ఆఖర్లో పట్టు చిక్కింది!


Sat,September 8, 2018 12:46 AM

మూడో సెషన్‌లో భారత బౌలర్ల విజృంభణ.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 198/7.. ఇషాంత్‌కు 3 వికెట్లు
రెండు సెషన్లు.. ఒక్క వికెట్.. 123 పరుగులు.. ఐదో టెస్టులో ఇంగ్లండ్‌కు లభించిన ఆరంభం ఇది. కానీ.. ఆట ముగిసేసరికి ఆతిథ్య జట్టు స్కోరు 198/7. ఆరంభంలో, మధ్యలో భారత బౌలర్లు విఫలమైనా.. మూడో సెషన్‌లో మాత్రం దుమ్మురేపారు. దాదాపు నాలుగు గంటలపాటు పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ఆతిథ్య జట్టును ఒకే ఒక్క సెషన్‌తో నేలకు దించారు. ఇషాంత్, బుమ్రాకు తోడుగా జడేజా కూడా స్పిన్ మ్యాజిక్‌తో రూట్‌సేనను కట్టడి చేశారు. ఫలితంగా ఆసరా దొరకని స్థితిలో అద్భుత అవకాశాలను సృష్టించుకున్న టీమ్‌ఇండియా ఆఖర్లో పట్టు బిగించింది..! మరి రెండో రోజు బ్యాటింగ్‌లోనూ ఇదే తడాఖా చూపెడుతారా? లేదా? అన్నది ఆసక్తికరం...!

team-india
లండన్: చివరి సెషన్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. శుక్రవారం మొదలైన ఐదో టెస్టులో పట్టు బిగించారు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్ దూకుడుకు కళ్లెం వేస్తూ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసింది. బట్లర్ (11 బ్యాటింగ్), రషీద్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కెప్టెన్ రూట్ వరుసగా ఐదోసారి టాస్ గెలువడంతో.. మరో ఆలోచన లేకుండా ఇంగ్లండ్ ఓపెనర్లు కుక్ (71), జెన్నింగ్స్ (23) క్రీజులోకి వచ్చారు. ఆరంభంలో పిచ్ మీద ఉండే తేమను సద్వినియోగం చేసుకున్న ఇషాంత్ (3/28), బుమ్రా (2/41) వైవిధ్యమైన బంతులను వేసినా.. వికెట్ మాత్రం దక్కలేదు. దీంతో నిలకడగా పరుగులు చేస్తూ క్రమంగా కుదురుకున్నారు. 14వ ఓవర్‌లో కొత్త కుర్రాడు విహారిని ఛేంజ్ బౌలర్‌గా తీసుకొచ్చిన కోహ్లీ.. బౌలర్ల ఎండ్‌లు మార్చాడు. ఓవైపు జడేజా (2/57)తో స్పిన్.. మరోవైపు షమీతో పేస్ బౌలింగ్ చేస్తూ ఇంగ్లిష్ ఓపెనర్లను ఇబ్బందిపెట్టాలని చూశాడు. డ్రింక్స్ తర్వాత కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయడంతో 24వ ఓవర్‌లో తొలి ఫలితం దక్కింది. జడేజా టర్నింగ్ బంతిని ఆడబోయిన జెన్నింగ్స్ స్లిప్‌లో రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మొయిన్ అలీ (50) వికెట్‌కు ప్రాధాన్యమివ్వడంతో పరుగుల వేగం మందగించింది. ఫలితంగా ఇంగ్లండ్ లంచ్ వరకు 68/1 స్కోరు చేసింది.

నో వికెట్..

లంచ్ తర్వాత భారత సీమర్లు ఇషాంత్, బుమ్రా అద్భుతమైన స్వింగ్ రాబట్టారు. ఈ క్రమంలో 31వ ఓవర్ (ఇషాంత్)లో కుక్ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో రహానే వదిలేశాడు. మూడు బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో అలీ ఇచ్చిన క్యాచ్‌ను మూడో స్లిప్‌లో కోహ్లీ జారవిడిచాడు. ఈ రెండింటికి తోడు 33వ ఓవర్‌లో అలీ ఎల్బీ నుంచి బయపటడ్డాడు. టీమ్‌ఇండియా రివ్యూకు వెళ్లి విఫలమైంది. కట్టుదిట్టమైన బంతులతో షమీ కాసేపు భయపెట్టినా అలీ ఎక్కడా ఎడ్జ్ కాకుండా జాగ్రత్తగా ఆడాడు. రెండోఎండ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన కుక్.. 139 బంతుల్లో కెరీర్‌లో 57వ అర్ధసెంచరీని పూర్తి చేశాడు. ఈ ద్వయాన్ని విడదీసేందుకు కోహ్లీ బౌలర్లను మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. రెండు గంటల సెషన్‌లో ఈ ఇద్దరూ మెల్లగా ఆడటంతో కేవలం 55 పరుగులు మాత్రమే వచ్చాయి. ఓవరాల్‌గా 123/1 స్కోరుతో ఇంగ్లండ్ టీ విరామానికి వెళ్లింది.
ishanth

డబుల్ ఝలక్..

తొలి రెండు సెషన్లలో బౌలర్లు ఎంత పోరాడినా ఒకే ఒక్క వికెట్ ఇచ్చిన ఇంగ్లండ్ చివరి సెషన్‌లో తడబడింది. స్కోరు బోర్డు మీద 10 పరుగులు జత చేసిన తర్వాత ఇన్నింగ్స్ 64వ ఓవర్‌లో బుమ్రా డబుల్ ఝలక్ ఇచ్చాడు. రెండో బంతికి కుక్‌ను, ఐదో బంతికి రూట్ (0)ను డకౌట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లో ఇషాంత్.. బెయిర్‌స్టో (0)ను పెవిలియన్‌కు పంపాడు. 9 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు పడటంతో 133/1తో ఉన్న ఇంగ్లండ్ ఒక్కసారిగా 134/4కు పడిపోయింది. కుక్, అలీ రెండో వికెట్‌కు 73 పరుగులు జత చేశారు. ఈ దశలో వచ్చిన స్టోక్స్ (11)ను జడేజా ఇబ్బందిపెట్టాడు. అలీ అలవోకగా పరుగులు చేసినా.. స్టోక్స్ నెమ్మదిగా ఆడాడు. 13 ఓవర్ల తర్వాత జడేజా స్లో బంతితో స్టోక్స్‌ను ఔట్ చేసి ఐదో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. నిలకడగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు 83వ ఓవర్‌లో ఇషాంత్ మరోసారి ఝలక్ ఇచ్చాడు. మూడు బంతుల తేడాలో అలీ, కుర్రాన్ (0)ను ఔట్ చేయడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.

స్కోరు బోర్డు

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (బి) బుమ్రా 71, జెన్నింగ్స్ (సి) రాహుల్ (బి) జడేజా 23, అలీ (సి) పంత్ (బి) ఇషాంత్ 50, రూట్ ఎల్బీ (బి) బుమ్రా 0, బెయిర్‌స్టో (సి) పంత్ (బి) ఇషాంత్ 0, స్టోక్స్ ఎల్బీ (బి) జడేజా 11, బట్లర్ బ్యాటింగ్ 11, కుర్రాన్ (సి) పంత్ (బి) ఇషాంత్ 0, రషీద్ బ్యాటింగ్ 4, ఎక్స్‌ట్రాలు: 28, మొత్తం: 90 ఓవర్లలో 198/7. వికెట్లపతనం: 1-60, 2-133, 3-133, 4-134, 5-171, 6-177, 7-181. బౌలింగ్: బుమ్రా 21-9-41-2, ఇషాంత్ 22-10-28-3, విహారి 1-0-1-0, షమీ 22-7-43-0, జడేజా 24-0-57-2.

1053

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles