నిలబడి.. తడబడి!


Sun,August 13, 2017 12:49 AM

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 329/6
ధవన్ వీరోచిత సెంచరీ
-ఆకట్టుకున్న రాహుల్

sikhardhavan
ఓ దశలో భారత్ స్కోరు 39.2 ఓవర్లలో 188/0. కానీ.. ఆట ముగిసేసరికి 329/6.. అంటే కేవలం 50.4 ఓవర్లలో 141 పరుగులకు కీలకమైన 6 వికెట్లు చేజార్చుకున్న టీమ్‌ఇండియా మూడో టెస్టులో భారీస్కోరు చేసే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. ఆరంభంలో ఓపెనర్ల శుభారంభంతో పట్టుబిగించినట్లే కనిపించిన విరాట్‌సేన.. మిడిలార్డర్ వైఫల్యంతో శ్రీలంకకు పుంజుకునే అవకాశం ఇచ్చింది. ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్న భారత్.. రెండోరోజు ఎంత స్కోరు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది!

పల్లెకెలె: సొంతగడ్డపై శ్రీలంక బౌలర్లు తొలిసారి ఆకట్టుకున్నారు. భారీస్కోరు దిశగా సాగుతున్న భారత్‌ను కీలక సమయంలో వికెట్లు తీసి నియంత్రించారు. ఓపెనర్లు శిఖర్ ధవన్ (123 బంతుల్లో 119; 17 ఫోర్లు), లోకేశ్ రాహుల్ (135 బంతుల్లో 85; 8 ఫోర్లు) భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పినా.. చివరి రెండు సెషన్లలో బ్యాట్స్‌మెన్ నిరాశజనక ప్రదర్శనతో తొలిరోజు ఆట ముగిసేసరికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 329 పరుగులు చేసింది. సాహా (13 బ్యాటింగ్), హార్దిక్ పాండ్యా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుష్పకుమార 3, సందకాన్ 2 వికెట్లు పడగొట్టారు. సస్పెండ్ అయిన జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు భారత్ అవకాశం ఇవ్వగా..ఆతిథ్య జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది.

ఓపెనర్ల శుభారంభం..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ధవన్, రాహుల్ మరోసారి అద్భుతమైన శుభారంభాన్నిచ్చారు. పిచ్‌పై పచ్చిక ఉన్నా, నాణ్యమైన బౌన్స్ కనిపించినా.. లంక స్వింగ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీలైనప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ వేగంగా పరుగులు సాధించారు. ఫలితంగా 55 బంతుల్లో 50 పరుగులు, 18 ఓవర్లు ముగిసేసరికి 100 పరుగులు టీమ్‌ఇండియా ఖాతాలోకి చేరాయి. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విడదీసేందుకు చండిమల్.. రెండు ఎండ్‌ల నుంచి స్పిన్ అస్ర్తాన్ని ప్రయోగించాడు. ఓవైపు పెరీరా, మరోవైపు సందకాన్ బంతిని టర్న్ చేసే ప్రయత్నం చేసినా.. ధవన్-రాహుల్ మంచి ఫుట్ వర్క్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ధవన్ 45, రాహుల్ 67 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. రాహుల్‌కు ఇది వరుసగా ఏడో ఫిఫ్టీ కావడం విశేషం. ఈ సందర్భంగా గుండప్ప విశ్వనాథ్, ద్రవిడ్‌ల రికార్డు (6 హాఫ్ శతకాలు)ను అతను అధిగమించాడు. ఓవరాల్‌గా లంచ్ వరకు భారత్ 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది.

మూడేశారు..

లంచ్ తర్వాత లంక బౌలర్లు బాగా పుంజుకున్నారు. చకచకా మూడు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు. అప్పటి వరకు నిలకడగా ఆడిన ధవన్-రాహుల్ ఒక్కసారిగా జోరు పెంచే ప్రయత్నంలో వికెట్లను సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో పుష్పకుమార బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో రాహుల్.. మిడాఫ్‌లో కరుణరత్నే చేతికి చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇప్పటివరకు విదేశీ టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం (173) రికార్డును ధవన్-రాహుల్ సవరించారు. 1993లో ప్రభాకర్-సిద్ధూ ఈ రికార్డును నెలకొల్పారు. చతేశ్వర్ పుజార (8)తో జతకలిసిన ధవన్.. 107 బంతుల్లో ఈ సిరీస్‌లో రెండో శతకాన్ని సాధించాడు. అతని కెరీర్‌లో ఇది ఆరో టెస్టు శతకం. రెండో వికెట్‌కు 31 పరుగులు జత చేశాక ధవన్ ఇచ్చిన క్యాచ్‌ను స్కేర్ లెగ్‌లో చండిమల్ నేర్పుగా అందుకున్నాడు. ఆరంభం నుంచి క్రీజులో ఇబ్బందిగా కదిలిన పుజార.. ఇన్నింగ్స్ 51వ ఓవర్‌లో వెనుదిరిగాడు. దీంతో కోహ్లీ (42), రహానే (17).. 235/3 స్కోరుతో టీ విరామానికి వెళ్లారు.

విరాట్ విఫలం..

రెండో సెషన్‌లో మూడు వికెట్లు పడటంతో భారత్‌పై ఒత్తిడి నెలకొంది. క్రీజులో ఉన్న విరాట్, రహానేలతో ఇది స్పష్టంగా కనిపించింది. లంక స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఈ ఇద్దరు తడబడటంతో సింగిల్స్ కూడా రాలేదు. చివరకు ఒత్తిడిని అధిగమించలేకపోయిన రహానే.. ఓ చెత్త బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 35 పరుగులు సమకూరాయి. ఇక అశ్విన్ (31), కోహ్లీ ఎదురుదాడికి దిగినా.. లంకేయులు పట్టువదలకుండా పోరాడారు. ఇన్నింగ్స్ 79వ ఓవర్‌లో విరాట్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. సాహా, అశ్విన్ చెరోసారి డీఆర్‌ఎస్ నుంచి బయటపడ్డారు. మరో రెండు ఓవర్లలో తొలి రోజు ముగుస్తుందనగా అశ్విన్ అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. ఈ సెషన్‌లోనూ 3 వికెట్లు తీసిన లంక.. భారత్‌ను నియంత్రించడంలో బాగా సఫలమైంది.

గతంలో నేను చాలా రక్షణాత్మకంగా ఆడేవాడిని. అందుకే అనుభవం ఉన్నా టెస్టుల్లో విఫలమయ్యా. కానీ ఇప్పుడు నా దృక్పథం మారింది. నా సహజసిద్ధమైన ఆటను మొదలుపెట్టా. ఈ చిట్కా బాగా పని చేస్తున్నది. వికెట్ కాస్త నెమ్మదిగా ఉంది.
అనుకున్నంత బౌన్స్ రావడం లేదు. నేను దూకుడుగా ఆడతానని అందరికీ తెలుసు. అందుకే అంతే దూకుడుగా వికెట్ సమర్పించుకున్నా. స్లిప్‌లో క్యాచ్ ఇస్తే డిఫెన్సివ్ ైస్టెల్. ఇది నేను ఆడే విధానానికి విరుద్ధం. స్కేర్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యా. చివరి రెండు సెషన్లలో ఆరు వికెట్లు పడటం ఇదే తొలిసారి. ఔట్ ఫీల్డ్ వేగంగా లేదు. కాబట్టి పరుగులు చేయడం అంత సులభం కాదు. అయినా కూడా మేం మంచి స్థితిలోనే ఉన్నాం. లోయర్ ఆర్డర్‌లో కూడా పరుగులు చేసే బ్యాట్స్‌మెన్ ఉన్నారు.
- శిఖర్ ధవన్
lokesh
1.ఒక టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలు చేయడం ధవన్‌కు ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు ఆరు శతకాలు చేసిన శిఖర్.. ఐదు విదేశాల్లోనే సాధించడం విశేషం.

3.గత నాలుగేండ్లలో లంక గడ్డపై తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల(188) భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తొలి జంట ధవన్-రాహుల్. బంగ్లా జోడి తమీమ్-సౌమ్య సర్కార్ 118 పరుగులతో రెండో స్థానంలో ఉన్నది.
సెహ్వాగ్ తర్వాత లంకపై మూడు శతకాలు చేసిన రెండో భారత ఓపెనర్ ధవన్.

6.ఈ మ్యాచ్‌లో భారత్ 17.4 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. 2001 నుంచి ఇప్పటి వరకు వేగవంతంగా వంద పరుగులు చేయడం ఇది ఆరోసారి.

7.ఈ సీజన్‌లో రాహుల్‌కు ఇది వరుసగా ఏడో అర్ధసెంచరీ. ఈ ఫీట్‌ను సాధించిన ఆరో ఆటగాడు రాహుల్. ఎవర్టన్ వీకిస్, ఆండీ ఫ్లవర్, చందర్‌పాల్,సంగక్కర, రోజర్స్ ఈ జాబితాలో ముందున్నారు.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: ధవన్ (సి) చండిమల్ (బి) పుష్పకుమార 119, రాహుల్ (సి) కరుణరత్నే (బి) పుష్పకుమార 85, పుజార (సి) మాథ్యూస్ (బి) సందాకన్ 8, కోహ్లీ (సి) కరుణరత్నే (బి) సందాకన్ 42, రహానే (బి) పుష్పకుమార 17, అశ్విన్ (సి) డిక్‌వెల్లా (బి) ఫెర్నాండో 31, సాహా (బ్యాటింగ్) 13, హార్దిక్ (బ్యాటింగ్) 1,
ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 90 ఓవర్లలో 329/6.
వికెట్లపతనం: 1-188, 2-219, 3-229, 4-264, 5-296, 6-322.
బౌలింగ్: ఫెర్నాండో 19-2-68-1, కుమార 15-1-67-0, కరుణరత్నే 5-0-23-0, పెరీరా 8-1-36-0, సందకాన్ 25-2-84-2,పుష్పకుమార 18-2-40-3.

396

More News

VIRAL NEWS