రిషబ్ వచ్చేశాడు..


Fri,October 12, 2018 12:19 AM

షమీకి పిలుపు.. కార్తీక్‌కు ఉద్వాసన
విండీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత్ జట్టు

rishabh
హైదరాబాద్: వెస్టిండీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత్ జట్టును ప్రకటించారు. గురువారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ 14 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. ఎట్టకేలకు సిక్సర్ల పిడుగు రిషబ్ పంత్‌కు వన్డేల్లో అవకాశం కల్పించారు. ధోనీ వారసుడిగా, భవిష్యత్ టీమ్‌ఇండియా కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌గా అతన్ని పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమవుతున్నది. మహీ స్థానంలో వస్తాడని భావించినా.. చివరి నిమిషంలో దినేశ్ కార్తీన్‌ను తప్పించి రిషబ్‌కు అవకాశమిచ్చారు. దీంతో 2019 వన్డే ప్రపంచకప్ వరకు ధోనీ స్థానం పదిలమే అని సెలెక్షన్ కమిటీ సంకేతాలిచ్చింది. రిషబ్‌ను కేవలం బ్యాట్స్‌మన్‌గానే ఎంపిక చేశామని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ కూడా స్పష్టం చేశాడు. మిడిలార్డర్ బలోపేతం కోసం రిషబ్‌కు అవకాశం ఇచ్చాం. వరల్డ్‌కప్ వరకు కీపర్‌గా ధోనీనే మా మొదటి అవకాశం. ఒకవేళ పరిస్థితులు డిమాండ్ చేస్తే రిషబ్ బ్యాకప్ కీపర్‌గా ఉంటాడు. రిషబ్ భవిష్యత్ పెట్టుబడి. కార్తీక్‌కు కొన్ని అవకాశాలిచ్చాం. ఇప్పుడు రిషబ్‌కు అవకాశాలు ఇస్తున్నాం. సరైన సమయంలో ఎవరు ఉత్తమమో తేలుస్తాం అని ప్రసాద్ పేర్కొన్నాడు.

దాదాపు ఏడాది కాలంగా వన్డేలకు దూరంగా ఉన్న షమీని మళ్లీ జట్టులోకి తీసుకుని సెలెక్టర్లు ఆశ్చర్యాన్ని కలిగించారు. వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌కు మధ్య భారత్ కేవలం 18 వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో బలమైన మూడో పేసర్ ఎవరనేది తేల్చేందుకు షమీకి అవకాశమిచ్చామని ప్రసాద్ వెల్లడించాడు. ఆసియా కప్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. సీమర్లు బుమ్రా, భువనేశ్వర్ సిరీస్ మధ్యలో టీమ్‌ఇండియాతో కలుస్తారు. మిడిలార్డర్‌లో రెండు స్థానాల కోసం కొత్త ప్రత్యామ్నాయాలను పరిశీలించనున్నారు. ధోనీ.. విజయ్ హజారేలో జార్ఖండ్ తరఫున ఆడుతాడని ప్రసాద్ తెలిపాడు. అంబటి రాయుడు ఆడేది లేనిది తేలాల్సి ఉంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా జట్టుకు అందుబాటులో లేడు. అతను నవంబర్ రెండో వారం వరకు కోలుకుంటాడని ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే హార్దిక్ టెస్ట్ క్రికెట్ ఆడే విషయం అతని గాయం, పనిభారంపై ఆధారపడి ఉంటుందన్నాడు. తొడ గాయం నుంచి కోలుకుంటున్న కేదార్ జాదవ్ మూడో వన్డే నుంచి అందుబాటులో ఉంటాడని చెప్పాడు.

458

More News

VIRAL NEWS