మొహాలీలో మోతేనా!


Wed,September 18, 2019 01:50 AM

south-africa

- భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య నేడు రెండో టీ20
హోమ్‌సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభిద్దామనుకున్న టీమ్‌ఇండియాకు వరుణుడు ఝలక్‌ ఇచ్చాడు. మొదటి మ్యాచ్‌ను తుడిచిపెట్టేశాడు. కొత్త కుర్రాళ్లతో నిండిన ఇరు జట్లు మొహాలీ వేదికగా రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యాయి. ఈ పోరుకు వర్షం ముప్పులేదనేది సంతోషించాల్సిన విషయమైతే.. ఈ గ్రౌండ్‌లో మనవాళ్లకు మంచి రికార్డు ఉండటం ఆ ఆనందాన్ని రెట్టింపు చేసే అంశం. రెండు జట్లలోనూ హిట్టర్లకు కొదువలేకపోవడంతో భారీస్కోర్లు నమోదయ్యే చాన్స్‌లు ఉన్నాయి. అయితే సొంతగడ్డపై భీకర లైనప్‌తో బరిలో దిగుతున్న టీమ్‌ఇండియాకు.. పునర్నిర్మాణ దశలో ఉన్న సఫారీ జట్టు ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి.

మొహాలీ: వన్డే వరల్డ్‌కప్‌ ముగిసింది. ఇక అందరి దృష్టి వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న పొట్టి ప్రపంచకప్‌పైనే. మరి ఆ లోపు జట్టును పరీక్షించుకోవాలన్నా.. కూర్పును సరిచూసుకోవాలన్నా.. అన్ని జట్లకు ఉన్నది తక్కువ సమయమే. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకే.. భారత్‌, దక్షిణాఫ్రికా బుధవారం మొహాలీ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. ధర్మశాలలో జరగాల్సిన తొలి టీ20కి వర్షం ఆటంకం కలిగించడంతో.. ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ రైద్దెంది. ఇక రెండో మ్యాచ్‌లోనైనా.. తమ కుర్రాళ్ల సత్తాను పరీక్షించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇటీవల కరీబియన్‌ టూర్‌లో ఓటమి ఎరుగకుండా విజృంభించిన టీమ్‌ఇండియాకు బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు లేకున్నా.. బౌలింగ్‌లో పూర్తిగా కొత్త కుర్రాళ్లపైనే భారం వేసింది. చాలాకాలం తర్వాత హార్దిక్‌ పాండ్యా జట్టులోకి రావడంతో అతడి హిట్టింగ్‌ చూడాలని అభిమానులు ముచ్చట పడుతుంటే.. రిషభ్‌ పంత్‌ మాత్రం అంచనాల భారాన్ని మోయలేక వరుసగా విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు సత్తాచాటకపోతే.. అతడి స్థానానికి ఎసరొచ్చే ప్రమాదం పొంచి ఉంది. అటు దక్షిణాఫ్రికా పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. డికాక్‌, మిల్లర్‌, రబడ, ఫెలుక్వాయో మినహా మిగిలిన వారంతా దాదాపు కొత్తవారే. దీంతో ఈ మ్యాచ్‌ను ఇరు జట్ల యువ సత్తాకు పరీక్షగా భావించొచ్చు.

అయ్యర్‌కు అవకాశమొచ్చేనా..

ఐపీఎల్‌లో అదరగొట్టే హార్దిక్‌ పాండ్యాకు టీమ్‌ఇండియా తరఫున బ్యాటింగ్‌ చేసే అవకాశాలు ఎక్కువగా రావట్లేదనే వాదనను కొట్టిపారేయలేం. ముంబై ఇండియన్స్‌ తరఫున 66 మ్యాచ్‌లాడిన హార్దిక్‌ 61 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగితే.. టీమ్‌ఇండియా తరఫున 38 మ్యాచ్‌ల్లో కేవలం 24 సార్లు మాత్రమే బ్యాటింగ్‌ చాన్స్‌ దక్కించుకున్నాడు. మేటి హిట్టర్‌గా పేరున్న పాండ్యాకు ఇంకా ఎక్కువ బ్యాటింగ్‌ చాన్స్‌ వస్తే అది జట్టుకు ప్రయోజనకరంగా మారుతుంది. అయితే టాప్‌ త్రీలో రోహిత్‌, ధవన్‌, కోహ్లీ రూపంలో ముగ్గురు అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండటంతో అది కష్టంగా మారింది. వచ్చిన కొద్దిపాటి చాన్స్‌లనే మిడిలార్డర్‌ సద్వినియోగ పర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వెస్టిండీస్‌ టూర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనీశ్‌ పాండేకు తుదిజట్టులో అవకాశం దక్కుతుందా.. లేక శ్రేయస్‌ అయ్యర్‌కు చాన్స్‌ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనింగ్‌ స్లాట్‌ కోసం రాహుల్‌, ధవన్‌ మధ్య పోటీ ఉన్నా.. మొహాలీలో మెరుగైన రికార్డు ఉన్న ధవన్‌ వైపే మొగ్గు చూపొచ్చు. కృనాల్‌ పాండ్యా, జడేజాకు చోటు ఖాయమే. మరో స్పిన్నర్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌ మధ్య పోటీ నెలకొంది. అయితే.. ప్రత్యర్థి జట్టులో ముగ్గురు ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌ (డికాక్‌, మిల్లర్‌, ఫెలుక్వాయో) ఉండటంతో సుందర్‌కే చాన్స్‌ ఎక్కువ. భువీ, బుమ్రా గైర్హాజరీలో దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. స్వదేశీ పిచ్‌లపై ముగ్గురు స్పెషలిస్ట్‌ పేసర్లతో ఆడే అవకాశాలు తక్కువే కావడంతో ఖలీల్‌కు నిరీక్షణ తప్పకపోవచ్చు.

డికాక్‌పైనే భారం

మరోవైపు యువకులతో కూడిన దక్షిణాఫ్రికా జట్టుకు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ దేశ క్రికెట్‌ బోర్డు డుప్లెసిస్‌ను పక్కన పెట్టి డికాక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. మరి పొట్టి ఫార్మాట్‌లో డికాక్‌ ఎలాంటి ముద్ర వేస్తాడో చూద్దాం అనుకుంటే.. తొలి మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఈ ఏడాది ఆరంభంలో ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గిన డికాక్‌కు.. భారత పిచ్‌లపై చక్కటి అవగాహనతో పాటు టీమ్‌ఇండియాపై మంచి రికార్డు ఉంది. డికాక్‌ సఫారీ జట్టులో పాతుకుపోయాడంటే అందుకు పరోక్షంగా టీమ్‌ఇండియానే కారణం. తొలిసారి భారతతో వన్డే సిరీస్‌ ఆడిన క్వింటన్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలు బాది జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అప్పటి వరకు తన కెరీర్‌లో ఒకటే శతకం చేసిన డికాక్‌.. హ్యాట్రిక్‌ సెంచరీలతో హీరోగా మారాడు. అయితే సంధి ధశలో ఉన్న సఫారీలను అతడు ఏమేరకు గాడినపెడతాడనేది కీలకం కానుంది. కెప్టెన్‌తో పాటు డేవిడ్‌ మిల్లర్‌, రబాడకు ఇక్కడ పొట్టి ఫార్మాట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. టెస్టు స్పెషలిస్ట్‌లు బవుమా, నోర్జేలు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాగా వేయాలని చూస్తుంటే.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డసెన్‌, ప్రిటోరియస్‌, జూనియర్‌ డాలా తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటాలనుకుంటున్నారు.

‘కెప్టెన్సీ అనేది కెరీర్‌లో ఓ మైలురాయిగా భావిస్తా. నాపై అదనపు బాధ్యత పడింది. ఇది సానుకూల ప్రభావం చూపుతుందా లేక ప్రతికూల ఫలితాన్నిస్తుందా ఇప్పుడే చెప్పలేం. గతంలో ఏబీ డివిలియర్స్‌, డుప్లెసిస్‌లా జట్టును ముందుండి నడిపించాలనుకుంటున్నా. ఇప్పటికే ఓ మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోయింది. ఉన్నది రెండే అవకాశాలు. కొత్త కుర్రాళ్లు సత్తా చాటుకునేందుకు ఇదే సరైన తరుణం. కోహ్లీ, రబాడ మధ్య ఆసక్తికర పోరు ఖాయమే’ అని మంగళవారం డికాక్‌ పేర్కొన్నాడు.
south-africa1

పంత్‌కు పరీక్షే..!

యువకులకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే స్థితి లేదు అని కెప్టెన్‌ కోహ్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికే లెక్కకు మిక్కిలి అవకాశాలు దక్కించుకున్న రిషబ్‌ పంత్‌కు కష్టకాలం వచ్చిందనే చెప్పాలి. తొలి మ్యాచ్‌కు ముందే చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి.. షాట్‌ సెలక్షన్‌ విషయంలో పంత్‌కు క్లాస్‌ పీకాడు. తప్పుడు షాట్ల ఎంపికతో అనవసరంగా వికెట్‌ పారేసుకోవద్దని హితవు పలికాడు. స్కోరు బోర్డు పరిస్థితి అర్థం చేసుకోకుండా.. వచ్చి రావడంతోనే భారీ షాట్లకు యత్నించి.. వాటిని సరిగ్గా నియంత్రించలేక పంత్‌ ఇటీవల చాలాసార్లు ఔటయ్యాడు. ఈ అంశంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సీరియస్‌గా ఉంది. దీంతో ఈ సిరీస్‌ అతడికి చావోరేవోలా మారింది. మాజీ కెప్టెన్‌ ధోనీ ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశాలు లేవని సంకేతాలు అందుతుండటం కూడా పంత్‌పై ఒత్తిడి పెంచుతున్నది. ప్రపంచకప్‌ వరకు రిషబ్‌ నిలదొక్కుకోలేకపోతే.. ధోనీ తిరిగి జట్టులో చేరే అవకాశాలు పుష్కలం. మరోవైపు సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ రూపంలో కొత్త వాళ్లు కూడా ఆ స్థానంపై కన్నేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో పంత్‌ తన బ్యాటింగ్‌ విన్యాసాలు బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేకుంటే వేటు తప్పకపోవచ్చు.

730 మొహాలీ పిచ్‌పై మిల్లర్‌ చేసిన పరుగులు. ఇక్కడ 29 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్‌ 45.62 సగటు, 150.51 స్ట్రయిక్‌రేట్‌తో ఈ రన్స్‌ చేశాడు.

28.83 దక్షిణాఫ్రికాపై టీ20ల్లో కోహ్లీ సగటు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి ఇది రెండో అత్యల్పం. ఐర్లాండ్‌పై విరాట్‌ సగటు కేవలం 4.50 మాత్రమే.


తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, మనీశ్‌/శ్రేయస్‌, పంత్‌, హార్దిక్‌, కృనాల్‌, జడేజా, సుందర్‌/రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, సైనీ.
దక్షిణాఫ్రికా: డికాక్‌ (కెప్టెన్‌), హెండ్రిక్స్‌, డసెన్‌, బవుమా, మిల్లర్‌, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌, లిండే/నోర్జే, రబడ, జూనియార్‌ డాలా, షంసీ

పిచ్‌, వాతావరణం

మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు లేవు. సాధారణ ఉష్ణోగ్రత ఉండనుంది. ఈ పిచ్‌పై చేజింగ్‌ చేసిన జట్టే ఎక్కువ విజయాలు సాధించిన రికార్డు ఉంది. ఈ ఏడాది ఐపీఎల్లో ఇక్కడ 7 మ్యాచ్‌లు జరగ్గా అందులో ఒక ఇన్నింగ్స్‌లో సరాసరి 171 పరుగులు నమోదయ్యాయి.

892

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles