రెండు ఒకటయ్యేనా..!


Thu,July 12, 2018 01:22 AM

భారత్, ఇంగ్లండ్ తొలి వన్డే నేడు
ఫేవరెట్‌గా విరాట్‌సేన
ఆత్మవిశ్వాసంతో మోర్గాన్ బృందం

ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ టాప్‌లో కొనసాగుతుండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు నేటి నుంచి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే నంబర్‌వన్ ర్యాంక్ సొంతమవుతుంది. దీనికితోడు ఇంగ్లండ్ గడ్డపై జరిగే ప్రపంచకప్‌నకు
సన్నాహాకంగా ఈ సిరీస్‌ను భావిస్తున్నారు. కాబట్టి ఒకే సిరీస్‌తో రెండు అద్భుతమైన ఫలితాలను రాబట్టాలని విరాట్‌సేన ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు సుదీర్ఘకాలంగా తమకు అందని ద్రాక్షలా మారిన వరల్డ్‌కప్‌ను ఒడిసి పట్టుకోవాలంటే భారత్‌నే తొలి దెబ్బ కొట్టాలని ఇంగ్లండ్ లక్ష్యంగా పెట్టుకుంది.

నాటింగ్‌హామ్: వన్డే ప్రపంచకప్ సన్నాహాకంగా భావిస్తున్న ఇంగ్లండ్ పర్యటనలో భారత్ మరో సిరీస్‌పై దృష్టిపెట్టింది. పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని ప్రదర్శన చూపెట్టిన విరాట్‌సేన ఇప్పుడు 50 ఓవర్ల సిరీస్‌ను చేజిక్కించుకునేందుకూ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి మ్యాచ్ జరుగనుంది. దీంతో ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్‌కు ముందు ఈ సిరీస్‌ను డ్రై రన్‌గా భావిస్తున్న టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తిస్థాయి తుది జట్టును ఎంపిక చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా రిజర్వ్ బెంచ్‌లోని అందరికీ అవకాశాలు ఇవ్వాలని కెప్టెన్ విరాట్ యోచిస్తున్నాడు. మరోవైపు గత ఏడాది కాలంలో ఇంగ్లండ్ 21 వన్డేలు ఆడితే కేవలం నాలుగింటిలో ఓడింది. దీనికి తోడు సొంతగడ్డ అనుకూలత ఉండనే ఉంది. అయినప్పటికీ ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది.

kohli

కోహ్లీ @ 4


ఈ సిరీస్‌లో జరిగే మూడు మ్యాచ్‌లకు కొత్త మేళవింపును ప్రయత్నించాలని భారత టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. దీనికి తోడు ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండటంతో తుది జట్టు ఎంపిక కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. ఓపెనర్లుగా రోహిత్, ధవన్ స్థానాలు మార్చే అవకాశాల్లేకపోవడంతో టీ20ల్లో చెలరేగిన కేఎల్ రాహుల్‌ను మూడో స్థానంలో ఆడించే అవకాశాలు మెరుగయ్యాయి. కోహ్లీ తనంతకు తానుగా నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక మిడిలార్డర్‌లో రైనా, ధోనీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలను యధావిధిగా కొనసాగించనున్నారు. మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్‌లకు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తున్నది. ఒకవేళ ఎక్స్‌ట్రా పేసర్‌ను ఆడించాలని భావిస్తే సిద్ధార్థ్ కౌల్, శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. వెన్ను నొప్పి నుంచి భువనేశ్వర్ కోలుకుంటే.. ఉమేశ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకుంటాడు.

స్టోక్స్‌కు లైన్ క్లియర్


భారత్‌తో సిరీస్ కోసం ఇంగ్లండ్ కూడా బలమైన బ్యాటింగ్ లైనప్‌ను ఎంపిక చేసింది. అయితే సొంతగడ్డపై ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కోవాలంటే విరాట్‌సేన శక్తికి మించి కష్టపడాల్సిందే. ఆసీస్‌పై 6-0తో సిరీస్ గెలువడం, ఓ వన్డేలో 481 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పడం వంటి అంశాలు కూడా ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది. ఆసీస్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న ఆల్‌రౌండ్ బెన్ స్టోక్స్ నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. దీంతో హేల్స్‌కు అవకాశం లేనట్లే. రాయ్‌తో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. మిడిలార్డర్‌లో రూట్, మోర్గాన్ నిలబడితే భారీ స్కోరు ఖాయం. ఐపీఎల్ నుంచి బట్లర్ పరుగుల మోత మోగిస్తుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. చాహల్, కుల్దీప్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్న ఇతను స్లాగ్ ఓవర్లలో భారీగా పరుగులు చేయడంలో దిట్ట. ఇద్దరు స్పిన్నర్లు రషీద్, అలీతో పాటు విల్లే, ఫ్లంకెట్‌తో పేస్ బలగాన్ని బలోపేతం చేస్తున్నారు.

2015 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లండ్ ఆడిన 69 మ్యాచ్‌ల్లో 31సార్లు 300లకు పైగా స్కోర్లు సాధించింది. ఇందులో 23 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 11సార్లు 350 పరుగులను అధిగమించింది. మూడుసార్లు 400ల స్కోరును కూడా చేసింది. కాబట్టి ఈ సిరీస్ భారత్‌కు అనుకున్నంత సులువేంకాదు.

జట్లు (అంచనా)


భారత్: కోహ్లీ (కెప్టెన్), ధవన్, రోహిత్, రాహుల్, రైనా / కార్తీక్, ధోనీ, హార్దిక్, కుల్దీప్, చాహల్, ఉమేశ్, భువనేశ్వర్ / శార్దూల్ ఠాకూర్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, బట్లర్, అలీ, విల్లే, ఫ్లంకెట్, రషీద్, వుడ్ / బాల్.

పిచ్, వాతావరణం


బ్యాటింగ్‌కు అనుకూలం. పరుగుల వరద ఖాయం. ఇదే వేదికపై ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయితే ఆ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌ను వాడటం లేదు. వర్షం ముప్పు లేదు.

33 వన్డేల్లో 10 వేల పరుగులకు ధోనీ చేయాల్సిన రన్స్.

600
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles