రెండోరోజూ అదే జోరు..


Wed,December 4, 2019 02:25 AM

-మంగళవారం 27 పతకాలు చేజిక్కించుకున్న భారత్.. దక్షిణాసియా క్రీడలు
volleyball
కఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా క్రీడల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నది. తొలిరోజు 16 పతకాలు చేజిక్కించుకొని అదుర్స్ అనిపించుకున్న మన క్రీడాకారులు రెండోరోజు మరో 27 పతకాలు ఖాతాలో వేసుకున్నారు. అందులో 11 స్వర్ణాలు ఉన్నాయి. ముఖ్యంగా షూటింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మనవాళ్ల జోరుకు ఎదురు లేకుండాపోయింది. ప్రస్తుతం భారత్ 43 పతకాల (18 స్వర్ణాలు, 16 రజతాలు, 9 కాంస్యాలు)తో రెండో స్థానంలో ఉండగా.. నేపాల్ 44 (23 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు) టాప్‌లో కొనసాగుతున్నది. శ్రీలంక 46 (5 స్వర్ణాలు, 14 రజతాలు, 27 కాంస్యాలు) మూడో స్థానంలో ఉంది. మంగళవారం పోటీల్లో మనవాళ్లు అథ్లెటిక్స్‌లో 10 పతకాలు (4 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు), షూటింగ్‌లో 9 మెడల్స్ (4 స్వర్ణాలు, 4 రజతాలు, ఓ కాంస్యం) సాధించారు. వాలీబాల్‌లో పురుషుల, మహిళల జట్లు పసిడి పతకాలు చేజిక్కించుకోగా.. తైక్వాండోలో ఓ స్వర్ణం, 3 కాంస్యాలు దక్కాయి. టెన్నిస్ (టీటీ)లో పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్స్‌లో భారత్ పసిడి పతకాలు కైవసం చేసుకుంది.

మెహూలీ మోత..

మహిళల 100 మీటర్లలో అర్చన (11.80 సెకన్లు), మహిళల హైజంప్‌లో ఎం జష్న (1.73 మీటర్లు), పురుషుల హై జంప్‌లో సర్వేశ్ అనిల్ కుషారే (2.21 మీటర్లు), పురుషుల 1500 మీటర్లలో అజయ్ కుమార్ (3 నిమిషాల 54.18 సెకండ్లు) స్వర్ణాలు సాధించారు. షూటింగ్‌లో మెహూలి ఘోష్ (253.3 పాయింట్లు) ప్రపంచ రికార్డు స్కోరు కంటే ఎక్కువ నమోదు చేసి స్వర్ణం నెగ్గినా.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ గుర్తింపు లేకపోవడంతో దీనికి రికార్డుల్లో చోటు దక్కలేదు.వాలీబాల్ ఫైనల్స్‌లో పురుషుల జట్టు 20-25, 25-25, 25-27, 29-27తో పాకిస్థాన్‌ను చిత్తు చేస్తే.. మహిళల ఫైనల్లో 25-17, 23-25, 21-25, 25-20, 15-6తో నేపాల్‌ను మట్టికరిపించి అగ్రస్థానంలో నిలిచింది.

331

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles