కుప్పకూల్చారు


Tue,October 22, 2019 01:48 AM

Faf-du-Plessis

-ఒకే రోజు 16 సఫారీ వికెట్లు ఫట్..
-బెంబేలెత్తించిన షమీ, ఉమేశ్
-విజయానికి 2 వికెట్ల దూరంలో భారత్..
-దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 132/8

రెండంటే రెండే వికెట్లు.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీమ్‌ఇండియా సిరీస్ క్లీన్‌స్వీప్ చేసేందుకు.. రెండంటే రెండే బంతులు.. సఫారీలు వైట్‌వాష్ అయ్యేందుకు. హోమ్ సీజన్‌లో దుమ్మురేపుతున్న విరాట్‌సేన మూడో టెస్టులో విజయానికి చేరువైంది. తొలి రెండు టెస్టుల్లో కాస్తో కూస్తో ప్రతిఘటన కనబర్చిన సఫారీలు.. ఈ సారి అదీ లేకుండా పూర్తిగా తలొగ్గడంతో భారత్ విజయం నల్లేరుపై నడకగా మారింది. భారత బ్యాట్స్‌మెన్ పరుగుల పండుగ చేసుకున్న పిచ్‌పై.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కనీసం క్రీజులో నిలిచేందుకు నానా కష్టాలు పడ్డారు. షమీ, ఉమేశ్ ధాటికి సైకిల్ స్టాండ్‌ను తలపించిన సఫారీ లైనప్ సోమవారం ఒక్కరోజే 16 వికెట్లు కోల్పోయింది. ఇక మంగళవారం ఉదయం భారత్ ఆ రెండు వికెట్లు పడగొట్టి 3-0తో సగర్వంగా సిరీస్‌ను ముద్దాడటం లాంఛనమే ఇక.
రాంచీ: సొంతగడ్డపై గతంలో ఎన్నడూ లేనివిధంగా చెలరేగిపోతున్న భారత పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చివురుటాకులా వణికింది. మొహమ్మద్ షమీ (2/22, 3/10), ఉమేశ్ యాదవ్ (3/40, 2/35) నిప్పులు చెరుగడంతో చివరిదైన మూడో టెస్టు మూడో రోజు పర్యాటక జట్టు ఏకంగా 16 వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. హమ్జ (62; 10 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో నదీమ్, జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగుల ఆధిక్యం లభించడంతో టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా దక్షిణాఫ్రికాను ఫాలోఆన్ ఆడించాడు. రెండో ఇన్నింగ్స్ అంటేనే శివాలెత్తే మొహమ్మద్ షమీ రాంచీలోనూ రెచ్చిపోవడంతో మరోసారి ప్రొటీస్ టాపార్డర్ పేలవ ప్రదర్శనకే పరిమితమైంది. డికాక్ (5), డుప్లెసిస్ (4), బవుమా (0), క్లాసెన్ (5), హమ్జ (0) సింగిల్ డిజిట్లకే పరిమితం కావడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సోమవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఉమేశ్ బౌలింగ్‌లో గాయపడ్డ ఎల్గర్ (16) స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన డిబ్రుయన్ (30 బ్యాటింగ్) కాస్త ప్రతిఘటించకపోయిఉంటే.. కోహ్లీసేన ఈ పాటికే సంబురాలు చేసుకునేది. చేతిలో 2 వికెట్లు ఉన్న సఫారీలు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 203 పరుగులు చేయాల్సి ఉంది. అది అసాధ్యం కావడంతో మంగళవారం భారత్ ఎంత త్వరగా మ్యాచ్‌ను ముగిస్తుందనేదే తేలాల్సి ఉంది. ప్రస్తుతం డిబ్రుయన్‌తో పాటు నోర్జే (5) క్రీజులో ఉన్నాడు.
Umesh-Yadav

ఉమేశ్ జోరు..

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 9/2తో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కష్టకాలంలో ఆదుకుంటాడనుకున్న సారథి డుప్లెసిస్ (1) తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఉమేశ్ వేసిన లేట్ ఔట్‌స్వింగర్ రెప్పపాటులో వికెట్లను గిరాటేయడంతో ఫాఫ్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించాక.. హమ్జను ఔట్ చేయడం ద్వారా జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. మరుసటి ఓవర్‌లో బవుమా కూడా వెనుదిరిగాడు. షాబాజ్ నదీమ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడేందుకు యత్నించిన బవుమా బంతిని మిస్సయ్యాడు. అంతే వికెట్ల వెనుక ఉన్న సాహా క్షణకాలంలో బెయిల్స్ లేపేశాడు. నదీమ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ వికెట్ కాగా.. ఒక్క పరుగు కూడా ఇవ్వక ముందే అతడు తొలి వికెట్ ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం వేగంగా సాగింది. క్లాసెన్ (6), పీట్ (4), రబాడ (0) పెవిలియన్‌కు వరుసకట్టారు. చివర్లో లిండె (81 బంతుల్లో 37), నోర్జే (55 బంతుల్లో 4) కాస్త పోరాడటంతో దక్షిణాఫ్రికా 162 పరుగులు చేయగలిగింది.
Shami

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ షమీ

ప్రత్యర్థి రెండో ఇన్నింగ్స్ ఆడుతుందంటే చాలు రెచ్చిపోయి బంతులేసే షమీ ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే కనబర్చాడు. చురకత్తుల్లాంటి బంతులతో సఫారీలను బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో పోరాడిన హమ్జతో పాటు డుప్లెసిస్, బవుమాలను వెనక్కి పంపి ప్రొటీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. డికాక్, క్లాసెన్‌ను ఉమే శ్ వెనక్కి పంపడంతో దక్షిణాఫ్రికా 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లిండే (27), పీట్ (23) కుదురుకునేందుకు యత్నించినా.. నదీమ్ వేసిన డైరెక్ట్ త్రోకు లిండే పెవిలియన్ చేరక తప్పలేదు. ఉమేశ్ బౌన్సర్‌తో గాయపడ్డ ఎల్గర్ రిటైర్డ్‌హర్ట్‌గా డగౌట్‌కు చేరడంతో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగిన డిబ్రుయన్ భారత విజయాన్ని ఆలస్యం చేశాడు. ఫలితం కోసం అంపైర్లు ఆటను మరో రెండు ఓవర్లు పొడిగించినా వికెట్ పడకపోవడంతో
రోజును ముగించారు.
Edward-Elgar

భారత్‌లో తొలిసారి కాంకషన్..

ఫాలోఆన్‌లో పడ్డ దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీ విరామానికి కాస్త ముందు పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నిం గ్స్ 10వ ఓవర్ మూడో బంతి సఫారీ ఓపెనర్ డీన్ ఎల్గర్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. 145 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి చెవి పైభాగంలో తాకడంతో.. ఎల్గర్ వెంటనే క్రీజులో కూలబడిపోయాడు. అతడిని పరిశీలించిన వైద్య సిబ్బంది తదుపరి పరీక్షలకు పంపించారు. దీంతో ఆ జట్టు మ్యాచ్ రిఫరీ అనుమతితో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా డిబ్రుయన్‌ను బరిలో దింపింది. భారత గడ్డపై ఇలా కాంకషన్ సబ్‌స్టిట్యూట్ బ్యాటింగ్ చేయ డం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా లబుషేన్ (ఆస్ట్రేలియా, స్మిత్ స్థానంలో), బ్లాక్‌వుడ్ (వెస్టిండీస్, బ్రావో స్థానంలో) తర్వాత టెస్టు క్రికెట్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా దిగిన మూడో ప్లేయర్‌గా డిబ్రుయన్ నిలిచాడు.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 497/9 డిక్లేర్డ్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) సాహా (బి) షమీ 0, డికాక్ (సి) సాహా (బి) ఉమేశ్ 4, హమ్జ (బి) జడేజా 62, డుప్లెసిస్ (బి) ఉమేశ్ 1, బవుమా (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 32, క్లాసెన్ (బి) జడేజా 6, లిండే (సి) రోహిత్ (బి) ఉమేశ్ 37, పీట్ (ఎల్బీ) షమీ 4, రబాడ (రనౌట్/ఉమేశ్) 0, నోర్జే (ఎల్బీ) నదీమ్ 4, ఎంగ్డీ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 56.2 ఓవర్లలో 162. వికెట్ల పతనం: 1-4, 2-8, 3-16, 4-107, 5-107, 6-119, 7-129, 8-130, 9-162, 10-162, బౌలింగ్: షమీ 10-4-22-2, ఉమేశ్ 9-1-40-3, నదీమ్ 11.2-4-22-2, జడేజా 14-3-19-2, అశ్విన్ 12-1-48-0.

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: డికాక్ (బి) ఉమేశ్ 5, ఎల్గర్ (రిటైర్డ్ హర్ట్) 16, హమ్జ (బి) షమీ 0, డుప్లెసిస్ (ఎల్బీ) షమీ 4, బవుమా (సి) సాహా (బి) షమీ 0, క్లాసెన్ (ఎల్బీ) ఉమేశ్ 5, లిండే (రనౌట్/నదీమ్) 27, పీట్ (బి) జడేజా 23, డిబ్రుయన్ (నాటౌట్) 30, రబాడ (సి) జడేజా (బి) అశ్విన్ 12, నోర్జే (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 46 ఓవర్లలో 132/8 (ఫాలోఆన్). వికెట్ల పతనం: 1-5, 2-10, 3-18, 4-22, 5-36, 6-67, 7-98, 8-121, బౌలింగ్: షమీ 9-5-10-3, ఉమేశ్ 9-1-35-2, జడేజా 13-5-36-1, నదీమ్ 5-0-18-0, అశ్విన్ 10-3-28-1.

1572

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles