చాహర్ 6/7


Mon,November 11, 2019 04:15 AM

team-india

-హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు..
-బంగ్లాపై భారత్ అద్భుత విజయం..
-టీ20 సిరీస్ 2-1తో సొంతం

కుర్రాళ్లు కుమ్మేశారు. అందివచ్చిన అవకాశాలను అద్భుతంగా ఒడిసిపట్టుకున్నారు. విమర్శకులకు దీటైన సమాధానమిస్తూ ప్రత్యర్థిని పడగొట్టి సింహనాదం చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం లేకపోయినా మెండైన ఆత్మవిశ్వాసంతో జట్టును గెలిపించడంలో కీలకమయ్యారు. అయ్యర్, రాహుల్ అర్ధసెంచరీలతో తొలుత భారీ స్కోరు అందుకున్న భారత్.. బంగ్లాకు ఫైనల్ పంచ్ ఇచ్చింది. రోహిత్ రూపంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినా వెరువకుండా ఫోర్లు, సిక్స్‌లతో అయ్యర్ కొట్టిన కొట్టుడుకు స్టేడియం హోరెత్తిపోయింది. లక్ష్యఛేదనలో నయీమ్, మిథున్ భారత్‌ను భయపెట్టే ప్రయత్నం చేసినా.. యంగ్‌గన్స్ దీపక్ చాహర్, శివమ్ దూబే చురకత్తుల్లాంటి బంతులతో బంగ్లా నడ్డివిరిచారు. ఐపీఎల్‌లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదరగొడుతానని నిరూపిస్తూ చాహర్ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లతో చెలరేగిన వేళ నాగ్‌పూర్‌లో భారత్ విజయబావుటా ఎగురవేసింది. అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డుతో చాహర్.. టీమ్‌ఇండియాకు సిరీస్ సాధించిపెట్టి నయా హీరోగా నిలిచాడు.
నాగ్‌పూర్: కుర్రాళ్లతో చేస్తున్న ప్రయోగాలు బెడిసికొడుతున్నాయా? ఇది నిన్నటి వరకు అందరి మెదళ్లను తొలిచిన ప్రశ్న. కానీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తే జట్టుకు చిరస్మరణీయ విజయాలందిస్తామని నవయువకులు నిరూపించారు. దూకుడుకు మారుపేరైన టీ20ల్లో తమదైన ప్రతిభను చాటుతూ జట్టును విజయపథాన నడిపిస్తున్నారు. సిరీస్ గెలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో కుర్రాళ్లు కదంతొక్కారు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యఛేదనలో దీపక్ చాహర్(3.2-0-7-6) సూపర్ బౌలింగ్ ధాటికి బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ మహ్మద్ నయీమ్(81), మహ్మద్ మిథున్(27) మినహ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. శివమ్ దూబే(3/30) మూడు కీలక వికెట్లు తీశాడు.

తొలుత శ్రేయాస్ అయ్యర్(33 బంతుల్లో 62, 3ఫోర్లు, 5సిక్స్‌లు), రాహుల్(35 బంతుల్లో 52, 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 174/5 స్కోరు చేసింది. ఇస్లాం(2/32), సర్కార్(2/29) రెండు వికెట్లు తీశారు. ఆరు వికెట్లతో భారత్‌ను గెలిపించిన చాహర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఈనెల 14న మొదలవుతుంది.
Chahar
అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన తొలి భారత బౌలర్ చాహర్
చాహర్ సిక్సర్: నిర్దేశిత లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన బంగ్లాను చాహర్ తన తొలి ఓవర్లోనే దెబ్బతీశాడు. వరుస బంతుల్లో లిటన్ దాస్(9), సౌమ్య సర్కార్(0)ను పెవిలియన్ పంపి భారత శిబిరంలో ఆనందం నింపాడు. అయితే మన ఆశలు ఎక్కువసేపు నిలువలేదు. మహ్మద్ నయీమ్, మిథున్ కలిసి టీమ్‌ఇండియా బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో తొలి ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి 33/2 స్కోరు చేసింది. ముఖ్యంగా నయీమ్ చూడచక్కని షాట్లతో అలరించాడు. వీరిద్దరి బ్యాటింగ్ జోరు చూస్తే జట్టుకు అలవోక విజయం ఖాయమనుకున్నారు. వీరిని విడగొట్టేందుకు కెప్టెన్ రోహిత్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో చాహర్ బౌలింగ్‌లో మిథున్ ఔట్ కావడంతో బంగ్లా పతనానికి బాట పడింది. ఆ మరుసటి ఓవర్లో ముష్ఫీకర్(0)ను దూబే పెవిలియన్ పంపడంతో ఒక్కసారిగా జట్టు జోష్‌లోకి వచ్చింది. అదే జోరులో నయీమ్‌తో పాటు హుస్సేన్(0)ను ఔట్ చేసి తన ఎంపికకు న్యాయం చేశాడు. ఇక్కణ్నుంచి బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. గెలుపు ఆశలును తుంచేస్తూ మహ్మదుల్లా(8)ను చాహల్ పెవిలియన్ పంపాడు. మూడు బంతుల తేడాతో ఇస్లాం(4) రెహమాన్(1), అమినుల్ ఇస్లాం(9)ను చాహర్ ఔట్ చేసి గెలుపు సంబురాల్లో ముంచెత్తాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది.

రాహుల్, అయ్యర్ విజృంభణ: టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ రోహిత్‌శర్మ(2)ను ఆదిలోనే ఔట్ చేసి బంగ్లా దెబ్బ కొట్టింది. షైఫుల్ ఇస్లాం(2/32) తన తొలి ఓవర్లోనే హిట్‌మ్యాన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కేఎల్ రాహుల్(52)..ధవన్‌కు జతకలిశాడు. రోహిత్ నిష్క్రమణతో ఒత్తిడిలో ఉన్న భారత్‌ను మరింత ఇబ్బంది పెట్టేందుకు కెప్టెన్ మహ్మదుల్లా ప్రయత్నించాడు.

అయితే ధవన్, రాహుల్ వరుస బౌండరీలతో జోరు కనబరిచారు. ఫామ్‌లోకి వచ్చేందుకు ధవన్ అడపాదడపా షాట్లతో అలరిస్తే..తానేం తక్కువ కాదన్నట్లు రాహుల్ కూడా బ్యాటు ఝులిపించాడు. షైఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన ధవన్..మహ్మదుల్లా చేతికి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడగా, పవర్ ప్లే పూర్తయ్యే సరికి టీమ్‌ఇండియా 41/2 స్కోరు చేసింది. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్, రాహుల్ జతకలువడం ఇన్నింగ్స్ గతిని మార్చింది. పరుగుల ఖాతా తెరువకముందే అయ్యర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రాహుల్‌ను అండగా చేసుకుంటూ అయ్యర్ ఆకట్టుకున్నాడు. తన దేశవాళీ ఫామ్‌ను కొనసాగిస్తూ రాహుల్ వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు పంపించాడు. మరోవైపు అయ్యర్ కూడా ఓ సిక్స్, ఫోర్‌తో లైన్‌లోకి రావడంతో స్కోరుబోర్డు ఊపందుకుంది. ఈ క్రమంలో 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరయడంతో మూడో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
iyer

అయ్యర్ వీరవిహారం

రాహుల్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్ బాధ్యతను భుజానికెత్తుకున్న అయ్యర్ బ్యాటింగ్‌తో వీసీఏ స్టేడియం హోరెత్తిపోయింది. అఫీఫ్ హుస్సేన్ బౌలింగ్‌లో వరుసగా మూడు కండ్లు చెదిరే సిక్స్‌లతో అయ్యర్ విరుచుకుపడ్డాడు. ఈ ముంబైకర్ బ్యాటింగ్ ధాటికి అప్పటి వరకు పొదుపుగా బౌలింగ్ చేసిన బంగ్లా బౌలర్లు చేష్టలుడిగిపోయారు. వరుస బౌండరీల విజృంభణతో 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అయ్యర్‌కు ఇది తొలి అర్ధశతకం. మరోవైపు పంత్ మరోమారు విఫలమయ్యాడు. సౌమ్య సర్కార్ స్లో బంతికి పంత్ ఆరు పరుగులకే వెనుదిరిగాడు. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మనీశ్ పాండే వచ్చి రావడంతోనే బౌండరీలు బాదడంతో భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోరు దక్కింది.

స్కోరుబోర్డు
భారత్: రోహిత్(సి)షైఫుల్ ఇస్లాం 2, ధవన్(సి)మహ్మదుల్లా(బి)షైఫుల్ 19, రాహుల్(సి)లిటన్ దాస్(బి) హుస్సేన్ 52, అయ్యర్(సి) లిట్టన్(బి) సర్కార్ 62, పంత్(బి)సర్కార్ 6, మనీశ్ పాండే 22 నాటౌట్, శివమ్ దూబే 9 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 174/5; వికెట్ల పతనం: 1-3, 2-35, 3-94, 4-139, 5-144; బౌలింగ్: హుస్సేన్ 4-0-22-1, ఇస్లాం 4-1-32-2, రెహమాన్ 4-0-42-0, అమినుల్ ఇస్లాం 3-0-29-0, సర్కార్ 4-0-29-2, హుస్సేన్ 1-0-20-0.
బంగ్లాదేశ్: లిటన్(సి)సుందర్(బి) చాహర్ 9, నయీమ్ (బి)దూబే 81, సర్కార్(సి)దూబే (బి)చాహర్ 0, మిథున్(సి) రాహుల్(బి) చాహర్ 27, ముష్పీకర్(బి) దూబే 0, మహ్మదుల్లా(బి) చాహల్ 8, హుస్సేన్ (సి&బి) దూబే 0, అమినుల్ ఇస్లాం(బి) చాహర్ 9, రెహమాన్ (సి) అయ్యర్(బి) చాహర్ 1, హుస్సేన్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.2 ఓవర్లలో 144 ఆలౌట్; వికెట్ల పతనం: 1-12, 2-12, 3-110, 4-110, 5-126, 6-126, 7-130, 8-135, 9-144, 10-144; బౌలింగ్: ఖలీల్ 4-0-27-0, సుందర్ 4-0-34-0, చాహర్ 3.2-0-7-6, చాహల్ 4-0-43-1, దూబే 4-0-30-3.

2620

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles