ఏక్..దో..తీన్.. 11


Mon,October 14, 2019 01:56 AM

-సొంతగడ్డపై వరుసగా పదకొండో సిరీస్ చేజిక్కించుకుని ప్రపంచ రికార్డు
-రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగులతో టీమ్‌ఇండియా జయభేరి..
-రాణించిన ఉమేశ్, జడేజా

అంచనాలు తప్పలేదు. అద్భుతాలు జరుగలేదు. అంతా అనుకున్నట్లే మరో మ్యాచ్ మిగిలుండగానే టీమ్‌ఇండియా సిరీస్ చేజిక్కించుకుంది. బ్యాట్స్‌మెన్ వీర విజృంభణతో కొండంత స్కోరు చేసిన భారత్.. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదని విరాట్ సేన మరోసారి నిరూపించింది. ఫలితంగా స్వదేశంలో వరుసగా 11 సిరీస్‌లు చేజిక్కించుకొని.. ఆస్ట్రేలియా (10) పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. దశాబ్ద కాలం తర్వాత ఫాలోఆన్ ఆడినదక్షిణాఫ్రికా ఏమాత్రం పోరాటం కనబర్చలేకపోయింది. నాలుగేండ్ల క్రితం డివిలియర్స్, ఆమ్లా, డుమినీతో కూడిన బ్యాటింగ్.. స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్‌ల బౌలింగ్ దళం ఉండి కూడా ఒక్క మ్యాచ్ నెగ్గలేకపోయిన సఫారీలు ఈ సారి ఆ మాత్రం ప్రతిఘటన కూడా లేకుండానే సిరీస్ అప్పగించేశారు.
పుణె: ఊహించిందే జరిగింది. సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది. పర్యటన ఆరంభానికి ముందు గత పర్యటనలో జరిగిన తప్పిదాలను సరిచేసుకొని సత్తాచాటుతాం. సీనియర్లు దూరమైనా యువకులతో కూడిన జట్టు బలంగా ఉందిఅని బీరాలు పలికిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాటలు ఉట్టి నీటి మూటలే అని తేలేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ జయభేరి మోగించిన టీమ్‌ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో సొంతగడ్డపై వరుసగా అత్యధిక టెస్టు సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా (10 టెస్టు సిరీస్ విజయాలు, రెండు సార్లు)ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరింది. బౌలర్లకు విశ్రాంతి నిచ్చేందుకు టీమ్‌ఇండియా ఆదివారం రెండో ఇన్నింగ్స్ బరిలో దిగుతుందని భావిస్తే.. అందుకు భిన్నంగా విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాను ఫాలోఆన్ ఆడించాడు.
TeamIndia

అప్పటికే భారీ టార్గెట్ ఉండటంతో పాటు పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించే అవకాశాలు కనిపించడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సారథి నమ్మకాన్ని నిలబెట్టిన మన బౌలర్లు మూడు సెషన్‌లకు ముందే ప్రత్యర్థిని ఆలౌట్ చేసి జట్టుకు ఇన్నింగ్స్ తేడాతో విజయాన్నందించారు. గత కొంతకాలంగా తుదిజట్టులో స్థానం దక్కక బెంచ్‌కే పరిమితమవుతున్న ఉమేశ్ యాదవ్ (3/22) నిప్పులు చెరిగితే.. రవీంద్ర జడేజా (3/52), అశ్విన్ (2/45) తమకు అలవాటైన రీతిలో తిప్పేశారు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో చివరకు 67.2 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. డీన్ ఎల్గర్ (48) టాప్‌స్కోరర్. ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. 50వ టెస్టుకు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ.. 30వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో 200 పాయింట్లతో భారత్ తన అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో అద్వితీయ ఆటతో అదరగొట్టిన ద్విశతక ధీరుడు కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌అవార్డు దక్కింది. మూడో టెస్టు శనివారం రాంచీలో ప్రారంభం కానుంది.

డుప్లెసిస్ 54 బంతుల్లో.. 5 పరుగులు

తొలి ఇన్నింగ్స్ చివర్లో కాస్త ప్రతిఘటించిన దక్షిణాఫ్రికా.. దశాబ్దం తర్వాత ఫాలోఆన్ ఆడుతూ ఆకట్టుకోలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయిన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (1/17) నాలుగో రోజు రెండో బంతికే మార్క్మ్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని సఫారీల పతనానికి నాంది పలికాడు. నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఎల్గర్‌తో మంతనాలు జరిపిన అనంతరం రివ్యూ కోరకుండానే మార్క్మ్ పెవిలియన్ బాటపట్టాడు. అయితే రిప్లేలో బంతి లెగ్‌స్టంప్ పక్కనుంచి వెళ్తున్నట్లు కనిపించడం మార్క్మ్‌న్రు మరింత బాధపెట్టి ఉంటుంది. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మార్క్మ్ ఖాతా తెరవకుండానే ఔటై పెయిర్‌నమోదు చేసుకున్నాడు. కాసేపటికే సాహా పట్టిన చూడచక్కటి క్యాచ్‌కు డిబ్రుయన్ (8) నిష్క్రమించాడు. ఈ దశలో ఎల్గర్‌తో కలిసి కెప్టెన్ డుప్లెసిస్ (54 బంతుల్లో 5) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. షమీ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టిన ఎల్గర్ జోరు కనబర్చడంతో.. కోహ్లీ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. ఆ మార్పు ఫలితాన్నిచ్చింది. మూడో వికెట్‌కు 49 పరుగులు జోడించాక డుప్లెసిస్‌ను అశ్విన్ వెనక్కిపంపాడు. కాసేపటికే ఎల్గర్‌ను కూడా అతడే ఔట్ చేశాడు.

మళ్లీ విసిగించిన తోక

లంచ్ తర్వాత రెండో ఓవర్‌లో జడేజా.. డికాక్ (5)ను ఔట్ చేయడంతో ప్రొటీస్ సగం వికెట్లు కోల్పోయింది. కొన్ని చక్కటి షాట్లు కొట్టిన బవుమా (38)కు జడ్డూ డగౌట్ దారి చూపితే.. ముత్తుస్వామి (9) కథ షమీ ముగించాడు. ఎదురుదాడికి దిగిన ఫిలాండర్ (37) జడేజా ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. మరో ఎండ్‌లో కేశవ్ మహారాజ్ (22) నుంచి సహకారం అందడంతో టీ విరామానికి దక్షిణాఫ్రికా మరో వికెట్ కోల్పోలేదు. తొలి ఇన్నింగ్స్ మాదిరే క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరూ 8వ వికెట్‌కు 21.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 56 పరుగులు జోడించారు. ఈ దశలో ఉమేశ్ ఒకే ఓవర్‌లో ఫిలాండర్, రబాడ (4)ను ఔట్ చేస్తే.. కేశవ్‌ను వెనక్కి పంపడం ద్వారా జడేజా సఫారీల ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

అందుకే సాహాకు చాన్స్

సిరీస్ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహానే.. భారత్‌లో బంతి ఊహించని రీతిలో దూసుకొస్తుంది కాబట్టి బెస్ట్ కీపర్‌ని ఎంచుకున్నాం. అందుకే పంత్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందిఅని అన్నాడు. ఆ మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తూ.. సాహా పుణెలో చెలరేగిపోయాడు. దాదాపు రెండో స్లిప్ ముందు వరకు డైవ్ కొట్టినా.. లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని అమాంతం దూకి రెప్పపాటులో అందుకున్నా అతడికే చెల్లింది. ఇక సఫారీ సారథి డుప్లెసిస్ క్యాచ్ అందుకున్న తీరైతే అద్భుతం అనక తప్పదు. ప్లెసిస్ బ్యాట్, ప్యాడ్‌కు తాకిన బంతి వికెట్ల ముందు వైపు కింద పడుతున్న సమయంలో ముందుకు డైవ్ చేసిన సాహా మూడు సార్లు ప్రయత్నించి విఫలమై.. చివరిగా నాలుగోసారి బంతి నేలకు తాకేందుకు అర క్షణం ముందు అందుకొని సాహో అనిపించుకున్నాడు.

అగ్రస్థానం మనదే..

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. వెస్టిండీస్ టూర్‌తో ప్రారంభమైన భారత విజయాల జోరు.. సొంతగడ్డపై మరింత పదునెక్కిం ది. కరీబియన్ గడ్డపై రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా 120 పాయింట్లు ఖాతాలో వేసుకోగా.. తాజా సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గి పాయింట్ల సంఖ్యను 200 కు పెంచుకుంది. ప్రస్తుతం పట్టికలో రెం డో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ (60) కంటే భారత్ 140 పాయింట్ల ఆధిక్యంలో ఉంది.
SAHA

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆడే ప్రతిమ్యాచ్ కీలకమే. అది సొంతగడ్డపై అయినా.. విదేశాల్లోనైనా పాయింట్లు సమానమే. మూడో టెస్టులోనూ ఇదే తీవ్రత కొనసాగిస్తాం. రిలాక్స్ అయ్యే ప్రసక్తే లేదు. జోరు కనబరుస్తూ సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడమే మా ముందున్న లక్ష్యం. నాలుగైదేండ్లుగా మా అందరిలో గెలవాలన్న కసి పెరిగింది. అందుకు తగ్గట్లే చక్కటి బృందం కుదిరింది. తొలి ఇన్నింగ్స్‌లో రహానేతో కలిసి జోడించిన భాగస్వామ్యమే మ్యాచ్‌ను మనవైపు మొగ్గేలా చేసింది.
- విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్

-కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాల సంఖ్య. 50 టెస్టులకు సారథ్యం వహించిన విరాట్ విజయవంతమైన కెప్టెన్‌ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. తొలి 50 టెస్టుల్లో స్టీవ్ వా 37, రికీ పాంటింగ్ 35 విజయాలతో కోహ్లీ కంటే ముందున్నారు.
-దక్షిణాప్రికాపై భారత్‌కిదే భారీ విజయం. 2009-10 కోల్‌కతా టెస్టులో ఇన్నింగ్స్ 57 పరుగులతో సఫారీలపై గెలిచిన టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 137 పరుగులతో ప్రొటీస్‌ను చిత్తుచేసింది.
-ఈ దశాబ్దంలో దక్షిణాఫ్రికా రెండు సార్లు ఇన్నింగ్స్ పరాభవాలు చవిచూసింది. ఆ రెండు భారత్ చేతిలోనే కావడం విశేషం.
-సొంతగడ్డపై భారత్ సాధించిన వరుస సిరీస్‌ల సంఖ్య. టెస్టు క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధికం. గతంలో ఆస్ట్రేలియా రెండుసార్లు (1994-2001, 2004-2008 మధ్య) వరుసగా 10 టెస్టు సిరీస్ విజయాలు సాధించింది.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 601/5 డిక్లేర్డ్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 275, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్మ్ (ఎల్బీ) ఇషాంత్ 0, ఎల్గర్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 48, డిబ్రుయన్ (సి) సాహా (బి) ఉమేశ్ 8, డుప్లెసిస్ (సి) సాహా (బి) అశ్విన్ 5, బవుమా (సి) రహానె (బి) జడేజా 38, డికాక్ (బి) జడేజా 5, ముత్తుస్వామి (సి) రోహిత్ (బి) షమీ 9, ఫిలాండర్ (సి) సాహా (బి) ఉమేశ్ 37, మహారాజ్ (ఎల్బీ) జడేజా 22, రబాడ (సి) రోహిత్ (బి) ఉమేశ్ 4, నోర్జె (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 67.2 ఓవర్లలో 189. వికెట్ల పతనం: 1-0, 2-21, 3-70, 4-71, 5-79, 6-125, 7-129, 8-185, 9-189, 10-189, బౌలింగ్: ఇషాంత్ 5-2-17-1, ఉమేశ్ 8-3-22-3, షమీ 9-2-34-1, అశ్విన్ 21-6-45-2, జడేజా 21.2-4-52-3, రోహిత్ 2-0-4-0, కోహ్లీ 1-0-4-0.

1219

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles