వేటాడాల్సిందే..


Thu,November 14, 2019 12:47 AM

మరో సిరీస్‌పై కన్నేసిన కోహ్లీసేన..
భారత్, బంగ్లా తొలి టెస్టు నేటి నుంచే..

virat

32 టెస్టులు.. 26 విజయాలు.. 5 డ్రాలు.. ఒక పరాజయం..

ఇదీ 2013 నుంచి సొంతగడ్డపై భారత టెస్టు రికార్డు. స్వదేశంలో వరుస విజయాలతో దుమ్మురేపుతూ.. అలుపెరుగక 11 సిరీస్‌లు చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. ఆ సంఖ్యను డజనుకు పెంచుకోవడానికి రెడీ అవుతున్నది. ఇటీవల దక్షిణాఫ్రికాను చీల్చిచెండాడిన విరాట్ సేన.. బంగ్లా పులుల భరతం పట్టేందుకు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రారంభమైనప్పటి నుంచి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 240 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ అండ్ కో..మరో 120 పాయింట్లు ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతుంటే.. బంగ్లా మాత్రం భారత్ జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తున్నది. షకీబ్ జట్టుకు దూరం కావడంతో ఇద్దరు ప్లేయర్ల సేవలను కోల్పోయినట్లుందని ముందే చేతులెత్తేసే మాటలు మాట్లాడుతున్న బంగ్లా.. అసలు పోరులో ఏ మాత్రం పోటీనిస్తుందో చూడాలి.ఇండోర్: సంప్రదాయ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న టీమ్‌ఇండియా పొరుగు దేశంతో పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఇక్కడి హోల్కర్ స్టేడియంలో బంగ్లాతో తొలి టెస్టు ప్రారంభం కానుంది.సఫారీలను సఫా చేసిన కోహ్లీ కుర్రాళ్లు.. మరో సిరీస్‌ను చేజిక్కించుకోవాలనే కసి మీద ఉంటే.. సుదీర్ఘ ఫార్మాట్‌లో తమదైన ముద్ర వేసేందుకు బంగ్లా పులులు ప్రయత్నిస్తున్నాయి. టెస్టు క్రికెట్‌లో ఓపెనర్ అవతారమెత్తిన రోహిత్ శర్మ.. వరుస సెంచరీలతో శివాలెత్తుతుంటే.. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మంచి దూకుడు మీదున్నాడు. ఇతర ఫార్మాట్‌లలో కోహ్లీ కెప్టెన్సీపై ఎలాంటి అనుమానాలున్నా.. టెస్టుల విషయానికి వచ్చేసరికి టీమ్‌ఇండియా ది బెస్ట్ కెప్టెన్ అతడే అనేది నిర్వివాదాంశం. పొట్టి సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్ 31వ పడిలో అడుగుపెట్టాక తొలిసారి గ్రౌండ్‌లో దిగనున్నాడు.

గత రెండు వారాలుగా సతీమణితో కలిసి విహారయాత్రల్లో మునిగిపోయిన కోహ్లీ.. మైదానంలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. మరి ఇలాంటి భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్‌ఇండియాకు.. బంగ్లా ఏ మాత్రం పోటీనిస్తుందో చూడాలి. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు జరిగితే.. అందులో ఏడింట భారత్‌నే విజయం వరించింది. మరో రెండు టెస్టులు డ్రాఅయ్యాయి. అయితే కీలక ఆటగాళ్లు దూరమైన బంగ్లా.. ఈ రికార్డును మెరుగు పరుచుకుంటుందనే నమ్మకమైతే లేదు కానీ.. గతంలోలానే పోరాట పటిమ చూపుతుందా చూడాలి. ఈ ఫార్మాట్‌లో అత్యంత నిలకడైన ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. అయితే బలహీన ప్రత్యర్థే అని కొట్టిపారేస్తే.. పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు దీటుగా బదులిచ్చిన బంగ్లా టైగర్స్ టెస్టుల్లోనూ ప్రమాదకరంగా పరిణమించొచ్చు.
india

ఆపగలరా..!

భారీ స్కోర్లకు పెట్టింది పేరైన భారత పిచ్‌లపై టీమ్‌ఇండియా లైనప్‌ను ఆపడం బంగ్లా బౌలర్లకు శక్తికి మించిన పనే అని చెప్పాలి. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ మంచి ఊపు మీద ఉన్నారు. ఇటీవల సఫారీలపై వీరిద్దరూ చెరో డబుల్ సెంచరీ బాది వారెవ్వా అనిపించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ బౌలింగ్ లైనప్ ఉన్న ప్రొటీస్‌పైనే చెలరేగిపోయిన ఈ ద్వయం మరి అంతగా ప్రభావం చూపలేని బంగ్లా పేసర్లను ఎలా ఆడుకుంటుందో చూడాలి. మూడో స్థానంలో అభినవ డిపెండబుల్ పుజారా ఉండనే ఉన్నాడు. దక్షిణాఫ్రికాపై రెండు అర్ధసెంచరీలు సాధించిన పుజ్జీ.. శతకాల కరువు తీర్చుకునేందుకు ఇదే సరైన తరుణం. నాలుగో స్థానంలో నయా దేవుడు విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ఉప సారథి అజింక్యా రహానేతో బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది.

ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్ అని కోహ్లీ నుంచి మన్ననలు అందుకున్న వృద్ధిమాన్ సాహా.. తన సత్తా ఏంటో సఫారీలపై చూపెట్టాడు. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా పక్కా కాగా.. మరో స్పిన్నర్‌గా సీనియర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు ఖాయమే. సొంతగడ్డపై ప్రమాదకరమైన అశ్విన్-జడ్డూ జోడీని బంగ్లా ఆటగాళ్లు ఎలా ఎదుర్కుంటారో చూడాలి. ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకున్నా.. భారత పేస్ దళం పటిష్ఠంగానే ఉంది. మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ దూకుడు మీదున్నారు. రెండో ఇన్నింగ్స్‌ల్లో ప్రత్యర్థిని గడగడ లాడిస్తున్న షమీతో బంగ్లాకు కష్టాలు తప్పకపోవచ్చు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి ఇష్టపడని కోహ్లీ సఫారీలతో ఆడిన జట్టుతోనే బరిలో దిగొచ్చు. అనూహ్య మార్పులను ఆశించలేం. దీంతో గిల్, పంత్‌కు నిరీక్షణ తప్పకపోవచ్చు.

ముగ్గురిపైనే భారం

స్టార్లతో నిండి ఉన్న భారత బ్యాటింగ్ లైనప్‌కు అడ్డుకట్ట వేయాలంటే.. ముస్తఫిజుర్ రహ్మన్, మెహదీ హసన్, తైజుల్ ఇస్లామ్‌తో కూడిన బంగ్లా బౌలింగ్ దళం మెరుపు ప్రదర్శనలు చేయకతప్పదు. ముస్తఫిజుర్ బౌలింగ్‌లో ఒకప్పటి వాడిలేదనే విషయం పొట్టి ఫార్మాట్‌లోనే అర్థంకాగా.. మెహదీ, తైజుల్ మనవాళ్లను ఏ మేరకు ఇబ్బంది పెడతారో చూడాలి. బ్యాటింగ్‌లో కెప్టెన్ మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, మహ్ముదుల్లాపైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. తమీమ్, షకీబ్, మొసద్దిక్ గైర్హాజరీలో కొత్త కుర్రాళ్లు సత్తాచాటాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తున్నది.

అచ్చొచ్చిన ఇండోర్..

హోల్కర్ స్టేడియం భారత్‌కు అచ్చొచ్చిన స్టేడియం అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌పై (2016) కోహ్లీసేన 321 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే మ్యాచ్‌లో రహానే టెస్టు క్రికెట్‌లో తన కెరీర్ బెస్ట్ స్కోరు చేశాడు. అశ్విన్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది కూడా ఇక్కడే. కివీస్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 140 పరుగులిచ్చి 13 వికెట్లు తీశాడు.

పిచ్, వాతావరణం

ఇండోర్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. బౌన్స్‌తో కూడిన వికెట్‌పై పరుగుల వరద పారొచ్చు.. ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు.

తుదిజట్లు (అంచనా)

భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజార, రహానే, జడేజా, సాహా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, షమీ.
బంగ్లాదేశ్: మోమినుల్ (కెప్టెన్), షాద్‌మన్, సైఫ్/ఇమ్రుల్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, మిథున్, లిటన్, మెహదీ, తైజుల్, అబు జాయెద్, ముస్తఫిజుర్/ఇబాదత్.
bangla
నా వరకైతే ముగ్గురు ప్లేయర్లు జట్టుకు దూరమైనట్లు అనిపిస్తున్నది. ఎందుకంటే షకీబ్ భాయ్ ఇద్దరు ప్లేయర్లతో సమానం. మాపై ఎలాంటి అంచనాలు లేవు. అందుకే ఒత్తిడి లేదు. మంచి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. కెప్టెన్సీ నా బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందనుకోవడం లేదు. సొంతగడ్డపై టీమ్‌ఇండియా లాంటి పటిష్ఠ జట్టుపై పైచేయి సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం కష్టమే అయినా మేము అందుకు సిద్ధంగానే ఉన్నాం.
- మోమినుల్ హక్, బంగ్లాదేశ్ కెప్టెన్

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. బంగ్లాదేశ్ మంచి క్రికెట్ ఆడుతున్నది. ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. అయినా మాకు ప్రత్యర్థితో సంబంధం లేదు. మ్యాచ్‌లు గెలువడమే ముఖ్యం. ఇటీవల దక్షిణాఫ్రికాపై మంచి ప్రదర్శన చేశాం. దాన్నే కొనసాగించాలనుకుంటున్నాం. వరుస విజయాల వెనుక బౌలర్ల కృషి చాలా ఉంది. బుమ్రా ఫిట్‌గా లేడు. షమీ, ఉమేశ్, ఇషాంత్ పేస్ భారాన్ని మోస్తారు.
- విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్

2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన టీమ్‌ఇండియా 240 పాయింట్లు ఖాతాలో వేసుకొనిఅగ్రస్థానంలో ఉంది.

టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరేందుకు రహానేకు అవసరమైన పరుగులు 25

ఈ స్టేడియంలో ఇప్పటి వరకు జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌పై (2016) కోహ్లీసేన 321 పరుగుల తేడాతో గెలుపొందింది.అశ్విన్ తన కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది ఇక్కడే. కివీస్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 140 పరుగులిచ్చిన రవిచంద్రన్ 13 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

భారత కీపర్ సాహా 100 వికెట్లలో భాగస్వామి అయ్యేందుకు అవసరమైన వికెట్లు. ఇప్పటికి 97 (86 క్యాచ్‌లు, 11 స్టంపింగ్స్) మందిని ఔట్ చేసిన వృద్ధిమాన్ మరో ముగ్గురిని పెవిలియన్ పంపితే.. ధోనీ (294), కిర్మాణి (198), కిరణ్ మోరె (130), మోంగియా (107) తర్వాత ఈ ఫీట్ సాధించిన భారత ఐదో వికెట్ కీపర్‌గా నిలుస్తాడు.

435

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles