పతకాలు కొల్లగొట్టారు..


Mon,April 16, 2018 12:46 AM

(నమస్తే తెలంగాణ క్రీడా విభాగం) : భారత క్రీడాభిమాని మది ఉప్పొంగిపోయే సందర్భం. అంచనాలు లేని స్థాయి నుంచి అద్భుతాలు సృష్టించిన వైనం. రెండు వందల పైచిలుకు భారీ బలగంతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాబృందం అందరూ ఆశ్చర్యపడేలా పతకాలతో సత్తాచాటింది. మెరికల్లాంటి యువ క్రీడాకారులకు తోడు అనుభవజ్ఞలైన ఆటగాళ్ల సమాహారంతో భారత్ అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పంట పండించింది. సుదీర్ఘ చరిత్ర కల్గిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌లో భారత్ సత్తా ఏంటో ఘనంగా చాటిచెప్పింది. గత అనుభవాలకు భిన్నంగా పసిడి పతకాలతో మెరిసిన మనోళ్లు కంగారూల గడ్డపై కొత్త చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ క్రీడా చరిత్రలో మూడో అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. 12 రోజుల పాటు అలరించిన కామన్వెల్త్ క్రీడా వేడుకల్లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలతో మూడో స్థానంతో ముగించింది. అంతగా అంచనాలు లేని వెయిట్‌లిఫ్టింగ్‌లో మొదలైన భారత పతక జోరు ఆఖరికి బ్యాడ్మింటన్ వరకు కొనసాగింది. మను బాకర్, మెహులీ ఘోష్, అనీష్ భన్వాల, మానిక బాత్రా, నీరజ్ చోప్రా లాంటి యువ ఆటగాళ్లు పతకాలతో భారత్ భవిష్యత్ ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారు.

మరోవైపు తమ అపార అనుభవానికి పోరాట పటిమను జోడిస్తూ క్రీడా దిగ్గజాలు సుశీల్‌కుమార్, సైనా నెహ్వాల్, మేరికోమ్ పతకాలతో మెరిసారు. గత గ్లాస్గో కామన్వెల్త్‌లో కేవలం కాంస్యానికి పరిమితమైన భారత టీటీ ఈసారి కొత్త చరిత్ర సృష్టించింది. స్టార్ క్రీడాకారిణి మానిక బాత్రా ఏకంగా నాలుగు పతకాలతో అదరగొట్టింది. ఈ కామన్వెల్త్‌లో అద్భుత వ్యక్తిగత ప్రదర్శనతో మనిక టీటీపై చెరుగని ముద్ర వేసింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో గురురాజ రజతంతో బోణీ కొడితే..సాత్విక్ రణిక్‌రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ వెండి పతకంతో మెగా టోర్నీకి మగింపు పలికింది. కామన్వెల్త్‌లో భారత షూటర్లు మొత్తం 16 పతకాల(7 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలు)తో తమకు తిరుగులేదని చాటిచెప్పారు. బరిలోకి దిగింది మొదటిసారే అయినా మను బాకర్, మెహులీ ఘోష్, అనీష్ తమదైన ప్రతిభతో ఆకట్టుకున్నారు. షూటింగ్ తర్వాత భారత్‌కు ఎక్కువ పతకాలు దక్కింది రెజ్లింగ్‌లోనే. ఏకంగా 12 పతకాలు(5 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు) మన కుస్తీవీరులు ఖాతాలో వేశారు. సుశీల్ పసిడి పట్టుకు తోడు వినేశ్ ఫోగట్, బబితా కుమారి, సాక్షి మాలిక్, పూజ దండా, బజ్‌రంగ్ పూనియా లాంటి రెజ్లర్లు పతకాలతో మెరిశారు.

తామేం తక్కువ కాదన్నట్లు బాక్సింగ్ రింగ్‌లో మనోళ్ల పంచ్‌లకు పతకాలు రాలాయి. అరంగేట్రం కామన్వెల్త్‌లో భారత బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్ పసిడి పతకంతో తన కల నెరవేర్చుకుంటే వికాస్ క్రిషన్, గౌరవ్ సోలంకి, మనీశ్ కౌశిక్, సతీశ్‌కుమార్‌కు తోడు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ పతకాలతో రాణించారు. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఆరు పతకాలు దక్కాయి. మరోవైపు అందని ద్రాక్షగా మారిన జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించగా, డిస్కస్ త్రోలో సీమా పూనియా రజతంతో సత్తాచాటింది. భారీ ఆశలు పెట్టుకున్న భారత హాకీ జట్లు రిక్తహస్తలతో వెనుదిరగడం అభిమానులను నిరాశ పరిచింది. ఓవరాల్‌గా పతకాల పంట పండించిన గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్‌లో సిరంజీ వివాదంతో కేటీ ఇర్ఫాన్, రాకేశ్ బాబుపై బహిష్కరణ మినహాయిస్తే భారత్‌కు అంత శుభప్రదమే. ఇదే జోరులో ఆగస్టులో జరిగే ఆసియా క్రీడల్లో మనోళ్లు పతకాలు కొల్లగొట్టాలని ఆశిద్దాం.
cwg-india

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles