ధోనీ స్థానంలో రిషబ్!


Thu,October 11, 2018 01:05 AM

-కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి
-వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక నేడు

Rishabh-Pant
హైదరాబాద్: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ పర్యటనలను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో పాటు జూనియర్లకు అవకాశం కల్పించేందుకు సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తున్నది. రెండో టెస్ట్‌కు వేదికైన హైదరాబాద్‌లో గురువారం విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక జరుగనుంది. అయితే వన్డే, టీ20 సిరీస్ మొత్తానికి జట్టును ప్రకటిస్తారా లేక మొదటి మూడు వన్డేలకు మాత్రమే పరిమితమవుతారా అన్నది తెలియాల్సి ఉన్నది. వికెట్‌కీపింగ్‌లో ఇరుగదీస్తూ..బ్యాటింగ్‌లో విఫలమవుతున్న మహేంద్రసింగ్ ధోనీ స్థానంలో యువ వికెట్‌కీపర్ రిషబ్‌పంత్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విరామం లేకుండా అన్నిఫార్మాట్లు ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే సూచనలు ఉన్నాయి. వచ్చే ప్రపంచకప్‌లో ధోనీ కచ్చితంగా ఆడుతాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో యువ రిషబ్‌పంత్‌ను సానబట్టాలి. ఆరు, ఏడు స్థానాల్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో పాటు మ్యాచ్‌లను ముగించే సత్తా అతనికి ఉంది. టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఓవల్‌లో సెంచరీకి తోడు రాజ్‌కోట్‌లో అర్ధసెంచరీతో పంత్ ఆకట్టుకున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ ఇలాగే రాణిస్తే ఈ 20 ఏండ్ల ఢిల్లీ కుర్రాడికి ఢోకా ఉండదు అని సెలెక్షన్ కమిటీ వ్యవహారాలను దగ్గర్నుంచి చూసే సీనియర్ బీసీసీఐ అధికారి మీడియాతో అన్నాడు. సీనియర్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ నిలకడపై సందేహాలు ఉన్నాయి.

కీలక సమయాల్లో జట్టును గెలిపించడంలో అతను ఒకింత తడబడుతాడని అ సదరు అధికారి చెప్పుకొచ్చాడు. ఇటీవలి ఆసియాకప్‌లో తిరిగి గాయపడ్డ కేదార్ జాదవ్ పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరం కావడంతో మిడిలార్డర్‌లో మళ్లీ ఖాళీ ఏర్పడింది. కోహ్లీ గైర్హాజరీలో జట్టులోకొచ్చిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తనకు దక్కిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఒకవేళ కోహ్లీ..విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడినా..రాయుడును తుదిజట్టుకు ఎంపిక చేసే చాన్స్ కనిపిస్తున్నది. విరామం తర్వాత పరిమిత ఓవర్ల స్పెషలిస్టులు భువనేశ్వర్, బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నారు. ఇటీవలే మళ్లీ జట్టుకు ఎంపికైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా..అక్షర్ పటేల్‌కు పోటీగా మారగా...ఆసియాకప్‌లో విఫలమైన మనీశ్‌పాండేపై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు జట్టును ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

991

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles