హైదరాబాద్‌షా ఎవరో?


Fri,October 12, 2018 12:28 AM

నేటి నుంచి భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్
క్లీన్‌స్వీప్‌పై టీమ్‌ఇండియా దృష్టి
హోల్డర్, రోచ్ రాకతో పుంజుకున్న కరీబియన్లు

నవరాత్రి వెలుగులు.. ఎన్నికల జాతరతో.. కొత్త శోభ నింపుకున్న భాగ్యనగరానికి మరో పండుగ వచ్చేసింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. లెక్కేసి కొడితే.. మూడే మూడు రోజుల్లో తొలి టెస్ట్‌ను రికార్డు విజయంతో దక్కించుకున్న టీమ్‌ఇండియా ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై దృష్టిసారించగా, లెక్క సరిచేయాలనే ఏకైక లక్ష్యంతో విండీస్ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. పేరు, స్థాయి సమానమే అయినా... ఆటతీరులో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా కలిగిన ఇరుజట్లలో గెలిచేదెవరు..? గతానికి ఏమాత్రం తగ్గకుండా ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేస్తున్న విరాట్ వీరులు భాగ్యనగరంలోనూ
బాద్‌షాగా నిలుస్తారా..? సీనియర్ల రాకతో పుంజుకున్న కరీబియన్లు భారత్‌లో కనీసం ఒక్క టెస్ట్ అయినా గెలిచామన్న రికార్డునైనా సాధిస్తారా..? తేలాలంటే ఆటను ఆసక్తిగా చూడాల్సిందే..!

kohli
తనదైన రోజున ఎవడైనా ఆడుతాడు. కానీ... తనది కానీ రోజున కూడా ఆడాలి. అప్పుడే ఎలాంటి జట్టునైనా ఓడించొచ్చు... ఈ సూత్రాన్ని ఒంటబట్టించుకోవాలని చూస్తున్న వెస్టిండీస్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఉప్పల్‌లో జరిగే రెండో టెస్ట్‌లో పటిష్ఠమైన భారత్‌కు చెక్ పెట్టాలని శతధా ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత మ్యాచ్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ పోరును తాజాగా ప్రారంభించాలని భావిస్తున్న కరీబియన్లు మైదానంలో ఎలా ఆడుతారన్నది ఆసక్తికరం. మరోవైపు రాజ్‌కోట్ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్న టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టింది. స్క్రిప్ట్‌లో ఏమాత్రం తేడా లేకుండా వీలైతే ఒకేసారి భారీ స్కోరుతో మూడు రోజుల్లోనే ముగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఏ అంశాల్లో తీసుకున్న ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ విరాట్‌సేన కావడంతో విజయం కూడా నల్లేరు మీద నడకే అని అభిమానులు భావిస్తున్నారు. 2011, 2013లో భారత్ రెండుసార్లు 2-0తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. 2013లో అయితే రెండు మ్యాచ్‌లనూ మూడు రోజుల్లోనే ముగించింది. ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని విరాట్‌సేన ఉవ్విళ్లూరున్నది.

teamindia2

సిరాజ్, విహారికి నో చాన్స్


ఈ మ్యాచ్‌కు కూడా ఒక రోజు ముందుగానే 12 మంది జట్టును ప్రకటించి టీమ్‌ఇండియా కొత్త సంప్రాదాయాన్ని కొనసాగించింది. అయితే గత మ్యాచ్ తుది జట్టును యధావిధిగా దించడంతో స్థానిక ఆటగాళ్లు సిరాజ్, హనుమ విహారికి ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవడం భాగ్యనగర వాసులను కాస్త నిరాశకు గురి చేసింది. 42 టెస్ట్‌ల తర్వాత విరాట్ తుది జట్టును మార్చకుండా దించడం ఇది రెండోసారి. ఆసీస్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని లోకేశ్ రాహుల్‌కు మరో అవకాశమిచ్చింది. ఈ ఏడాది రాహుల్ 16 మ్యాచ్‌లు ఆడితే 14సార్లు విఫలమైనా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాత్రం ఈ ఓపెనర్‌కే మద్దతిచ్చాడు. పృథ్వీ షా మరో శతకంపై కన్నేశాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే కంగారూలతో తొలి టెస్టులో ఈ ద్వయమే ఓపెనింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పుజార మెరుగ్గా ఆడుతున్నా.. వైస్ కెప్టెన్ రహానే ఫామ్ ఆందోళన కలిగిస్తున్నది. ఈ ముంబైకర్ సెంచరీ చేయక 14 నెలలైంది. 2017లో లంకపై చివరి శతకం చేశాడు. రోహిత్ శర్మ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న ఇతనికి ఈ మ్యాచ్ చావో..రేవో అని చెప్పొచ్చు. రిషబ్ పంత్ నిలకడగా ఆడుతున్నా భారీ స్కోర్లుగా మల్చడంపై దృష్టిపెట్టాలి. సెంచరీకి ముందు అనవసర ఒత్తిడితో వికెట్ పారేసుకోవడం అలవాటుగా మారితే ప్రమాదమే. ఇక వికెట్ల వెనుకాల కూడా మెరుగైన ప్రదర్శన చూపాల్సిందే. ఆల్‌రౌండ్ పాత్రను జడేజా సమర్థంగా పోషిస్తున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా లేని లోటు కనిపించడం లేదు. బౌలింగ్‌లో ఉమేశ్, షమీ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ముగ్గురు స్పిన్నర్లకు కట్టుబడితే కుల్దీప్ తుది జట్టులో ఉంటాడు. ఒకవేళ పిచ్ పేస్‌కు అనుకూలిస్తే 12వ ఆటగాడిగా శార్దూల్‌కు అవకాశం దక్కొచ్చు.

హోల్డర్, రోచ్ వచ్చినా..


తొలి టెస్ట్ మాదిరిగా కాకుండా కనీసం ఈ మ్యాచ్‌లో కొంతైనా పోటీ ఇవ్వాలని విండీస్ భావిస్తున్నది. దీంతో జట్టును బలోపేతం చేసేందుకు సీనియర్లను బరిలోకి దించుతున్నది. 100 శాతం ఫిట్‌నెస్ లేకపోయినా కెప్టెన్ హోల్డర్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. అయితే గాబ్రియెల్‌తో కలిసి కొత్త బంతిని ఎంతవరకు పంచుకోగలడన్నది సందేహంగా మారింది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లి వచ్చిన కీమర్ రోచ్ అందుబాటులో ఉండనున్నాడు. గత మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కనీసం 100 ఓవర్లు కూడా ఆడకపోవడం విమర్శలకు దారి తీసిన నేపథ్యంలో బ్యాటింగ్‌లో సత్తా చాటాలని బలంగా కోరుకుంటున్నది. ఓపికను చూపాల్సిన చోట పెవిలియన్‌కు క్యూ కట్టిన కరీబియన్లు కనీసం హైదరాబాద్‌లోనైనా నిలబడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పావెల్, చేజ్ మినహా మిగతా వారందరూ గాడిలో పడితేనే ఈ మ్యాచ్‌లో భారత్‌కు పోటీ ఇవ్వడం సాధ్యమవుతుంది. కొద్దిగా పిచ్ నుంచి సహకారం అందినా.. ఒకరిద్దరు కుదురుకున్నా భారీ స్కోర్లు చేయడంలో దిట్ట అయిన విండీస్ బ్యాట్స్‌మెన్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడితే బాగుంటుంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే దూకుడు ఒక్కటే కాదు.. టెక్నిక్ కూడా చాలా అవసరం. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎక్కువ మందిలో టెక్నిక్ కొరవడింది. ఓవరాల్‌గా బౌలింగ్‌నే ఎక్కువగా నమ్ముకుంటున్న విండీస్ బ్యాటింగ్‌లోనూ శక్తికి మించి రాణిస్తేనే కనీసం పోటీ ఇవ్వగలుగుతుంది. లేదంటే రాజ్‌కోట్ బాటలోనే మరో ఓటమికి క్యూ కడుతుంది.

teamwest
భారత్ నంబర్‌వన్ జట్టు. అందులోనూ వాళ్ల సొంతగడ్డపై తలపడుతున్నాం. 1994 నుంచి మేం ఇక్కడ టెస్ట్ సిరీస్ గెలువలేదు. చరిత్ర చెబుతున్న సత్యాలివి. లారా, ఇతర దిగ్గజాలు కూడా ఇక్కడ సిరీస్ గెలువలేకపోయారు. అప్పట్నించి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం. గెలుపోటములను పక్కనబెడితే గట్టిపోటీ ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో మేం అది చేయాలనుకుంటున్నాం.
- హోల్డర్ (విండీస్ కెప్టెన్)

ఇది రెండు మ్యాచ్‌ల సిరీస్ కావడంతో పుంజుకోవడానికి విండీస్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మరో ప్రత్యామ్నాయం లేదు. మేం అప్రమత్తంగా లేకపోతే చాలా కష్టం. కచ్చితంగా వాళ్లు గట్టిపోటీ ఇస్తారని నమ్ముతున్నా. కఠిన పరిస్థితులు ఎదురైనా మా ప్రణాళికలకు మేం కట్టుబడితే చాలు. ఆలోచనాత్మక క్రికెట ఆడితే సరిపోతుంది. అలసత్వానికి ఎలాంటి తావు ఇవ్వొద్దు.
- విరాట్ కోహ్లీ (భారత్ కెప్టెన్)

9భారత్‌తో ఆడిన గత మూడు టెస్ట్‌లను విండీస్ తొమ్మిది రోజుల్లోనే చేజార్చుకుంది. కేవలం 720.5 ఓవర్లు మాత్రమే ఆడి.. మూడు మ్యాచ్‌ల్లోనూ ఇన్నింగ్స్
పరాజయాలను మూటగట్టుకుంది.

82016 నుంచి భారత్ ఎనిమిదిసార్లు 600ల స్కోరును సాధించింది. మిగతా అన్ని జట్లు చేసిన దానికంటే టీమ్‌ఇండియా రెండుసార్లు ఎక్కువగా చేసింది.

337

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles