భువీ మ్యాజిక్


Tue,August 13, 2019 02:25 AM

-నాలుగు వికెట్లతో విజృంభణ..
-రెండో వన్డేలో భారత్ ఘన విజయం

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీకి.. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ (4/31) మెరుపులు తోడవడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దుకాగా.. రెండో మ్యాచ్‌లో నెగ్గిన టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ముగిసిన మ్యాచ్‌లో విరాట్ సేన డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 59 పరుగుల తేడాతో గెలుపొందింది. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఇన్నింగ్స్ మధ్యలో రెండుసార్లు వర్షం ఆటంకం కలిగించడంతో టార్గెట్‌ను 46 ఓవర్లలో 270గా సవరించారు. సాధించాల్సిన రనరేట్ ఎక్కువగా లేకున్నా.. ఒత్తిడికి లోనైన విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి చివరకు 42 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. ప్రేక్షకుల స్టాండింగ్ ఓవేషన్ మధ్య 300వ వన్డే బరిలో దిగిన స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (11) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మరో ఓపెనర్ లూయిస్ (65; 8 ఫోర్లు, 1 సిక్సర్), పూరన్ (42) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో షమీ, కుల్దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే బుధవారం ఇక్కడే జరుగనుంది.
Bhuvi

62 పరుగుల్లో 6 వికెట్లు..

లక్ష్య ఛేదనలో విండీస్ ఒక దశలో 148/4తో మెరుగ్గానే కనిపించినా.. భువనేశ్వర్ స్వింగ్‌తో బెంబేలెత్తించడంతో 62 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. కష్టతరం కాని లక్ష్య ఛేదనలో విండీస్‌కు మంచి ఆరంభమే దక్కింది. గేల్, లూయిస్ తొలి వికెట్‌కు 9.3 ఓవర్లలో 45 పరుగులు జోడించారు. ఈ క్రమంలో విండీస్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగానేకాక అత్యధిక పరుగులు (10,353) చేసిన బ్యాట్స్‌మన్‌గానూ గేల్ రికార్డుల్లోకెక్కాడు. అయితే తన సహజ సిద్ధ ఆటతీరు కనబర్చలేకపోయిన గేల్ 24 బంతుల్లో 11 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ షై హోప్ (5) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. క్రీజులో పాతుకుపోయేందుకు యత్నించిన హెట్‌మైర్ (18)ను కుల్దీప్ పెవిలియన్ బాట పట్టించాడు. ఈ దశలో లూయిస్‌కు పూరన్ జతకలిశాడు. ఈ జోడీ సాధికారికంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడంతో విండీస్ విజయంపై ఆశలు పెంచుకుంది. నాలుగో వికెట్‌కు 56 పరుగులు జోడించాక.. లూయిస్‌ను బోల్తాకొట్టించిన కుల్దీప్ ఈ భగస్వామ్యానికి తెరదించాడు. అయితే అసలు దెబ్బ మాత్రం భువనేశ్వర్ కొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కరీబియన్లను విజయానికి దూరం చేశాడు. 35వ ఓవర్ రెండో బంతికి పూరన్‌ను ఔట్ చేసిన భువీ.. ఐదో బంతికి రిటర్న్ క్యాచ్ ద్వారా చెజ్‌కు డగౌట్ దారిచూపి మ్యాచ్‌ను మనవైపు తిప్పాడు. బౌలింగ్ చేసి ఫాలోత్రూలో ఎడమవైపుకు డైవ్ చేస్తూ భువీ అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్. కెప్టెన్ హోల్డర్ (13 నాటౌట్) అజేయంగా నిలిచినా మరో ఎండ్ నుంచి సహకారం అందకపోవడంతో విండీస్ ఓటమి ఖాయమైంది.

ఎంజాయ్ చేయాలనుకుంటా : కోహ్లీ

టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మైదానంలోనూ, బయట ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఇక పార్టీల్లో, ప్రత్యేక సందర్భాల్లో ఎన్నోసార్లు డ్యాన్స్‌లు చేశాడు. ఇటీవలే గయానాలో తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించిన సందర్భంలో వెస్టిండీస్ ఆటగాడు గేల్‌తో కోహ్లీ.. కరీబియన్ పాటకు మైదానంలోనే స్టెప్పులేశాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొట్టింది. ఆ సరదా ఘటనపై చాహల్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ స్పందించాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. సంగీతం విన్నప్పుడల్లా నేను మంచి అనుభూతిని పొందుతా. ప్రతీసారి డ్యాన్స్ చేస్తున్నట్టే ఫీలవుతా. మైదానంలో నేను ఎంజాయ్ చేయాలనుకుంటా. నేను కెప్టెనా.. కాదా అన్నది పట్టించుకోను. దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. దేశం తరఫున ఆడే అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే అవకాశం వచ్చిన చిన్నచిన్న సందర్భాల్లోనూ ఎంజాయ్ చేయడం ఎంతో ముఖ్యమని భావిస్తా అని కోహ్లీ చెప్పాడు. విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వర్షం కారణంగా మొదటిది రద్దు కాగా.. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో కోహ్లీ(120) శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే, తాను 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఎంతో అలిసిపోయినట్టు అనిపించిందని కోహ్లీ చెప్పాడు. అప్పుడు వాతావరణం ఎంతో వేడిగా, ఉక్కపోతగా ఉందని చెప్పాడు. జట్టు అప్పుడున్న పరిస్థితుల కారణంగా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందేనని పట్టుదలతో ముందుకు సాగినట్టు కోహ్లీ వెల్లడించాడు.

బంతి అందుకున్నప్పుడల్లా వీలైనన్ని తక్కువ పరుగులు ఇవ్వాలనుకుంటా. సాధ్యమైనన్ని ఎక్కువ డాట్‌బాల్స్ వేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతా. ఆరంభంలో విండీస్ బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడుతున్నా ఎలాంటి కలవరపాటుకు గురికాలేదు. ఒకటీ రెండు వికెట్లు పడితే తిరిగి మ్యాచ్‌లోకి వస్తామని ముందే తెలుసు. సెంచరీ చేయాలనే విపరీతమైన కసి విరాట్‌లో కనిపించింది. అతడు ఫామ్‌లో లేడని కాదు.. కానీ అతడి స్థాయికి 70, 80 పరుగులు తక్కువగా కనిపిస్తున్నాయి
- భువనేశ్వర్ కుమార్

స్కోరు బోర్డు

వెస్టిండీస్: గేల్ (ఎల్బీ) భువనేశ్వర్ 11, లూయిస్ (సి) కోహ్లీ (బి) కుల్దీప్ 65, హోప్ (బి) ఖలీల్ 5, హెట్‌మైర్ (సి) కోహ్లీ (బి) కుల్దీప్ 18, పూరన్ (సి) కోహ్లీ (బి) భువనేశ్వర్ 42, చేజ్ (సి అండ్ బి) భువనేశ్వర్ 18, హోల్డర్ (నాటౌట్) 13, బ్రాత్‌వైట్ (సి) షమీ (బి) జడేజా 0, రోచ్ (బి) భువనేశ్వర్ 0, కాట్రెల్ (సి) జడేజా (బి) షమీ 17, థామస్ (ఎల్బీ) షమీ 0, ఎక్స్‌ట్రాలు: 21, మొత్తం: 42 ఓవర్లలో 210 ఆలౌట్. వికెట్ల పతనం: 1-45, 2-52, 3-92, 4-148, 5-179, 6-179, 7-180, 8-182, 9-209, 10-210, బౌలింగ్: భువనేశ్వర్ 8-0-31-4, షమీ 8-0-39-2, ఖలీల్ 7-0-32-1, కుల్దీప్ 10-0-59-2, జాదవ్ 5-0-25-0, జడేజా4-0-15-1.

837

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles