం చేసింది 3 పరుగులే. ఇదే ఫలితంపై ప్రభావం చూపింది.

కోహ్లీ మాట నిజమైంది

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కోహ్లీ మాట్లాడుతూ పరుగుల వరద పారుతుందని అంతా భావిస్తున్నా.. మెరుగైన బౌలింగ్ వనరులు ఉంటే 260, 270 స్కోర్లను కూడా కాపాడుకోవచ్చు అన్నాడు. అతడి నోటి మాటే నిజమైంది. నాణ్యమైన పేస్ వనరులున్న న్యూజిలాండ్ అంతకన్నా తక్కువ స్కోరును కాపాడుకొని వరుసగా రెండోసారి విశ్వసమరం తుదిపోరుకు చేరింది.

అచ్చం అలానే..

నాలుగేండ్ల క్రితం జరిగిన 2015 ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ భారత్ ఛేజింగ్ చేయలేక చిత్తైంది. సిడ్నీలో జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటిం గ్ చేసి 328/7 చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్, ధవన్ రాణించినా.. కోహ్లీ, సురేశ్ రైనా సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో భారత్ 95 పరుగులతో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‌లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటైన విరాట్ ఈసారి కూడా అదే స్కోరు కు పెవిలియన్ చేరగా, అప్పుడూ ఇప్పుడూ ధోనీ అర్ధసెంచరీ సాధించాడు.

Ravindra-Jadeja

జడ్డూ జాదూ

అప్పటి వరకు జిడ్డుగా సాగిన భారత ఇన్నింగ్స్‌లో జడ్డూ కదలిక తెచ్చాడు. నీషమ్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన జడేజా 33వ ఓవర్‌లో భారత్ స్కోరును 100 దాటించాడు. ఓ వైపు ధోనీ అండగా నిలబడితే.. మరో ఎండ్‌లో జడేజా దుమ్మురేపాడు. బౌలింగ్‌లో 10 ఓవర్లు వేసి 34 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసిన ఈ ఆల్‌రౌండర్ బ్యాట్‌తోనూఅదరగొట్టాడు. ఆరంభంలో భయపెట్టిన శాంట్నర్‌కు 2 సిక్సులు రుచి చూయించాడు. ఈ క్రమంలో చూస్తుండగానే.. అర్ధశతకం (39 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. టీమ్‌ఇండియా 92/6తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో జతైన ధోనీ, జడేజా ఏడో వికెట్‌కు 116 పరుగులు జోడించడంతో భారత్ గెలుపు లాంఛనమే అనిపించింది.

కానీ 14 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన సందర్భంలో భారీ షాట్‌కు యత్నించిన జడేజా ఔట్ కావడంతో భారత్‌కు భారీ దెబ్బ పడింది. విరాట్ సేన విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు చేయాలి.. ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్ తొలి బంతికి ధోనీ సిక్సర్ బాదాడు. ఇంకే ముంది 11 బంతుల్లో 25 పరుగులే.. మహీ సాధిస్తాడు. గెలుపు మనదే అని సగటు అభిమాని ఆశ. కానీ గప్టిల్ మన పాలిట కాలయముడయ్యాడు. రెండో బంతికి పరుగులేమి చేయని ధోనీ మూడో బంతిని స్కైర్ లెగ్ వైపు పంపి రెండో రన్ పూర్తి చేయాలనుకున్నాడు. మొదటి పరుగు ముగించి తిరిగి క్రీజుకు చేరే క్రమంలో గప్టిల్ విసిరిన డైరెక్ట్ త్రో భారత్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. న్యూజిలాండ్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో 18 పరుగులిచ్చిన భారత్ చివరకు అన్నే పరుగుల తేడాతో ఓడడం కొసమెరుపు.

-ఫలితం నిరాశ పరిచినా.. టీమ్ ఇండియా పోరాటపటిమ ఆకట్టుకుంది. మొత్తం టోర్నమెంట్‌లో మనవాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చడం గర్వంగా ఉంది. జీవితంలో గెలుపోటములు భాగమే. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయండి.
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

-ఆసాంతం మంచి ప్రదర్శనే చేసినా.. 45 నిమిషాల చెత్త ఆటతీరు ప్రపంచకప్ నుంచి దూరం చేసింది. పరాజయాన్ని జీర్ణించుకోవడం కష్టమే. ఈ విజయం కివీస్ బౌలర్లకే చెందుతుంది. జడేజా చక్కటి పోరాటం చేశాడు. ధోనీ రనౌట్ కావడం ఫలితంపై ప్రభావం చూపింది. మొత్తం టోర్నమెంట్‌లో మా ఆట బాగుందనే భావిస్తున్నాం.
- విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్

-కొత్త బంతితో మా బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ధోనీ, జడేజా మరి కాసేపు క్రీజులో ఉంటే మా నుంచి మ్యాచ్ లాక్కెళ్తారని అనుకున్నాం. కానీ ధోనీ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది
- విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్

-హార్దిక్, దినేశ్ కంటే ముందు బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనీని పంపితే బాగుండేది. 2011 ప్రపంచకప్ ఫైనలో యువరాజ్‌సింగ్ కంటే నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హీ..గెలుపు లాంఛనాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు
- వీవీఎస్ లక్ష్మణ్

-కివీస్‌తో సెమీస్ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌లో ముందుకు రావాల్సిన అవసరం ఉండింది. క్లిష్ట పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో అనుభవజ్ఞడైన ధోనీకి బాగా తెలుసు. ధోనీ బ్యాటింగ్‌లో ముందు వచ్చి ఉంటే వికెట్లు పడిపోకుండా నియంత్రించే వాడు. అలాంటి సీనియర్‌ను ఏడో స్థానంలో దింపడం సరికాదు
-సౌరభ్ గంగూలీ

స్కోరు బోర్డు

న్యూజిలాండ్: గప్టిల్ (సి) కోహ్లీ (బి) బుమ్రా 1, నికోల్స్ (బి) జడేజా 28, విలియమ్సన్ (సి) జడేజా (బి) చహల్ 67, టేలర్ (రనౌట్/జడేజా) 74, నీషమ్ (సి) కార్తీక్, పాండ్యా 12, గ్రాండ్‌హోమ్ (సి) ధోనీ (బి) భువనేశ్వర్ 16, లాథమ్ (సి) జడేజా (బి) భువనేశ్వర్ 10, శాంట్నర్ (నాటౌట్) 9, హెన్రీ (సి) కోహ్లీ (బి) భువనేశ్వర్ 1, బౌల్ట్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 18, మొత్తం: 50 ఓవర్లలో 239/8. వికెట్ల పతనం: 1-1, 2-69, 3-134, 4-162, 5-200, 6-225, 7-225, 8-232, బౌలింగ్: భువనేశ్వర్ 10-1-43-3, బుమ్రా 10-1-39-1, పాండ్యా 10-0-55-1, జడేజా 10-0-34-1, చాహల్ 10-0-63-1.

భారత్: రాహుల్ (సి) లాథమ్ (బి) హెన్రీ 1, రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 1, కోహ్లీ (ఎల్బీ) బౌల్ట్ 1, పంత్ (సి) గ్రాండ్‌హోమ్ (బి) శాంట్నర్ 32, కార్తీక్ (సి) నీషమ్ (బి) హెన్రీ 6, పాండ్యా (సి) విలియమ్సన్ (బి) శాంట్నర్ 32, ధోనీ (రనౌట్/గప్టిల్) 50, జడేజా (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 77, భువనేశ్వర్ (బి) ఫెర్గూసన్ 0, చాహల్ (సి) లాథమ్ (బి) నీషమ్ 5, బుమ్రా (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 49.3 ఓవర్లలో 221 ఆలౌట్. వికెట్ల పతనం: 1-4, 2-5, 3-5, 4-24, 5-71, 6-92, 7-208, 8-216, 9-217, 10-221, బౌలింగ్: బౌల్ట్ 10-2-42-2, హెన్రీ 10-1-37-3, ఫెర్గూసన్ 10-0-43-1, గ్రాండ్‌హోమ్ 2-0-13-0, నీషమ్ 7.3-0-49-1, శాంట్నర్ 10-2-34-2.

runs-wickets

917

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles