శర్మ శతక్కొట్టినా..


Sun,January 13, 2019 02:46 AM

- భారత్‌కు దక్కని బోణీ
- రోహిత్ సెంచరీ పోరాటం వృథా
- రిచర్డ్‌సన్, బెహెన్‌డార్ఫ్ విజృంభణ
- సిరీస్‌లో ఆసీస్ ముందంజ

Rohit-Sharma
భారత్‌కు భంగపాటు ఎదురైంది. టెస్ట్ సిరీస్ విజయమిచ్చిన జోష్‌తో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పోరుకు దిగిన కోహ్లీసేనకు కంగారూలు షాక్ ఇచ్చారు. భారీ స్కోరు కాకుండా బౌలర్లు అడ్డుకున్నా..పరుగుల వరద పారిస్తారనుకున్న బ్యాట్స్‌మెన్ కుదేలవడంతో టీమ్‌ఇండియాకు బోణీ దక్కలేదు. బెహెన్‌డార్ఫ్, రిచర్డ్‌సన్ విజృంభణతో టాపార్డర్ కకావికలం కాగా, రోహిత్‌శర్మ శతక్కొట్టినా లాభం లేకపోయింది. ధోనీ అండతో జట్టును గెలిపించేందుకు కడదాకా ప్రయత్నం చేసినా సహచరుల సహకారలేమితో ఓటమివైపు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-1తోవెనుకంజలో నిలిచింది. ప్రపంచకప్ సన్నాహాలు మొదలుపెట్టిన భారత్‌కు ఆశించిన ఫలితం దక్కకుండాపోగా, టెస్ట్ సిరీస్ ఓటమి నైరాశ్యంలో ఉన్న ఆసీస్ జట్టులో సిడ్నీ గెలుపు కొత్త ఊపుతెచ్చింది.

సిడ్నీ: ప్రపంచకప్ టోర్నీకి పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్న భారత్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. సుదీర్ఘ కలను సాకారం చేసుకుంటూ వన్డే సిరీస్‌లోకి ప్రవేశించిన టీమ్‌ఇండియాకు సిడ్నీలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యఛేదనలో రిచర్డ్‌సన్(4/26), బెహెన్‌డార్ఫ్(2/39) ధాటికి టీమ్‌ఇండియా 254/9 స్కోరు చేసింది. రోహిత్‌శర్మ(129 బంతుల్లో 133, 10ఫోర్లు, 6సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదం తొక్కగా, ధోనీ(96 బంతుల్లో 51, 3ఫోర్లు, సిక్స్) సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. ఆఖర్లో భువనేశ్వర్(23 బంతుల్లో 29 నాటౌట్, 4ఫోర్లు) బౌండరీలతో అదరగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 288 పరుగులు చేసింది. హ్యాండ్స్‌కోంబ్(73), ఖవాజ(59), షాన్ మార్ష్(54) అర్ధసెంచరీలతో రాణించడంతో కంగారూలకు మెరుగైన స్కోరు దక్కింది. కుల్దీప్ యాదవ్(2/54), భువనేశ్వర్(2/66) రెండేసి వికెట్లు తీయగా, జడేజా(1/48)కు ఒక వికెట్ దక్కింది. నాలుగు వికెట్లతో రాణించిన రిచర్డ్‌సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య ఈనెల 15న అడిలైడ్‌లో రెండో వన్డే జరుగుతుంది.

1/1, 2/4, 3/4:

భారత వికెట్ల పతనమిది. ఆసీస్ నిర్దేశించిన లక్ష్యఛేదనకు దిగిన టీమ్‌ఇండియాకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. బెహెన్‌డార్ఫ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆఖరి బంతికి ధవన్(0) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ(3) వంతు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన కోహ్లీ..ఫార్వర్డ్ స్కేర్‌లో స్టోయినిస్ చేతికి చిక్కాడు. బంతి తేడాతో రాయుడు(0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తన ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లిన రాయుడికి నిరాశే ఎదురైంది. దీంతో టీమ్‌ఇండియా 11 బంతుల తేడాతో మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

రోహిత్ సెంచరీ:

ధోనీ ఔట్ తర్వాత బ్యాటింగ్ భారం రోహిత్‌పై పడింది. ఓవైపు సాధించాల్సిన రన్‌రేట్ అంతకంతకు పెరుగుతుండటం ఒత్తిడిని పెంచింది. అండగా నిలుస్తాడనుకున్న కార్తీక్(12) నిరాశపరుచడం..భారత విజయావకాశాలను దెబ్బతీసింది. రిచర్డ్‌సన్ ఇన్నింగ్స్ 40వ ఓవర్లో షాట్ ఆడబోయిన కార్తీక్..ఇన్‌సైడ్ ఎడ్జ్‌తో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రెండు బంతుల తేడాతో రోహిత్ తన వన్డే కెరీర్‌లో 22వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ తర్వాత రోహిత్ గేర్ మార్చాడు. ఓవైపు సాధించాల్సిన పరుగులు పెరుగుతుండటం, బంతులు తక్కువ కావడంతో దూకుడుగా ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. సాఫీగా సాగుతున్న క్రమంలో జడేజాను రిచర్డ్‌సన్ ఔట్ చేయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ తర్వాత రోహిత్ పెవిలియన్ చేరడంతో భారత్ ఓటమి ఖరారైంది.

చక్కదిద్దిన శర్మ, ధోనీ

మూడు వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు అడుగంటిన వేళ రోహిత్‌శర్మ, ధోనీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తూ పరుగులు సాధించే పనిలోపడ్డారు. ఆసీస్ బౌలర్లు అదేపనిగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పది ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 21 పరుగులకే పరిమితమైంది. చెత్త షాట్లకు పోకుండా ఆడేందుకు ప్రయత్నించడంతో స్కోరుబోర్డు మందకోడిగా ముందుకుసాగింది. ఓవైపు రోహిత్ అడపాదడపా బౌండరీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా..మరోవైపు సీనియర్ ధోనీ బంతులను వృథా చేస్తూ పరుగులు చేయడంలో ఘోరంగా తడబడ్డాడు. ఈ క్రమంలో రోహిత్ బౌండరీ సహాయంతో 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 29వ ఓవర్ నుంచి రోహిత్ గేర్ మార్చాడు. బెహెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో ధోనీ వికెట్ల ముందు దొరకడం, అంపైర్ ఔటివ్వడం చకచకా అయిపోయాయి. అయితే రివ్యూలో బంతి ఔట్‌సైడ్ లెగ్‌స్టంప్ దిశగా వచ్చినట్లు కనిపించినా సమీక్షకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ధోనీ నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో నాలుగో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

aus-team

ఆసీస్ సమిష్టిగా

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఆదిలోనే కెప్టెన్ ఫించ్(6) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రిటర్న్ క్యాచ్‌తో ఫించ్ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. ఉస్మాన్ ఖవాజ(59)తో కలిసి అలెక్స్ క్యారీ(24) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే చైనామన్ కుల్దీప్ యాదవ్ తొలి ఓవర్లోనే క్యారీ రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఖవాజ, షాన్ మార్ష్ నింపాదిగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు కొల్లగొట్టారు. ఇన్నింగ్స్ కుదురుకుంటున్న సమయంలో ఖవాజను జడేజా ఎల్బీడబ్ల్యూ చేయడం ద్వారా ఈ జోడీని విడగొట్టాడు. దీంతో మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా..ఆసీస్ బ్యాట్స్‌మెన్ తమ జోరు తగ్గించలేదు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. హ్యాండ్స్‌కోంబ్‌తో కలిసి మార్ష్ నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. ఎక్కడా ఇన్నింగ్స్ జోరు తగ్గించని ఆసీస్‌కు ఆఖర్లో హ్యాండ్స్‌కోంబ్, స్టోయినిస్ కీలక పరుగులు జతచేశారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 68 పరుగులు జోడించి జట్టుకు పోరాడే స్కోరు కట్టబెట్టారు. భారత యువ పేసర్ ఖలీల్ అహ్మద్ లయను దొరకబుచ్చుకోవడంలో విఫలమయ్యాడు.

స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా: అలెక్స్ క్యారీ(సి)రోహిత్‌శర్మ(బి)కుల్దీప్ యాదవ్ 24, ఫించ్(బి)భువనేశ్వర్ 6, ఖవాజ(ఎల్బీ)జడేజా 59, షాన్‌మార్ష్(సి)షమీ(బి)కుల్దీప్‌యాదవ్ 54, హ్యాండ్స్‌కోంబ్(సి)ధవన్(బి)భువనేశ్వర్ 73, స్టోయినిస్ 47 నాటౌట్, మ్యాక్స్‌వెల్ 11 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 50 ఓవర్లలో 288/5; వికెట్ల పతనం: 1-8, 2-41, 3-133, 4-186, 5-254; బౌలింగ్: భువనేశ్వర్ 10-0-66-2, ఖలీల్ అహ్మద్ 8-0-55-0, షమీ 10-0-46-0, కుల్దీప్ 10-0-54-2, జడేజా 10-0-48-1, రాయుడు 2-0-13-0.

భారత్: రోహిత్‌శర్మ(సి)మ్యాక్స్‌వెల్(బి)స్టోయినిస్ 133, ధవన్(ఎల్బీ) బెహెన్‌డార్ఫ్ 0, కోహ్లీ(సి)స్టోయినిస్(బి)రిచర్డ్‌సన్ 3, రాయుడు(ఎల్బీ)రిచర్డ్‌సన్ 0, ధోనీ(ఎల్బీ) బెహెన్‌డార్ఫ్ 51, కార్తీక్(బి)రిచర్డ్‌సన్ 12, జడేజా(సి)మార్ష్(బి) రిచర్డ్‌సన్ 8, భువనేశ్వర్ 29 నాటౌట్, కుల్దీప్ యాదవ్(సి)ఖవాజ(బి)సిడిల్ 3, షమీ(సి)మ్యాక్స్‌వెల్(బి)స్టోయినిస్ 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 50 ఓవర్లలో 254/9; వికెట్ల పతనం: 1-1, 2-4, 3-4, 4-141, 5-176, 6-213, 7-221, 8-247, 9-254; బౌలింగ్: బెహెన్‌డార్ఫ్ 10-2-39-2, రిచర్డ్‌సన్ 10-2-26-4, సిడిల్ 8-0-48-1, లియాన్ 10-1-50-0, స్టోయినిస్ 10-0-66-2, మ్యాక్స్‌వెల్ 2-0-18-0.

806

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles