జయం మనదే


Mon,June 10, 2019 02:36 AM

-ఆసీస్‌కు రిటర్న్ గిఫ్ట్
-కంగారూలను దంచేశారు
-వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో భారత్ విజయదుందుభి
-శతక్కొట్టిన ధవన్.. పాండ్యా, ధోనీ ధనాధన్
-విజృంభించిన బుమ్రా, భువీ
-గత ప్రపంచకప్ ఓటమికి బదులు తీర్చుకున్న భారత్
-మెరిసిన కోహ్లీ, రోహిత్, భువనేశ్వర్
విశ్వసమరంలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను భారత ఆటగాళ్లు బెంబేలెత్తించారు. గత మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ విజృంభిస్తే.. ఈసారి నా వంతు అంటూ గబ్బర్ గర్జించాడు. పరుగుల యంత్రం విరాట్ మరోసారి మాస్టర్ క్లాస్ నిలకడ ప్రదర్శిస్తే.. ధోనీ, పాండ్యా తమ బ్యాట్ పవర్ చూపెట్టారు. ఛేజింగ్‌లో వార్నర్, స్మిత్ భయపెట్టినా.. స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్, యార్కర్ కింగ్ బుమ్రా విజృంభించడంతో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకొని పట్టికలో మూడో స్థానానికి చేరింది. విజయగర్వంతో విర్రవీగుతున్న ఆసీస్‌ను నేలకు దించింది. పనిలోపనిగా గత వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఎదురైన పరాజయానికి చక్కటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి టైటిల్ నెగ్గేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. కంగారూలపై టీమ్‌ఇండియాకు ఇది 50వ విజయం కావడం మరో విశేషం.
ViratKohli
లండన్: ప్రపంచకప్ వేదికపై కీలకమైన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ నెగ్గితే చాలు వరల్డ్‌కప్ సొంతమైనట్టే.. ప్రత్యర్థులందరిలోకెళ్లా ప్రమాదకరమైన ఆసీస్‌ను మట్టికరిపిస్తే ఇక ఎదురులేనట్టే.. అనే అంచనాల మధ్య బరిలోదిగిన భారత్ అందుకు తగ్గట్లే విజృంభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 36 పరుగుల తేడాతో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై గెలిచించింది. బ్యాట్స్‌మెన్ సమష్టిగా కదం తొక్కడంతో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసింది.

శిఖర్ ధవన్ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగితే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో అదరగొట్టారు. చివర్లో హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోనీ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ (56; 5 ఫోర్లు), స్మిత్ (69; 5 ఫోర్లు, 1 సిక్స్), కారీ (55; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. భువనేశ్వర్, బుమ్రాకు చెరో 3 వికెట్లు దక్కాయి. సెంచరీ హీరో ధవన్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

kohli-dhawan

ధనాధన్ ధవన్

టాస్ నెగ్గిన కోహ్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం సరైందేనని ఓపెనర్లు నిరూపించారు. నిలదొక్కుకునేంత వరకు నెమ్మదిగా ఆడిన రోహిత్, ధవన్ ఆ తర్వాత విజృంభించారు. ఆసీస్ పేసర్లు స్టార్క్, కమ్మిన్స్ ఆరంభంలో కట్టుదిట్టమైన బంతులతో కట్టిపడేయడంతో 7 ఓవర్లు ముగిసేసరికి భారత్ 22 పరుగులే చేసింది. ఆ తర్వాత జూలు విదిల్చిన ధవన్ హ్యాట్రిక్ ఫోర్లతో జోరు పెంచాడు. ఇక అక్కడి నుంచి మొదలైన విరాట్ గ్యాంగ్ దంచుడు.. అంతకంతకూ పెరుగుతూ వెళ్లింది. 53 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ధవన్ ఆ తర్వాత మరింతగా చెలరేగిపోతే.. ఆసీస్‌పై అత్యతం వేగంగా 2000 రన్స్ కొట్టిన రోహిత్ శర్మ వన్డేల్లో 42వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాక ఔటయ్యాడు. అయినా కెప్టెన్ విరాట్‌తో కలిసి ధవన్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో ఐసీసీ టోర్నీల్లో ఆరో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ప్రమాదకరంగా మారిన శిఖర్‌ను స్టార్క్ పెవిలియన్ పంపాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 93 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Rohit-sharma

10 ఓవర్లలో 116

అప్పటి వరకు బాల్‌కో రన్ చొప్పున సాగిన ఇన్నింగ్స్‌లో పాండ్యా ఊపుతెచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు మ్యాక్స్‌వెల్ ఓవర్‌లో సిక్సర్‌తో మోత మొదలెట్టాడు. 50వ అర్ధశతకం పూర్తిచేసుకున్న కోహ్లీ కూడా దూకుడు పెంచడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఎడాపెడా బౌండ్రీలు బాదిన పాండ్యా జట్టు స్కోరు 300 దాటాక ఔటైనా.. ఆ తర్వాత ధోనీ విరుచుకుపడటంతో స్కోరుకు బ్రేక్ పడలేదు. ఒక దశలో సెంచరీ పూర్తి చేసుకునేలా కనిపించిన కోహ్లీ చివరి ఓవర్లలో పాండ్యా, ధోనీకి ఎక్కువగా స్ట్రయికింగ్ ఇచ్చాడు. తనదైన శైలిలో రెచ్చిపోయిన మాజీ కెప్టెన్ ఆఖరి ఓవర్ తొలి బంతికి ఫాలోత్రూలో స్టొయినిస్ పట్టిన కండ్లు చెదిరే క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. కోహ్లీ కూడా అదే ఓవర్‌లో ఔటైనా.. రాహుల్ (3 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) జట్టు స్కోరును 350 దాటించాడు. 40 ఓవర్లు ముగిసేసరికి 236/2తో ఉన్న విరాట్ సేన చివరి 10 ఓవర్లలో 116 పరుగులు పిండుకోవడం విశేషం. ఆసీస్ బౌలర్లలో స్టొయినిస్‌కు 2, కమ్మిన్స్, స్టార్క్, కౌల్టర్‌నైల్‌కు తలా ఓ వికెట్ దక్కింది.

Dhoni

ధోనీ బలిదాన్ తీసేసి..

మాజీ కెప్టెన్, వరల్డ్ బెస్ట్ ఫినిషర్ మహేంద్రసింగ్ ధోనీ క్రీజులోకి రాగానే ప్రసార మాధ్యమాల్లో హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టే దృష్యాలు కనువిందు చేశాయి. అందుకు తగ్గట్లే అతడు భారీ షాట్లతో విరుచుకుపడటంతో స్టేడియానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భారత అభిమానులు పండుగ చేసుకున్నారు. కాగా.. ధోనీ ఈ మ్యాచ్‌లో బలిదాన్ గ్లౌవ్స్‌ను పక్కన పెట్టి బరిలో దిగాడు. తీవ్ర చర్చకు దారితీసిన ఈ గ్లౌవ్స్ ధరించేందుకు ఐసీసీ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

Pandya

పవర్‌ఫుల్ పాండ్యా..

ఇదే పిచ్‌పై చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సహచరులంతా విఫలమైనా.. దాయాది పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టించిన హార్దిక్ పాండ్యా మరోసారి తన బ్యాట్ పవర్ చూపాడు. అప్పటికే భారీస్కోరుకు గట్టి పునాది పడటంతో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కుంగ్‌ఫూ పాండ్యా తనకే సాధ్యమయ్యే షాట్లతో విరుచుకుపడ్డాడు. నైల్, కమ్మిన్స్, జంపాల బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ బాదిన పాండ్యా చూస్తుండగానే అర్ధశతకానికి చేరువయ్యాడు. నైల్ వేసిన 42 ఓవర్ చివరి బంతికి బౌలర్ తలమీదుగా అతడు కొట్టిన బౌండ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒంట్లో ఉన్న బలాన్నంతా భుజాల్లోకి తీసుకొచ్చి అతడు కొట్టిన షాట్‌కు బౌలర్ అడ్డుతప్పుకున్నాడంటే బంతి ఎంత వేగంగా దూసుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

Smith

కంగారెత్తించిన ఆసీస్

భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఆసీస్ ఆచితూచి ఇన్నింగ్స్ ఆరంభించింది. 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 29/0తో నిలిచింది. పాండ్యా వేసిన పదో ఓవర్‌లో వార్నర్ ఫోర్, ఫించ్ 6,4,4తో విరుచుకుపడటంతో 19 పరుగులు వచ్చాయి. తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాక ఫించ్ (36; 3 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అర్ధ శతకం అనంతరం వార్నర్ కూడా ఔటైనా.. ఖవాజా (42; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. జట్టు స్కోరును 200 దాటించాక ఖవాజా ఔటైనా.. మ్యాక్స్‌వెల్ జతగా స్మిత్ రెచ్చిపోయాడు.

భువీ డబుల్ ధమాకా..

39 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 235/3. గెలువాలంటే 66 బంతుల్లో 118 పరుగులు చేయాలి. స్మిత్, మ్యాక్స్‌వెల్ (14 బంతుల్లో 28; 5 ఫోర్లు) అదరగొడుతున్నారు. స్టొయినిస్ (0) , కారీ బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో ఆస్ట్రేలియా పోటీలోనే ఉంది. కానీ 40 ఓవర్ వేసిన భువీ గేమ్ చేంజ్ చేశాడు. జోరుమీదున్న స్మిత్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న భువనేశ్వర్.. చివరి బంతికి స్టొయినిస్‌ను బౌల్డ్ చేశాడు. మరుసటి ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ కూడా ఔటవడంతో మ్యాచ్‌పై ఆసీస్ ఆశలు వదులుకుంది.

6

-ఐసీసీ టోర్నీల్లో రోహిత్-ధవన్ జంటకు ఇది ఆరో సెంచరీ భాగస్వామ్యం. గిల్‌క్రిస్ట్, హెడెన్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

-ఐసీసీ టోర్నీల్లో ధవన్ శతకాల సంఖ్య. సచిన్, గంగూలీ చెరో 7 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. పాంటింగ్ , సంగక్కరతో కలిసి ధవన్ రెండో స్థానంలో నిలిచాడు.

1

ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా భారత్ అగ్రస్థానానికి చేరింది. ధవన్ సెంచరీతో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్ శతకాల సంఖ్య 27కు చేరింది. ఆసీస్ (26 సెంచరీలు) రెండో స్థానంలో ఉంది.

స్కోరు బోర్డు

భారత్: రోహిత్ (సి) కారీ (బి) కౌల్టర్‌నైల్ 57, ధావన్ (సి) (సబ్) లైయన్ (బి) స్టార్క్ 117, కోహ్లీ (సి) కమ్మిన్స్ (బి) స్టొయినిస్ 82, పాండ్యా (సి) ఫించ్ (బి) కమిన్స్ 48, ధోనీ (సి అండ్ బి) స్టొయినిస్ 27, రాహుల్ (నాటౌట్) 11, జాదవ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 50 ఓవర్లలో 352/5. వికెట్ల పతనం: 1-127, 2-220, 3-301, 4-338, 5-348, బౌలింగ్: కమ్మిన్స్ 10-0-55-1, స్టార్క్ 10-0-74-1, కౌల్టర్‌నైల్ 10-1-63-1, మ్యాక్స్‌వెల్ 7-0-45-0, జంపా 6-0-50-0, స్టొయినిస్ 7-0-62-2.

ఆస్ట్రేలియా: వార్నర్ (సి) భువనేశ్వర్ (బి) చహల్ 56, ఫించ్ (రనౌట్) 36, స్మిత్ (ఎల్బీ) భువనేశ్వర్ 69, ఖవాజా (బి) బుమ్రా 42, మ్యాక్స్‌వెల్ (సి) (సబ్) జడేజా (బి) చహల్ 28, స్టొయినిస్ (బి) భువనేశ్వర్ 0, కారీ (నాటౌట్) 55, కౌల్టర్‌నైల్ (సి) కోహ్లీ (బి) బుమ్రా 4, కమ్మిన్స్ (సి) ధోనీ (బి) బుమ్రా 8, స్టార్క్ (రనౌట్) 3, జంపా (సి) (సబ్) జడేజా (బి) భువనేశ్వర్ 1, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 50 ఓవర్లలో 316 ఆలౌట్. వికెట్ల పతనం: 1-61, 2-133, 3-202, 4-238, 5-238, 6-244, 7-283, 8-300, 9-313, 10-316, బౌలింగ్: భువనేశ్వర్ 10-0-50-3, బుమ్రా 10-1-61-3, పాండ్యా 10-0-68-0, కుల్దీప్ 9-0-55-0, చహల్ 10-0-62-2, జాదవ్ 1-0-14-1.1

table1

2413

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles