ఎవరి బలం ఎంత?


Thu,December 5, 2019 12:42 AM

-ఉప్పల్‌లో చెమటోడ్చిన భారత్, వెస్టిండీస్
-విరాట్ వికెట్ కీలకమంటున్న విండీస్ కోచ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగే తొలి టీ20 కోసం భారత్, వెస్టిండీస్ ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. వెస్టిండీస్ జట్టు మంగళవారమే ఉప్పల్‌లో ప్రాక్టీస్ చేస్తే.. కోహ్లీ సేన బుధవారం కసరత్తులు ప్రారంభించింది. విధ్వంసక ఆటగాళ్ల గైర్హాజరీలో విండీస్ కాస్త డీలాపడ్డట్లు కనిపిస్తున్నా.. అండర్ డాగ్స్‌గా బరిలో దిగుతున్నాం. మాపై అంచనాలు లేకపోవడం మంచిదే. ఎలాంటి ఫలితమైనా రావొచ్చుఅని కరీబియన్ కెప్టెన్ పొలార్డ్ అంటున్నాడు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ఈ మ్యాచ్ నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. రెండేండ్ల క్రితం ఉప్పల్‌లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ రైద్దెన నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలపై ఓ కన్నేస్తే..!
Team-India1

టీమ్‌ఇండియా బలాలు

ఇటీవలి కాలంలో భారత బౌలింగ్ మెరుగుపడ్డా.. పొట్టి ఫార్మాట్‌లో విరాట్ సేన ప్రధానాయుధం బ్యాటింగే. టాపార్డర్ రాణిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. శిఖర్ ధవన్ గాయంతో జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో లోకేశ్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ గురించి కొత్తగా చెప్పేదేముంది. మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే తమదైన ముద్ర వేసేందుకు తహతహలాడుతుంటే.. సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కితే చేలరేగిపోవాలని చూస్తున్నాడు. గత సిరీస్‌లో అరంగేట్రం చేసిన హార్డ్ హిట్టర్ శివం దూబే ఈసారైనా మెరుపులు మెరిపించాలని భావిస్తున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో చాలాకాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌లో మహమ్మద్ షమీ ఆడనున్నాడు.

బలహీనతలు

పేపర్‌పైన బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్నా.. సీనియర్లు విఫలమైతే మిడిలార్డర్‌లో జట్టును ముందుకు నడిపించే ఆటగాళ్లు కరువయ్యారు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న అయ్యర్ నాలుగో స్థానాన్ని తన పేరిట రాసుకోవాలని చూస్తుంటే.. ఒక్క చాన్స్ అంటూ సంజూ శాంసన్ వేచి ఉన్నాడు. రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగిస్తుంటే.. శివం దూబేకు పెద్దగా అనుభవం లేదు. జడేజాకు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో తెలియదు. ఇక కృనాల్ పాండ్యా స్థానంలో చోటు దక్కించుకున్న చైనామన్ కుల్దీప్ యాదవ్ తన జాదూ కనబర్చగలడా అనేది సందేహమే.

వెస్టిండీస్ బలాలు

ఈ ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్ అయిన వెస్టిండీస్ జట్టుపై ఓ అంచనాకు రావడం కష్టమే. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని విండీస్ ఇటీవల తమకంటే ఎంతో బలహీనమైన ఆఫ్ఘన్ జట్టు చేతిలో సిరీస్ కోల్పోయింది. పెద్ద జట్లను సైతం అలవోకగా ఓడించేలా కనిపించే కరీబియన్లు.. మరుక్షణంలోనే చేతులెత్తేసి చిన్నజట్ల చేతిలోనూ చతికిలపడటం పరిపాటి. అయితే అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలో దిగనుండటం కలసొస్తుందని ఆ జట్టు కెప్టెన్ పొలార్డ్ అంటున్నాడు. హెట్‌మైర్, లూయిస్, సిమన్స్, పూరన్, రామ్‌దిన్, రూథర్‌ఫోర్డ్, పొలార్డ్, హోల్డర్ రూపంలో ఆ జట్టులో విధ్వంసకారులకు కొదవలేదు. బౌలింగ్‌లో కాట్రెల్, కీమో పాల్, కాస్రిక్, హోల్డర్ కీలకం కానున్నారు. ఆల్ రౌండర్లకు కొదవలేని విండీస్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే.
West-Indies

బలహీనతలు

విండీస్ ప్రధాన బలహీనత అనిశ్చితి. ఎప్పుడెలా ఆడుతారో వారికే తెలియదు. లీగ్‌ల కారణంగా హీరోలుగా మారిన కరీబియన్లు.. జట్టుగా ఆడితే వారిని ఓడించడం కష్టమే. అయితే ఎవరికి వారే యమునా తీరే చందంగా దూసుకుపోయే వారిని ఏకతాటిపైకి తీసుకురావడమే అసలు సమస్య. పొట్టి ఫార్మాట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న పొలార్డ్‌కు నాయకత్వం కొత్త. టీమ్‌ఇండియా లాంటి బలమైన జట్టుతో మ్యాచ్‌లో అతడు విండీస్‌ను ఎలా నడిపిస్తాడనేది చూడాలి. ఇక స్పిన్ విషయంలోనూ భారత్‌తో కరీబియన్లకు ఏమాత్రం పోలిక లేదు.

ఇరు జట్లు బిజీబిజీ..

మూడు రోజుల ముందుగానే నగరానికి చేరుకున్న విండీస్ బుధవారం ఉదయం పూట ఉప్పల్‌లో ప్రాక్టీస్ చేసింది. మధ్యాహ్నం టీమ్‌ఇండియా కసరత్తులు కొనసాగించింది. భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు నెట్స్‌లో కరీబియన్లు చెమటోడ్చారు. నలుగురు లెగ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేశారు. మరోవైపు టీమ్‌ఇండియా వామప్‌తో మొదలెట్టి ఆ తర్వాత క్యాచ్‌లు, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసింది. అయితే గత కొంతకాలంగా ఫిట్‌నెస్‌పై ప్రధానంగా దృష్టిపెట్టిన టీమ్‌ఇండియా బుధవారం కొత్త విధానంతో అబ్బురపరిచింది. ఆటగాళ్లను రెండు వరుసలుగా విభజించి ముందున్న వరుస ప్లేయర్లకు రుమాళ్లు ఇచ్చి రెండో వరుస వాళ్లు వాటిని అందుకునే విధంగా ప్రాక్టీస్ చేసింది. జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ పర్యవేక్షణలో మనవాళ్లు దీన్ని కొనసాగించారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. వెంటాడేటప్పుడు ఓ వ్యక్తి వేగం అతడికి తెలియకుండానే పెరిగిపోతుంది. అందుకే ఈ పద్ధతిని అమలు చేస్తున్నాంఅని వెబ్ అన్నాడు.

కోహ్లీ వికెటే ముఖ్యం

simmons
టీమ్‌ఇండియాను ఓడించాలంటే ముం దు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టాలని వెస్టిండీస్ కోచ్ సిమన్స్ పేర్కొన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలర్లు అతి జాగ్రత్తకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఎలాంటి జంకు లేకుండా బంతులు సంధించాలని అతడు సూచించాడు. విరాట్ వికెట్ పడగొట్టడం చాలా ముఖ్యం. అయితే అదంత సులభం కాదు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలర్లు మరీ భయపడిపోవాల్సిన అవసరం లేదు. అతడిని పెవిలియన్ పంపేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలున్నాయి. వాటిని అమలు చేస్తే చాలుఅని సిమన్స్ పేర్కొన్నాడు.

వెస్టిండీస్ బ్యాటింగ్ కోచ్‌గా మాంటీ

deshay
టీమ్‌ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు వెస్టిండీస్ జట్టు మాంటీ దేశాయ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్‌తో పాటు ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, కెనడా జట్లకు కోచ్‌గా పనిచేసిన దేశాయ్.. రెండేండ్ల పాటు విండీస్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అతడు గురువారం జట్టుతో చేరుతాడని విండీస్ క్రికెట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసేందుకు నేను జట్టులోకి వచ్చానని అనుకోవడం లేదు. టీమ్‌ఇండియా తరఫున దక్కిన చాన్స్‌కు పూర్తి న్యాయం చేయాలనుకుంటున్నా. కెప్టెన్ కోహ్లీకి నాపై నమ్మకముంది. అలాగే టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఆల్‌రౌండర్లకు ఫిట్‌నెస్ కాపాడుకోవడం కఠిన పరీక్ష. బంతితో బ్యాట్‌తో రాణించాల్సిన అవసరం ఉంటుంది. పొట్టి ఫార్మాట్‌లో నా బౌలింగ్‌పై నమ్మకముంది. టీ20ల్లో విండీస్ ప్రమాదకర జట్టు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించే సత్తా టీమ్‌ఇండియాకు ఉంది.
- శివం దూబే, టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్

347

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles