రాహుల్, రిషబ్ పోరాడినా..


Wed,September 12, 2018 12:51 AM

-భారత్‌కు తప్పని పరాజయం ..
-అద్భుత శతకాలు వృథా
-ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఘన విజయం
-సిరీస్ 4-1తో సొంతం

భారత్, ఇంగ్లండ్ సుదీర్ఘ టెస్ట్ సిరీస్ సమరానికి అద్భుత ముగింపు. పోరాడితే పోయేదేమి లేదన్న తరహాలో మనోళ్లు చూపించిన తెగువకు గర్వపడ్డ సందర్భం. సహచరులు విఫలమైన చోట రాహుల్, రిషబ్ చూపించిన పోరాటపటిమకు మది ఉప్పొంగిపోయే సమయం. భారీ లక్ష్యఛేదనలో సగం వికెట్లు కోల్పోయి పరువు అయినా దక్కుతుందా అనుకున్న తరుణంలో ఈ యువ తరంగ్‌లు ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఓవల్‌లో శతకాలతో గర్జించిన వైనం . పేలవ ప్రదర్శనకు ముగింపు పలుకుతూ రాహుల్ ధనాధన్ ఆటతీరుతో చెలరేగితే తానేం తక్కువ కాదన్నట్లు రిషబ్ నాటుకొట్టుడు రూట్‌సేన కూనరిల్లిన క్షణం. లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఆఖర్లో తడబాటుతో అందినట్లే అంది చేజారిన విజయం. క్లుప్తంగా అలవోకగా గెలుద్దామనుకున్న ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించిన కోహ్లీసేన పోరాడి ఓడిన తరుణం.
RishabhPant-KLRahul
లండన్: ఇంగ్లండ్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలుపు కల కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో మనోళ్లు సిరీస్‌లో ఆరంభంలో కనిపించినా..ఆ స్థాయి ప్రదర్శన కనబరుచలేకపోయారు. పేస్ బౌలింగ్‌కు స్వర్గధామమైన ఇంగ్లండ్ పిచ్‌లపై మన బ్యాట్స్‌మెన్ వైఫల్యం కొనసాగిన వేళ సిరీస్ ఓటమి ఎదుర్కొన్న పరిస్థితి. అన్నింటా ఆధిపత్యం ప్రదిర్శించిన ఆతిథ్య జట్టు..టెస్ట్ నంబర్‌వన్ టీమ్‌ఇండియాతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ 118 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 464 పరుగుల లక్ష్యఛేదనలో భారత్..94.3 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(224 బంతుల్లో 149, 20 ఫోర్లు, సిక్స్), రిషబ్ పంత్(146 బంతుల్లో 114, 15ఫోర్లు, 4సిక్స్‌లు) సూపర్ సెంచరీలతో కదంతొక్కారు. 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు ఇంగ్లండ్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు కొల్లగొట్టారు. అండర్సన్(3/45)కు మూడు వికెట్లు దక్కగా, రషీద్(2/63), కర్రాన్(2/23) రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న అలిస్టర్ కుక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా, పరుగుల వరద పారించిన భారత కెప్టెన్ కోహ్లీ, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన స్యామ్ కర్రాన్‌కు సంయుక్తంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సొంతం చేసుకున్నారు.

రాహుల్, రిషబ్ శతక విజృంభణ: ఇంగ్లండ్ నిర్దేశించిన 464 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు(58/3)తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్..94.3 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ ఆదిలో రాహుల్, రహానే(37) సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. వీరిద్దరు ఇంగ్లండ్ పేస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు కొల్లగొట్టారు. ముఖ్యంగా సిరీస్‌లో పేలవ ఆటతీరు కనబరిచిన రాహుల్..దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్ల ఆత్మైస్థెర్యాన్ని కృంగదీస్తూ బ్యాటింగ్ కొనసాగించారు. వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. ఇక గాడిలో పడిందనుకున్న తరుణంలో పరుగు తేడాతో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. అలీ బౌలింగ్‌లో రహానే క్యాచ్ ఔట్‌గా వెనుదిరుగగా, తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి(0)ని స్టోక్స్ బౌన్స్‌తో బోల్తా కొట్టించాడు. దీంతో 121 పరుగులకే టీమ్‌ఇండియా 5 వికెట్లు కోల్పోయింది. రాహుల్‌కు రిషబ్ పంత్ జత కలువడం ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేసింది. మిగిలిని ఐదు వికెట్లు పడగొట్టి ఇన్నింగ్స్‌ను తొందరగా ముగిద్దామనుకున్న రూట్‌సేన ఆశలపై వీరిద్దరు నీళ్లు గుమ్మరించారు.
England
తాను ఎదుర్కొన్న నాలుగో బంతినే పంత్ బౌండరీగా మలిచి ఉద్దేశమేంటో చాటాడు. మరోవైపు రాహుల్ కూడా బ్యాటు ఝులిపించడంతో స్కోరుబోర్డు ఉరకలెత్తింది. స్టోక్స్ వేసిన ఇన్నింగ్స్ 41వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ భారీ సిక్స్‌తో 14 పరుగులు పిండుకుని 118 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. రిషబ్ కూడా రాహుల్ తరహాలో ఆడటంతో లంచ్ విరామం తర్వాత ఇంగ్లండ్‌కు ఇబ్బందులు మరింతగా పెరిగాయి. కెప్టెన్ రూట్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. సెంచరీ తర్వాత కొంత నెమ్మదించిన రాహుల్..రిషబ్‌కు అవకాశమిచ్చాడు. దీన్ని అనుకూలంగా మలుచుకున్న ఈ ఢిల్లీ బాంబర్..ఇంగ్లండ్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఫీల్డింగ్ కట్టుదిట్టం చేసినా బౌండరీలతో పరుగులు సాధించారు. అర్ధసెంచరీ తర్వాత రిషబ్ గేర్ మార్చుతూ దూకుడు కనబరిచాడు. స్టోక్స్‌ను మూడు ఫోర్లతో దునుమాడిన రిషబ్..మరింత ప్రమాదకరంగా మారాడు. మైదానంలో చూడచక్కని షాట్లతో అలరిస్తూ ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. ఈ క్రమంలో నాలుగు రన్‌రేట్ చొప్పున భారత స్కోరు పరుగు అందుకుంది. వీరిద్దరి బ్యాటింగ్ ఊపు చూస్తే రికార్డు లక్ష్యఛేదన సాధ్యమనిపించింది. రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌తో టెస్ట్‌ల్లో రిషబ్ తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. టీ విరామం తర్వాత భారత బ్యాటింగ్ తడబడింది.

రషీద్ డబుల్:

లక్ష్యం వైపు సాఫీగా సాగుతున్న తరుణంలో ఆదిల్ రషీద్..రాహుల్‌ను ఔట్ చేసి ఆరో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యానికి తెరదీశాడు. పిచ్‌పై పగుళ్లను ఆసారాగా చేసుకుంటూ రషీద్ సంధించిన బంతి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. మరో ఓవర్ తేడాతో రషీద్ బౌలింగ్‌లోనే భారీ షాట్ కోసం ప్రయత్నించిన రిషబ్..అలీ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఇక్కణ్నుంచి భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 9 పరుగుల తేడాతో ఇషాంత్(5), జడేజా(13), షమీ(0) వికెట్లు కోల్పోయింది. బుమ్రా నాటౌట్‌గా నిలిచాడు.

1 ఇంగ్లండ్‌పై రాహుల్, రిషబ్ ఆరో వికెట్‌కు నెలకొల్పిన 204 పరుగుల భాగస్వామ్యం నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమం. 1999లో పాకిస్థాన్‌పై సచిన్, నయన్ మోంగియా ఆరో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్య రికార్డు రాహుల్, రిషబ్ ఫీట్‌తో
చెదిరిపోయింది.

4 టెస్ట్‌ల్లో 564 వికెట్లతో జేమ్స్ అండర్సన్ నాలుగో స్థానంలో నిలిచాడు. షమీ వికెట్ తీయడం ద్వారా మెక్‌గ్రాత్(563)ను అధిగమిస్తూ అండర్సన్ ఈ రికార్డు అందుకున్నాడు.

రిషబ్ పంత్ @1

భారత యువ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌కీపర్‌గా పంత్ రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఏడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో మహేంద్రసింగ్ ధోనీ(92) పేరిట ఉన్న రికార్డును ఈ ఢిల్లీ డైనమైట్ అధిగమించాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్‌తో సిక్స్ కొట్టిన పంత్..టెస్ట్‌ల్లో తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. సిక్స్‌తో తొలి సెంచరీ చేసిన కపిల్‌దేవ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్‌సింగ్ సరసన పంత్ నిలిచాడు. మరోవైపు అజయ్ రాత్రా(20 ఏండ్ల 150 రోజులు) తర్వాత టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన రెండో పిన్నవయస్సు భారత వికెట్‌కీపర్‌గా పంత్(20 ఏండ్ల 342 రోజులు) రికార్డు అందుకున్నాడు.

గిఫ్ట్‌గా 33 బీర్ బాటిళ్లు

Alastair-Cook
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ అలిస్టర్ కుక్ పట్ల బ్రిటిష్ మీడి యా ప్రతినిధులు తమ అభిమానాన్ని వైవిధ్యంగా చాటుకున్నారు. దాదాపు పుష్కరకాలంగా కుక్ ఆటను దగ్గర నుంచి ఆస్వాదిస్తున్న జర్నలిస్టులు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా మరిచిపోలేని బహుమతిని ఇచ్చారు. భారత్‌తో ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న కుక్..సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో కుక్ చేసిన సెంచరీలకు గుర్తుగా జర్నలిస్టులు 33 బీర్ బాటిళ్లను బహుమతిగా ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఈ మాజీ కెప్టెన్ తనపై అభిమానాన్ని చాటుకున్న మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపాడు. గత కొన్నేండ్లుగా ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా, ఆటగానిగా మీరు(కుక్) చేసిన సేవలకు మీడియా పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా మీకో చిన్న బహుమతి ఇవ్వదల్చుకున్నాం. గతంలో ఒకసారి మనందరం సరదాగా డిన్నర్‌కు వెళ్లినప్పుడు వైన్ కంటే బీర్‌నే ఎక్కువగా ఇష్టపడుతానని చెప్పారు. అందుకే టెస్ట్ సెంచరీలకు గుర్తుగా మీకు 33 బీర్ బాటిళ్లను గిఫ్ట్‌గా ఇస్తున్నాం. ఇందులో ప్రతి సీసాపై ఒక్కో మీడియా ప్రతినిధి సందేశం ఉంది అని పేర్కొన్నారు.


KLRahul

1323

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles