బ్యాటింగ్ బేజారు..


Sun,September 9, 2018 12:53 AM

-అండర్సన్, స్టోక్స్ విజృంభణ
-భారత్ తొలి ఇన్నింగ్స్ 174/6
-ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్
వేదికలు మారుతున్నా..భారత బ్యాటింగ్ తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు వరుస ఓటముల నేపథ్యంలో మాజీలు విమర్శలు గుప్పిస్తున్నా..తమ ఆటతీరు మార్చుకోకుండా అప్పనంగా వికెట్లు సమర్పించుకుంటున్న తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. ఆతిథ్య జట్టు పరుగుల వరద పారిస్తున్న చోట మనోళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమవుతూ పరాజయాలకు కారణమవుతున్నారు. గత టెస్ట్‌లకు కొనసాగింపు అన్నట్లుగా పేలవ బ్యాటింగ్ ప్రదర్శిస్తున్న భారత్..మరోమారు ఇంగ్లండ్ బౌలింగ్‌కు దాసోహమైంది. కెప్టెన్ కోహ్లీ మినహా పరుగుల వేటలో సహచరులు విఫలమైన వేళ టీమ్‌ఇండియా మరో ఓటమికి అడుగుదూరంలో ఉన్నది. సీనియర్లు ఆకట్టుకోని చోట తెలుగు కుర్రాడు విహారీ తెగువచూపుతుండటం కొంతలో కొంత ఊరట కల్గించే అంశం. బట్లర్, బ్రాడ్ బాదుడుతో భారీ స్కోరు అందుకున్న ఇంగ్లండ్..ఐదో టెస్ట్‌పై మరింత పట్టు బిగించింది.
kohli
లండన్: భారత్ బ్యాటింగ్ కుదేలైంది. గత సిరీస్‌లకు భిన్నంగా బౌలర్లు అంచనాలకు మించి రాణిస్తున్నా..తాము ఇంతే అన్న రీతిలో మన బ్యాటుగాళ్లు ఇంగ్లండ్ గడ్డపై పరుగుల వేటలో విఫలమవుతూనే ఉన్నారు. సుదీర్ఘ సమరంలో ఇప్పటికే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకున్న భారత్..కనీసం ఆఖరి టెస్ట్‌లోనైనా గెలిచి పరువు అయినా నిలుపుకుంటుందా అన్న అంచనాలు తలక్రిందులవుతున్నాయి. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ హోదాకు భిన్నంగా ఇంగ్లండ్ ముందు మోకరిల్లుతున్నది. ఆఖర్లో చిక్కినట్లే చిక్కిన పట్టును బౌలర్లు జారవిడువడంతో భారీ స్కోరు అందుకున్న ఇంగ్లండ్..ఐదో టెస్ట్‌పై పట్టు బిగించింది. అండర్సన్(2/20), స్టోక్స్(2/44) విజృంభణతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆరు పరుగులకే ఓపెనర్ ధవన్(3)..బ్రాడ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. షాట్ ఆడేందుకు పోయిన ధవన్‌ను బ్రాడ్ స్వింగ్ బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత రాహుల్(37), పుజార(37) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

వీరిద్దరు కలిసి సమయోచితంగా ఆడుతూ స్కోరుబోర్డుకు విలువైన పరుగులు జోడించారు. ఇక కుదురుకుందనుకున్న దశలో రాహుల్‌ను కర్రాన్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 64 పరుగుల పార్టనర్‌షిప్‌నకు బ్రేక్ పడింది. ఆ తర్వాత పుజార, కెప్టెన్ కోహ్లీ(49) ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. అయితే రెండు పరుగుల తేడాతో పుజార, రహానే(0)ను అండర్సన్ ఔట్ చేయడంతో టీమ్‌ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రహానే తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తెలుగు యువ క్రికెటర్ విహారీ(25 నాటౌట్) ఆదిలో కొంత తడబడ్డా..ఆ తర్వాత కోహ్లీ అండతో ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాడు. వీరిద్దరి బ్యాటింగ్‌తో గాడిలోకి వచ్చిందనుకున్న తరుణంలో స్టోక్స్ దెబ్బ కొట్టాడు. ఆరు పరుగుల తేడాతో కోహ్లీతో పాటు పంత్(5)ను ఔట్ చేయడంతో బ్యాటింగ్ కకావికలైంది. చేతిలో 4 వికెట్లు ఉన్న భారత్..ఇంకా 158 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది.

stokes

బట్లర్, బ్రాడ్ విజృంభణ:

ఇంగ్లండ్ లోయార్డర్ మరోమారు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. తొలి రోజు ఆఖరి సెషన్‌లో వెంటవెంటనే వికెట్లు పడగొట్టామనుకున్న టీమ్‌ఇండియా బౌలర్లకు తోక బ్యాటింగ్ ముచ్చెమటలు పట్టించింది. ఓవైపు పిచ్‌పై తేమ పరిస్థితులను బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నా..వికెట్లు తీయడంలో మనోళ్లు విఫలమయ్యారు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు 198/7తో రెండో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 122 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్(89) మరోసారి అర్ధసెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలకమయ్యాడు. రషీద్(15)తో కలిసి దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తూ బట్లర్ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో రషీద్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. తన ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లినా..నిరాశే ఎదురైంది. దీంతో ఎనిమిదో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను చుట్టేయచ్చు అనుకున్న కోహ్లీసేనకు బట్లర్, స్టూవర్ట్ బ్రాడ్(38) జోడీ అడ్డుకట్ట వేసింది. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ వీరిద్దరు క్రీజులో పాతుకుపోయారు.

కెప్టెన్ కోహ్లీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. టీమ్‌ఇండియా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో పరుగులు కొల్లగొట్టారు. ఈ క్రమంలో బట్లర్..84 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఇంగ్లండ్ 104వ ఓవర్లో 250 మార్క్ అందుకుంది. మరోవైపు తానేం తక్కువ కాదన్నట్లు బ్రాడ్ కూడా చెలరేగడంతో పరుగులు అలవోకగా వచ్చాయి. దీంతో 61 బంతుల్లోనే 50 పరుగులు జతకలిశాయి. ఇలా ఏ దశలోనూ మన బౌలింగ్‌కు తలొగ్గని వీరిద్దరు భారీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న తరుణంలో బ్రాడ్‌ను జడేజా ఔట్ చేశాడు. దీంతో తొమ్మిదో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అయినా జోరు తగ్గించని బట్లర్..అండర్సన్(0 నాటౌట్)తో కలిసి బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే జడేజా బౌలింగ్‌లో బట్లర్ ఆఖరి వికెట్‌గా వెనుదిరుగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

స్కోరుబోర్డు

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్(బి)బుమ్రా 71, జెన్నింగ్స్(సి)రాహుల్(బి)జడేజా 23, అలీ(సి)పంత్(బి)ఇషాంత్ 50, రూట్(ఎల్బీ)బుమ్రా 0, బెయిర్‌స్టో(సి)పంత్(బి)ఇషాంత్ 0, స్టోక్స్(సి)ఎల్బీ(బి)జడేజా 11, బట్లర్(సి)రహానే(బి)జడేజా 89, కర్రాన్ (సి)పంత్(బి)ఇషాంత్ 0, రషీద్(ఎల్బీ)బుమ్రా 15, బ్రాడ్(సి)రాహుల్(బి)జడేజా 38, అండర్సన్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 35; మొత్తం: 122 ఓవర్లలో 332 ఆలౌట్; వికెట్ల పతనం: 1-60, 2-133, 3-133, 4-134, 5-171, 6-177, 7-181, 8-214, 9-312, 10-332; బౌలింగ్: బుమ్రా 30-9-83-3, ఇషాంత్ 31-12-62-3, విహారీ 1-0-1-0, షమీ 30-7-72-0, జడేజా 30-0-79-4.

భారత్తొలిఇన్నింగ్స్: రాహుల్(బి)కర్రాన్37, ధవన్(ఎల్బీ)బ్రాడ్ 3, పుజార(సి)బెయిర్‌స్టో(బి)అండర్సన్37, కోహ్లీ(సి)రూట్(బి)స్టోక్స్49, రహానే(సి)కుక్(బి)అండర్సన్ 0, విహారీ 25 నాటౌట్, పంత్(సి)కుక్(బి)స్టోక్స్ 5, జడేజా 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 51 ఓవర్లలో 174/6; వికెట్ల పతనం: 1-6, 2-70, 3-101, 4-103, 5-154, 6-160; బౌలింగ్: అండర్సన్ 11-3-20-2, బ్రాడ్ 11-3-25-1, స్టోక్స్ 11-1-44-2, కర్రాన్ 10-1-46-1, అలీ 8-0-29-0.

413

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles