ఆశలు ఆవిరి


Fri,October 13, 2017 12:40 AM

ఘనా చేతిలో భారత్ ఓటమి
టోర్నీ నుంచి ఔట్
ఫిఫా అండర్-17 ప్రపంచకప్

fifa
న్యూఢిల్లీ: ఫిఫా అండర్-17 ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత జట్టు పోరాటం ముగిసింది. ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి ఆడిన భారత కుర్రాళ్లు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయంపాలయ్యారు. గ్రూప్-ఎలో భాగంగా గురువారం ఘనా జట్టుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 0-4 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయలేకపోయిన భారత జట్టు లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. రెండోమ్యాచ్‌లో కొలంబియాపై స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న మన జూనియర్లు, ఘనమైన ఘనా జట్టు ముందు మాత్రం తేలిపోయారు. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్‌పై ఎదురుదాడికి దిగిన ఘనా ఆటగాళ్లు పోరు ఆద్యంతం ఆధిపత్యం చాటుకున్నారు. ఘనా కెప్టెన్ ఎరిక్ అహియా రెండు గోల్స్ సాధించి జట్టు భారీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఎరిక్ 43వ, 52వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. రిచర్డ్ డాన్సో (86వ), ఎమ్మాన్యుయెల్ టోకు (87వ) చెరో గోల్ చేశారు. గ్రూప్-ఎలో ఘనా టాపర్‌గా నిలిచి ప్రీక్వార్టర్స్‌కు నేరుగా అర్హత సాధించింది. ఈ గ్రూప్ నుంచి కొలంబియా రెండోస్థానంలో నిలిచి ప్రీక్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన ఇతర మ్యాచుల్లో కొలంబియా 3-1తో అమెరికాపై గెలుపొందగా, పరాగ్వే 3-1తో టర్కీని ఓడించింది. మాలి జట్టు 3-1తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.

305

More News

VIRAL NEWS

Featured Articles